తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

నమ్మిన మనసుకి... వంచనే మిగిలింది! - love failure stories

.

To the mind of the believer deception remains!
నమ్మిన మనసుకి... వంచనే మిగిలింది!

By

Published : May 1, 2021, 10:56 AM IST

మా ప్రాజెక్ట్‌ సూపర్‌ సక్సెస్‌. రెండు నెలలుగా సెలవులు లేకుండా పని చేసింది మా టీం. బాస్‌ ఫుల్‌ ఖుషీ. నెల జీతం బోనస్‌గా ఇచ్చి వారం సెలవు తీసుకోమన్నారు. అమ్మని చూడాలనిపించింది. కానీ ఇంటికెళితే పెళ్లిగోల. రేపు ఆలోచిద్దాంలే అని రూంకెళ్లి పడుకున్నా.

సడన్‌గా ‘ఐ లవ్యూ’

ఫోన్‌ మోతతో మెలకువ వచ్చింది. చూస్తే మధ్యాహ్నం ఒకటి. ఏదో కొత్త నంబరు. ‘హలో’ అన్నాను. ‘ఆ.. నేనే’ అటునుంచి దర్పంగా ఓ గొంతు. నా గుండెలో పాత గాయం మళ్లీ రేగింది. మౌనిక! ఏడాదవుతోంది తనతో మాట్లాడి. ఎంసీఏలో నా జూనియర్‌. ఫ్రెషర్స్‌డేలో నా స్పీచ్‌ విని ‘సూపర్‌’ అంటూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చింది. నాలో వైబ్రేషన్స్‌ మొదలయ్యాయి. తర్వాత ఇద్దరి మధ్యా ఫ్రెండ్‌షిప్‌ బలపడింది. ఒక రోజు సడన్‌గా ‘ఐ లవ్యూ’ అంది. చలాకీ అమ్మాయి.. పైగా అందంగా ఉంటుంది. నేనూ ఓకే చెప్పా. తను నా పక్కనుంటే నాలో సంతోషాల సునామీనే. ఎంబీఏ అయిపోయాక హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరా. ఇద్దరి మధ్యా దూరాన్ని ఫోన్‌ చెరిపేసేది. తన చదువూ ముగిశాక బెంగళూరులో ఉండే బావ రిఫరెన్సుతో అక్కడే జాబ్‌లో చేరింది.

నాకు ఉద్యోగం
అక్కడికెళ్లాక అకస్మాత్తుగా తనలో మార్పు! పొడిపొడి మాటలే. ఓరోజు ‘నీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఎంత? ప్రాపర్టీస్‌ ఏంటి?’ అనడిగింది. నా మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ‘నీకు తెలియనిదేమీ కాదు. మాకు ఆస్తిపాస్తులేం లేవు. నాన్న ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌. ఇప్పుడవన్నీ ఎందుకు? నాకు మంచి ఉద్యోగం ఉంది. నువ్వూ జాబ్‌ చేస్తున్నావు. ఇద్దరం కలిసి కొనుక్కోలేమా’ అన్నాను. ‘ఆ.. ఏం జాబ్‌లు. ఎప్పుడు ఊడతాయో తెలీదు. వెనుక ప్రాపర్టీలుంటే అదో ధైర్యం’ తన మాటల్లో నిగూఢార్థం. తర్వాత నుంచి ఫోన్లు లేవు. నేను చేస్తే కట్‌ చేసేది.

ఇప్పుడు వద్దంటున్నాడు

‘హలో! హలో! వింటున్నావా?’ తన మాటలతో మళ్లీ ఈ లోకంలోకి వచ్చా. ‘ఏంటీ నన్ను మర్చిపోయావా? ఒకసారి బెంగళూరు రాకూడదూ. నీతో చాలా విషయాలు చెప్పాలి’ అంది. నా గుండెలో మళ్లీ ఆశల వర్షం కురిసింది. ఏవేవో ఊసులు. తను మారిందా? నన్నే కోరుకుంటోందా..? ఆదరాబాదరాగా బ్యాగు సర్దుకుని కాచిగూడ రైల్వేస్టేషన్‌కి పరిగెత్తా. వెళ్లే దారిలో ఖరీదైన చాక్లెట్‌ ఒకటి కొన్నా. జనరల్‌ బోగీలో దాదాపు ఎనిమిది గంటలు నిల్చొని తను చెప్పిన చోటుకు వెళ్లా. గంట తర్వాత వచ్చింది. మొహంలో ఆనందం లేదు. నా చెయ్యి పట్టుకుని, ‘నేను మోసపోయాను!’ అంది. నాకేమీ అర్థం కాలేదు. ‘వాడు.. కిరణ్‌.. వన్‌ ఇయర్‌ లవ్‌ చేసి, ఇప్పుడు వద్దంటున్నాడు. నాకు వాడు కావాలి! తను లేకపోతే బతకలేను. నా ఫ్రెండ్‌గా నువ్వే మమ్మల్ని కలపాలి’ అంటుంటే నా మెదడు మొద్దుబారిపోయింది. స్వార్థంలో పీక్స్‌ లెవల్‌ అది. ఏదో సర్దిచెప్పి అక్కడి నుంచి వచ్చేశా. మూడు రైళ్లు మారి ఇంటికి చేరుకున్నా. నన్ను చూడగానే అమ్మ కంట్లో నీరు. సాయంత్రం నాన్నొచ్చాక ‘చూడండి.. నా కొడుకు నాకోసం ఎంత పెద్ద చాక్లెట్‌ తెచ్చాడో’ అని పొంగిపోతూ చెప్పింది. ఆ క్షణం అమ్మని ఎంత బాధపెడుతున్నానో తెలిసొచ్చింది. వెంటనే ‘అమ్మా.. నువ్వు చూసిన అమ్మాయినే పెళ్లిచేసుకుంటాను. నాకు ఆస్తులేం అక్కర్లేదు. తను మీ ఇద్దర్నీ బాగా చూసుకుంటే చాలు’ అని చెప్పా. అమ్మ కళ్లలో ఏదో మెరుపు. సంతోషంతో నన్ను దగ్గరకు తీసుకుంది.

ఇదీ చూడండి:వివాహం, శుభకార్యాలపై రెండో దశ కరోనా ప్రభావం

ABOUT THE AUTHOR

...view details