తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

దాంపత్య బంధానికి తొలి ఏడాదే పునాది!

పెళ్లనేది జీవితంలో ఎంత ముఖ్యమైన ఘట్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంత అందమైన అనుబంధాన్ని కలకాలం నిలుపుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు భార్యాభర్తలు. కష్టమైనా, సుఖమైనా కలిసే పంచుకుంటారు. ఎలాంటి సమస్యలొచ్చినా కలిసికట్టుగా ఎదుర్కొంటారు. ఇవే ప్రేమ, ఆప్యాయతల్ని ఇద్దరూ జీవితాంతం కొనసాగించాలన్నా, దాంపత్య జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలన్నా.. పెళ్త్లెన తొలి ఏడాది ఎంతో కీలకం. ఎందుకంటే ఈ సమయంలో భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే వారి మధ్య బంధం అంతగా దృఢమవుతుంది.

By

Published : Jun 27, 2021, 12:24 PM IST

దాంపత్య జీవితానికి చిట్కాలు, అందమైన జీవితం, భార్యాభర్తలు బంధం, బలమైన బంధానకి
దాంపత్య జీవితానికి చిట్కాలు, అందమైన జీవితం, భార్యాభర్తలు బంధం, బలమైన బంధానకి

ఒకరినొకరు అర్థం చేసుకోవడమైనా, ఒకరి అభిరుచుల్ని మరొకరు గ్రహించడమైనా, ఒకరి ఇష్టప్రకారం మరొకరు నడుచుకోవడమైనా.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ దంపతులు ఆలోచించి అడుగేస్తే ఆ దాంపత్యం చిగురులోనే మొగ్గ తొడుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఆలుమగల సంసారం జీవితాంతం ఆనందంగా సాగాలంటే.. పెళ్లయిన తొలి ఏడాది వారు ఎలాంటి అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలో తెలుసుకుందాం రండి..

ఇవన్నీ తెలుసుకోవాలి..

సాధారణంగా మనకు పరిచయమైన వ్యక్తులు లేదంటే స్నేహితులు, హీరోలు, హీరోయిన్లు.. వీరిలో మనకు నచ్చిన వ్యక్తుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటాం. అలాంటిది మన జీవితంలో సగభాగమైన భాగస్వామి గురించి తెలుసుకోకపోతే ఎలా? కాబట్టి ఇతరుల గురించి కాసేపు పక్కన పెట్టి భాగస్వామికి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవడంలో శ్రద్ధ చూపాలి. ఇందుకు పెళ్లయిన తొలి రోజులే మంచి సమయం. అయితే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే కొన్ని రోజుల్లో కుదరకపోవచ్చు. అందుకే పెళ్లయిన తొలి ఏడాది మీ భాగస్వామి మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ల అభిరుచులేంటి? ఇష్టాయిష్టాలేంటి? వారి జీవన విధానాలేంటి? మొదలైన విషయాలన్నీ వారి ప్రవర్తన ఆధారంగా గమనించడం లేదంటే ఎక్కువ సమయం కేటాయించి వారితో ప్రేమగా మాట్లాడడం.. వంటివి చేయాలి. ఫలితంగా భాగస్వామి గురించి, వారి స్వభావం గురించి ఓ అవగాహన వస్తుంది.

దాచొద్దు..

'దంపతుల మధ్య దాపరికాలుండద్దు..' అంటారు పెద్దలు. కానీ పెళ్లయిన కొత్తలో కొంతమంది దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల అన్ని విషయాలు పంచుకోలేకపోవచ్చు. ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎదుటి వారికి చెప్పడానికి కాస్త తడబడుతుంటారు. ఇందుకు ముఖ్యంగా 'ఈ విషయం చెబితే వారు ఏమనుకుంటారో ఏమో? ఇది కూడా ఎలా పరిష్కరించుకోవాలో తెలియదా.. అని అనుకుంటారేమో..' అనే మొహమాటాలు కారణమవుతాయి. అలాగని వారితో పంచుకోకపోతే ఆ దూరం అలాగే ఉండిపోతుంది. కాబట్టి పెళ్త్లెనప్పటి నుంచే దంపతులు ఎలాంటి విషయాలనైనా ఒకరికొకరు చెప్పుకోవడం, అందులోని క్లిష్ట సందర్భాల్ని కలిసి ఎదుర్కోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా ముందు నుంచీ చేయడం వల్ల పోను పోను భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలూ లేకుండా వారి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది. ఇది ఎన్నేళ్లయినా తరగకుండా అలాగే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నిర్లక్ష్యం చేయొద్దు..

భార్యాభర్తల బంధం అంటే భారం కాదు.. బాధ్యత. అయితే పెళ్త్లెన కొత్తలో ఒకరిపై మరొకరికి అవగాహన లేకపోవడం వల్ల చిన్న చిన్న అలకలు, గొడవలు సహజం. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడూ ఇలాంటివి లేకపోతే ఆ అనుబంధం మరింతగా ఎలా బలపడుతుంది చెప్పండి? అలాగని ఓ సమయం, సందర్భం అంటూ లేకుండా గొడవపడతారా ఏంటీ? అసలు ఇలాంటివి దంపతుల మధ్య ఎందుకుండాలి అంటే.. ఈ సందర్భాల్లోనే అలకలు తీర్చడం, ఓదార్చడం, దగ్గరికి తీసుకోవడం.. మొదలైన పనుల ద్వారానే ఒకరిపై మరొకరికి ఎంత ప్రేముందో అర్థమయ్యేది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. మీరు అలిగినప్పుడు మీ భాగస్వామి ఉన్న పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాకాకుండా ఆ కోపాన్ని అలానే కొనసాగిస్తే.. ఇద్దరి మధ్య దూరం రెట్టింపవుతుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో కోపతాపాలకు సెలవిచ్చి మరీ భాగస్వామికి అండగా ఉన్నారనుకోండి.. వారు కూడా ఎంతో సంతోషిస్తారు. అలాగే మీపై మరెంతగానో ప్రేమ పెరిగిపోతుంది.

కలుపుగోలుగా..

దాంపత్య బంధం అంటే కేవలం భార్యాభర్తలే కాదు.. వారి ఇరు కుటుంబ సభ్యులు కూడా అందులో భాగమే. ఇంకా చెప్పాలంటే పెళ్లయిన తొలి ఏడాది వారి పాత్ర మరింత కీలకం. ఎందుకంటే ఆ సమయంలో భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడంతో ఇద్దరూ అర్థం చేసుకోలేక ఎక్కడ గొడవపడతారోనని పెద్దవారు ఓ కంట కనిపెడుతూ, అభిప్రాయబేధాలు వచ్చినప్పుడు సర్దిచెబుతూ ఉంటారు. అందుకే ఇద్దరూ ఇరు కుటుంబాలతో సత్సంబంధాలు మెరుగుపరచుకోవాలి. తరచూ అత్తమామలు, దగ్గరి బంధువుల ఇళ్లకు వెళ్లడం, వారితో తరచూ ఫోన్లో మాట్లాడుతుండడం.. వంటివి చేయడం వల్ల వారితో దంపతులకుండే అనుబంధం మరింత దృఢంగా మారడమే కాదు.. భార్యాభర్తల అనుబంధం కూడా పటిష్టమవుతుంది.

నచ్చినట్లుగా..

దాంపత్య జీవితం కలకాలం సుఖంగా సాగాలంటే.. అందుకు ఒకరి ఇష్టాల్ని మరొకరు గౌరవించడం, ఎదుటి వారికి నచ్చినట్లుగా మెలగడం.. వంటివి కూడా ముఖ్యమే. అయితే కొంతమంది దంపతుల్లో 'వారికి నచ్చినట్లుగా నేనెందుకు చేయాలి? వారికోసం నా ఇష్టాన్ని ఎందుకు వదులుకోవాలి?' అనే స్వార్థం, అసూయ.. వంటి భావాలుంటాయి. పెళ్లికి ముందు వరకు ఎలా ఉన్నా.. వీటివల్ల పెద్ద సమస్యలేమీ ఉండకపోవచ్చు. కానీ పెళ్త్లెన తర్వాత కూడా వీటినే కొనసాగిస్తానంటే మాత్రం దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదొడుకులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్త్లెన తొలి రోజుల నుంచే ఇలాంటి వాటిని వదిలిపెట్టి ప్రతి విషయంలో ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి సంతోషం కోసం మరొకరు ఏది చేయడానికైనా సిద్ధపడడం.. వంటివి అలవాటు చేసుకుంటే భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటూ, కలకాలం చిలకాగోరింకల్లా కలిసిపోతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

పెళ్త్లెన తొలి ఏడాది దంపతులు ఎలాంటి విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి.. వాటి వల్ల వారి దాంపత్య జీవితం ఎంతగా దృఢమవుతుందో తెలుసుకున్నారు కదా! మరి మీరూ వీటిని ప్రయత్నించి ఆలుమగల అనుబంధంలో ఉన్న మధురానుభూతుల్ని ఆస్వాదించండి..

ఇదీ చూడండి:ఎస్సీ సాధికారతపై సర్కార్​ నజర్​.. నేడు సీఎం అఖిలపక్ష భేటీ

ABOUT THE AUTHOR

...view details