తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

స్వీట్‌హార్ట్‌తో స్నేహం.. చేసేద్దామిలా...!

సంసార జీవితం సంతోషంగా ముందుకు సాగిపోవాలంటే ఆలుమగలు అన్యోన్యంగా మెలగడం ఎంతో ముఖ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే దంపతులిద్దరూ తమ మధ్య స్నేహపూర్వక వాతావరణం అలవర్చుకోవాలి. అప్పుడే భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో స్నేహంగా ఎలా మెలగాలి?? ఈ క్రమంలో ఎలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.. రండి తెలుసుకుందాం.

tips to become your husband as your best friend
స్వీట్‌హార్ట్‌తో స్నేహం.. చేసేద్దామిలా...!

By

Published : Jun 24, 2020, 11:02 AM IST

కలిసి సమయం గడపండి..

ఎంత తీరిక లేని ప్రణాళికలు ఉన్నా భార్యాభర్తలిద్దరూ కలిసి రోజులో కాసేపైనా సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అయితే ఈ సమయంలో ఇద్దరికీ నచ్చే పనులు అంటే.. డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం.. వంటివి చేయాలి. కాస్త భిన్నంగా ప్రయత్నించాలనుకుంటే ఇద్దరూ కలిసి కొత్త పనులు చేయడం ప్రారంభించండి. ఉదాహరణకు సంగీతం నేర్చుకోవడం, పెయింటింగ్స్ వేయడం.. ఇలా ఏం చేసినా ఇద్దరూ కలిసే చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి. వీలైతే మీకు ఆసక్తి ఉన్న అంశాలపై శిక్షణ తరగతుల్లో చేరొచ్చు. ఫలితంగా ఇద్దరి మధ్యా మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది.. ఇది సంసార బంధం మరింత బలపడడానికి దోహదం చేసే అతిముఖ్యమైన అంశం.

నమ్మకం, నిజాయతీ ముఖ్యం..

ఆలుమగల మధ్య బంధం బలపడడానికి పరస్పరం నమ్మకం, నిజాయతీతో వ్యవహరించడం చాలా ముఖ్యం. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా అది బంధాన్నే బీటలు వారేలా చేస్తుంది. కాబట్టి జీవిత భాగస్వామితో అన్ని విషయాలనూ పంచుకుంటూ, అన్ని విషయాల్లో ఒకరికొకరు నమ్మకంతో మెలగడం వల్ల ఇటు ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతూనే అటు భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢమవుతుంది.

భారం పంచుకోండి..

భాగస్వామితో స్నేహబంధాన్ని పెంచుకోవడానికి ఉపకరించే మరో మార్గం పని భారాన్ని పంచుకోవడం. ఈ క్రమంలో మీరు మీ భర్త పని పంచుకోవడం లేదా మీరు చేయాల్సిన పనుల్లో అతని భాగస్వామ్యం కోరడం.. వంటివి చేయచ్చు. ఫలితంగా ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత పొందడంతోపాటు ఇద్దరూ కలిసి కాసేపు సమయం గడిపిన భావన కూడా కలుగుతుంది.

సర్దుకుపోవాలి..

'ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దాం అని పొద్దున్న అన్నారు.. రాత్రి ఎనిమిదైనా ఇంటికి చేరలేదు..' అంటూ మాటతప్పిన భర్తపై భార్య చి ర్రుబుర్రులాడుతుంది. నిజమే.. ఇలాంటి సందర్భాలు చాలామంది దంపతులకు ఎదురయ్యేవే. అయితే ఆలస్యానికి గల కారణం కనుక్కోవాలి, తదనుగుణంగానే ప్రవర్తించాలి. అంతేకానీ ఇంటికి వచ్చిన వెంటనే భాగస్వామిపై కోపంతో చిర్రుబుర్రులాడితే వారికి ఉన్న కాస్త ఓపిక కూడా నశించి ఇద్దరి మధ్యా గొడవలు జరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఆలుమగలిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సర్దుకుపోతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి సన్నిహిత వాతావరణం కల్పించినప్పుడే దంపతులిద్దరూ అన్ని విషయాలు ఒకరితో మరొకరు పంచుకోగలుగుతారు.

నువ్వెప్పుడూ ప్రత్యేకమే..

మీ జీవిత భాగస్వామి పట్ల అపరిమితమైన ప్రేమ మీకు ఉన్నా అది మీ మనసులోనే దాచేసుకుంటే ఎలా?? ఆ విషయాన్ని వారికి కూడా సందర్భానుసారంగా తెలియజేస్తూ ఉండాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు.. వంటి ప్రత్యేక సందర్భాలతో పాటు అప్పుడప్పుడూ వారికి బహుమతులు అందిస్తూ వారెప్పుడూ మీకు ప్రత్యేకమే అని వారికి అర్థమయ్యేలా తెలియజేయాలి. ఫలితంగా వారి మదిలో కూడా మీకు ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. ఆలుమగల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.

ఇలా కూడా..

  • భాగస్వామిలో కేవలం బలాలనే కాదు.. బలహీనతలను సైతం మనస్ఫూర్తిగా అంగీకరించాలి. వాటిని అధిగమించే దిశగా వారిని ప్రోత్సహిస్తూనే తగిన సహాయం అందించాలి.
  • భాగస్వామి అభిరుచులను గమనించి వాటిలో మరింత రాణించేలా వెన్నుతట్టాలి.. అలాగే చేసే ప్రతి పనిలోనూ వారికి 'నీ వెంట నేనున్నా..' అనే భరోసా ఇవ్వగలగాలి.
  • ప్రతిభా పాటవాలను ప్రదర్శించినప్పుడు ప్రశంసించాలి.
  • ఆలుమగలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరితో మరొకరు బిగ్గరగా అరుచుకున్నట్లుగా మాట్లాడుకోకూడదు. సౌమ్యంగానే సంభాషిస్తూ సమస్యను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నించాలి.
  • అన్నింటికంటే ముఖ్యంగా భాగస్వామికి తగిన గౌరవం ఇవ్వాలి..
  • ఇవన్నీ చేస్తే ఆలుమగల మధ్య స్నేహబంధం మరింత బలపడుతుంది. ఫలితంగా సాన్నిహిత్యం పెరిగి వైవాహిక బంధం కూడా దృఢమవుతుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details