భార్యాభర్తలిద్దరికీ వ్యాయామం చేయడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం వంటి అలవాట్లున్నాయనుకోండి.. ఇలాంటి వాటిని వారు అలాగే కొనసాగిస్తూ.. ఆయా పనులు ఇద్దరూ కలిసి చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇద్దరూ కలిసి ఇలాంటివి ఒకేసారి చేయడం వల్ల బోలెడంత ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇలాంటి ఉమ్మడి అలవాట్ల వల్ల ఇద్దరూ కలిసి గడిపే సమయం పెరుగుతుంది. తద్వారా ఇద్దరి మధ్య అనుబంధం పదింతలవుతుంది.
చేతులు పట్టుకుని..
కొందరు భార్యాభర్తలు బయటికి వెళ్లినప్పుడు రోడ్డుపై నడుస్తుంటే.. ఒకరు ముందు, మరొకరు వెనక.. ఇలా నడుస్తుంటారు. దీనికి వారు నడిచే వేగం కూడా కారణం కావచ్చు. కానీ దంపతులిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లినా పక్కపక్కనే, ఒకరి చేయి మరొకరు పట్టుకొని నడిచే అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందట! కాబట్టి ఆలుమగలిద్దరూ ఎక్కడికెళ్లినా సరే కలిసి నడుద్దాం.. అనే అలవాటును అలవరచుకోవడం తప్పనిసరి.
ఒకేసారి..
అలాగే దంపతులిద్దరూ పడకగదిలోకి ఒకేసారి ప్రవేశించడం కూడా ఒక అలవాటుగా మార్చుకోవాలంటున్నారు నిపుణులు. పడుకోవడానికి ముందు ఆలుమగలిద్దరూ కలిసి కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోవడం, సరసాలాడుకోవడం.. వంటివి చేయడం వారి అనుబంధానికి తప్పనిసరి. అయితే కొందరు ఆఫీసు నుంచి ఇంటికి లేటుగా రావడం, తొందరగా వచ్చినా వేరేపనుల్లో బిజీగా ఉండడం మొదలైన కారణాల వల్ల దంపతులిద్దరూ ఏకాంతంగా గడిపే అవకాశాన్ని కోల్పోతుంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో భార్యాభర్తలు వారి టైమింగ్స్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి లేదంటే ఒకరి పనుల్లో మరొకరు సహాయపడి.. తద్వారా పనులన్నీ త్వరగా ముగించుకొని ఇద్దరూ ఒకేసారి పడకగదిలోకి చేరేలా అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
రొమాంటిక్‌గా..
అందంగా ముస్తాబైనప్పుడో.. లేదంటే భాగస్వామి చేసిన పనులు నచ్చినప్పుడో వారిని హగ్ చేసుకోవడం, చిలిపిగా ఓ ముద్దు పెట్టడం.. వంటివి రోజువారీ అలవాట్లుగా మార్చుకుంటే ఇక వారిద్దరి మధ్య ఎలాంటి అపార్థాలు దరిచేరకుండా ఉంటాయి. వీటితో పాటు ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు.. విష్ చేసి నుదుటిపై ప్రేమగా ఓ ముద్దు పెట్టారనుకోండి, ఆ ఫీలింగే వేరు కదూ.. అలాగే మధ్యమధ్యలో 'హాయ్ డార్లింగ్..' అంటూ పెనవేసుకోవడం, 'ఐ లవ్యూ' చెప్పుకోవడం, ఇలా రోజూ రొమాంటిక్‌గా గడపడం అలవాటు చేసుకుంటే ఇద్దరి మధ్య అనుబంధాన్ని మరింతగా ప్రోది చేసుకోవచ్చు.. ఏమంటారు??