పెళ్లంటే నూరేళ్ల పంట. విభిన్న అభిరుచులు కలిగిన కుటుంబాల నుంచి వచ్చి... ఇరువురూ కలిసి కొత్త జీవితం ప్రారంభిస్తారు. అయితే ఈ దాంపత్య జీవితంలో అనుబంధాలతో పాటు అనేక ఒడుదొడుకులు ఉంటాయి. అప్పుడే బేధాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో మీ బంధం పదిలంగా ఉండడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.!
- మీరు ఎంత బిజీగా ఉన్నా ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోవాలి. రోజులో కొన్ని పనులు కలిసి చేసే, కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది.
- వీలైనంతవరకూ రోజులో ఎక్కువసార్లు భాగస్వామికి మీ ప్రేమను చేతల్లో చూపండి. పనుల్లో సాయం చేయడం, ఇద్దరూ పనులు పంచుకోవడం, తనకిష్టమైనవి చేయడం... లాంటివన్న మాట.
- మీ భావాలను ఎదుటివారితో పంచుకోవాలి. సంతోషం, దుఃఖం, బాధ... ఇలా ప్రతిదీ షేర్ చేసుకోవాలి.
- ఒకరికోసం మరొకరు అన్నట్లుగా ఉండాలి. ఎదుటివారి కోసం కొన్ని వదులుకోవడానికి, మరికొన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
- భాగస్వామిపై చెప్పలేనంత ప్రేమ ఉన్నా తనకంటూ కొంత సమయం/స్పేస్‌ను ఇవ్వాలి. ఆలుమగలన్నాక అప్పుడప్పుడు చిరు గొడవలు సహజమే... అయితే వాటిని చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. అంతే తప్ప మేమే గొప్ప అనే అహాన్ని ఇరువురూ ప్రదర్శించకూడదు. ఇలా చేస్తే సున్నితమైన మీ బంధం క్రమంగా బలహీనపడే ప్రమాదం ఉంది.
- ఇతరులతో ఎప్పుడూ పోల్చొద్దు. ఉన్నంతలో సంతోషంగా, కలహాలు, కలతలు లేకుండా ఉండేందుకు ఇద్దరూ కృషి చేయాలి.
- భాగస్వామి కోసం అప్పుడప్పుడు సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేయాలి. ఆ సమయంలో ఎదుటి వారి కళ్లలోని ఆశ్చర్యానందాలను మీరెప్పటికీ మరిచిపోలేరు.