'మీ భాగస్వామితో మాటల్లేవా.. ఇలా చేస్తే మళ్లీ దగ్గరైపోతారు' - love relationship tips
దాంపత్య బంధంలో అలకలు, గొడవలు కామనే. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఆలుమగల మధ్య సయోధ్య కుదరక భిన్నాభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. క్రమంగా అవి ఘర్షణకు దారి తీస్తాయి. మరి ఆ గొడవ ద్వారా ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరుగుతుంది. అప్పుడు వారి మధ్య మాటలుండవు, మాట్లాడుకోవడాలుండవు! అయినా.. ఇదెంతో సమయం ఉండదు లెండి. కాసేపటి తర్వాత ఇరువురిలో ఎవరో ఒకరు తమ తప్పు తెలుసుకొని, సర్దుకుపోయి భాగస్వామిని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయడం సహజం. ఈ క్రమంలో గమనించాల్సిన విషయాలు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. అవేంటో తెలుసుకొని, ఆయా అంశాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే దంపతుల మధ్య పెరిగిన దూరం మరింత దగ్గరై అనుబంధం శాశ్వతమవుతుంది. మరి అవేంటో తెలుసుకుందామా?
'మీ భాగస్వామితో మాటల్లేవా.. ఇలా చేస్తే మళ్లీ దగ్గరైపోతారు'
By
Published : Mar 24, 2022, 10:47 AM IST
చాటింపేస్తున్నారా?
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు సర్వసాధారణమన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి చిన్న విషయాలను కొంతమంది తమ మనసులో దాచుకోలేక.. స్నేహితులతో, తల్లిదండ్రులతో చెప్పేస్తుంటారు. ఫలితంగా మనసులో బాధ తీరుతుందనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల గురించి అందరికీ తెలియడం తప్ప దీంతో మరే ప్రయోజనమూ ఉండదు. అంతేకాదు.. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి వారికి పూర్తిగా తెలియక.. మీ భాగస్వామిపై కోపం పెరిగేలా మీకు లేనిపోని మాటలు చెప్పచ్చు. తద్వారా మీరు మీ భాగస్వామితో మళ్లీ గొడవకు దిగడం, ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరగడం.. వంటివి జరుగుతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఇతరులకు చెప్పడం కంటే.. దంపతులిద్దరూ పరిష్కరించుకోవడం చాలా మంచిది. దీనివల్ల మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే సమస్య తీరుతుంది. తద్వారా బంధం బలపడుతుంది. అయితే ఆలుమగలిద్దరూ తీర్చుకోలేని గొడవలు, సమస్యలేవైనా ఉంటే మాత్రం ఇరువురి పేరెంట్స్‌కి తెలియజేయాలి. ఫలితంగా వారే సమస్యకు చక్కటి పరిష్కారం చూపించి, కాపురాన్ని నిలబెడతారు.
కోపాన్ని అణచుకోవాలి..
నచ్చని పని చేసినప్పుడు ఎవరికైనా ఇట్టే కోపం వస్తుంది. అయితే దీన్ని తగ్గించుకొని ఎదుటివారిని క్షమించగలిగినప్పుడే ఆ బంధం దృఢమవుతుంది. కానీ కొందరు కోపాన్ని అణచుకోలేరు. దాంతో భాగస్వామిని మన్నించలేరు. దీంతో వారు ఏ విషయం మాట్లాడినా మీకు నచ్చక, లేనిపోని గొడవలకు దారితీస్తుంది. కాబట్టి కోపాన్ని ఎంత త్వరగా అణచుకుంటే అంత మంచిది. ఇందుకోసం కాసేపు ఒంటరిగా కూర్చొని, అసలు ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కారణాలేంటి? అది కూడా అవసరమైన విషయాలకే తగువులాడుతున్నారా? లేదంటే అనవసరమైన వాటిని భూతద్దంలో పరిశీలించుకుని మరీ గొడవలకు దిగుతున్నారా? వంటివన్నీ ఆలోచించుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదానికి పరిష్కారం దొరుకుతుంది. ఫలితంగా ఇలాంటి గొడవలు దంపతుల మధ్య మరోసారి రాకుండా జాగ్రత్తపడచ్చు.
క్షమించగలగాలి..
క్షమించడం ఓ గొప్ప లక్షణమంటారు పెద్దలు. ఎదుటివారు తమ తప్పు తెలుసుకుని మీ దగ్గరకొచ్చి క్షమాపణ కోరుతుంటే బెట్టు చేయకుండా దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే భార్యాభర్తల బంధం నిలబడుతుంది. 'నేను చేసింది పొరపాటే.. నిన్ను అనవసరంగా బాధ పెట్టాను.. సారీ.. ఇంకోసారి అలా చేయను..' అంటూ మీ భాగస్వామి దగ్గరికొస్తే వారిని క్షమించి, దగ్గరికి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మరోసారి ఇలాంటి గొడవలు రాకుండా ఉండడంతో పాటు ఇద్దరిలోనూ ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది.
ఇలా మాట్లాడొద్దు..
దాంపత్యం అంటే మూడుముళ్ల బంధమే కాదు.. జన్మజన్మలకీ సరిపోని ఆప్యాయతను అందించే అనుబంధం. మరి అలాంటి పవిత్ర బంధంలో దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. అంతదానికే డీలా పడిపోయి వచ్చిన సమస్యను పరిష్కరించుకోవడం మానేసి.. 'జీవితాంతం నీతో బతకడం నా వల్ల కాదు.. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది..' అంటూ విడిపోవడానికి నిర్ణయించుకుంటారు కొందరు దంపతులు. కానీ ఇంత చిన్న గొడవకు అంత పెద్ద శిక్ష కరక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి పిచ్చి ఆలోచనలకు స్వస్తి పలికి ఇద్దరి మధ్య వచ్చిన గొడవకు సరైన పరిష్కారం ఏమిటి... అనేది ఇద్దరూ కలిసి కూర్చొని ఆలోచించుకోవాలి. ప్రతి విషయంలోనూ ఒకరినొకరు అర్థం చేసుకుని, సర్దుకుపోతూ ముందుకు సాగాలి. అప్పుడే వైవాహిక బంధం మరింత దృఢమవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగం కట్టలు తెంచుకుంటుంది.
ఏం జరగలేదా?
జరిగిన గొడవల్ని భూతద్దంలో చూసే దంపతులు కొందరైతే.. అబ్బే మా మధ్య అసలు గొడవే జరగలేదనుకొని నటించే వారు మరికొందరు. నిజానికి ఈ రెండు పద్ధతులూ సరైనవి కావు. అదేంటీ.. జరిగిన గొడవల్ని తేలిగ్గా తీసుకుని కలిసిపోవడం తప్పంటారేంటి..? అని మీకు సందేహం రావచ్చు.. అయితే మనసులో ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు, ఆలోచనలు లేకుండా తేలిగ్గా తీసుకోగలిగితే ఫర్వాలేదు కానీ.. మనసులో ఏదో పెట్టుకొని తేలికగా తీసుకున్నట్లు నటించడం మాత్రం మంచిది కాదు. ఇలాంటి వారు ఏదో ఒక సందర్భంలో భాగస్వామిపై బదులు తీర్చుకుందామని ఎదురు చూస్తుంటారు. ఫలితంగా మళ్లీ పెద్ద గొడవ తప్ప మరే ప్రయోజనమూ ఉండదు.. సరికదా.. ఇలాంటి పగలు, ప్రతీకారాలు దంపతుల అనుబంధంలో చిచ్చుపెట్టడం ఖాయం. కాబట్టి భాగస్వామితో జరిగే గొడవల్ని మనస్ఫూర్తిగా మర్చిపోయి.. వారిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఎలాంటి మనస్పర్థలొచ్చినా ఇరువురి అనురాగాన్ని ఏమీ చేయలేవు. ఫలితంగా దాంపత్య బంధం శాశ్వతమవుతుంది.
దంపతుల మధ్య గొడవలు సహజమే అయినప్పటికీ వాటిని పరిష్కరించుకునే క్రమంలో ఇరువురూ చేయకూడని కొన్ని పొరపాట్లేంటో తెలుసుకున్నారు కదా! మరి మీరూ వీటిని పాటించి మీ ఆలుమగల అనుబంధాన్ని కలకాలం నిలుపుకోండి.