తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

నా పిల్లలు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు! - second marriages of celebrities

విడాకులకు సంబంధించి మన సమాజంలో పాటిస్తోన్న కొన్ని కట్టుబాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే మహిళలు, పురుషుల మధ్య ఉన్న అసమానతలేంటో స్పష్టంగా కనిపిస్తాయి. విడాకులు పొందిన మగవారు స్వేచ్ఛగా మరో వివాహం చేసుకోవచ్చు. పైగా ఈ విషయంలో అతనికి కుటుంబ సభ్యుల సానుభూతి, సహకారం రెండూ తోడవుతాయి. ఇదే ఆడవారి విషయానికొస్తే మాత్రం కుటుంబంలోనే కాదు సమాజంలోనూ భిన్న స్వరాలు వినిపిస్తుంటాయి. భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న మహిళ రెండో పెళ్లి చేసుకుంటే అదొక పెద్ద నేరంగా భావిస్తారు. ఇక పిల్లలుండి రెండోసారి పెళ్లిపీటలెక్కిన వారైతే సూటి పోటి మాటలు, అవమానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

SECOND MARRIAGE news, second marriage issues celebrities
నా పిల్లలు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు!

By

Published : Apr 25, 2021, 6:35 PM IST

అయితే సమాజం పోకడలు ఎలా ఉన్నా గత కొంతకాలంగా ఈ విషయంలో యువత ఆలోచనా ధోరణి మారుతోంది. సింగిల్‌ పేరెంట్‌గా కొనసాగుతూ తమ జీవితాలను తీర్చిదిద్దుతోన్న తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితం ప్రసాదించాలనుకుంటున్నారు. ఇందుకోసం ఏకంగా మ్యాట్రిమోనియల్‌ ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ సునీత తన మనసుకు నచ్చిన వారిని మనువాడి మళ్లీ కొత్త జీవితం ప్రారంభించింది. ఆమె ఇద్దరు పిల్లలు దగ్గరుండి ఆమె వివాహం చేయడం విశేషం. ఈ విషయంలో ఆమెపై వచ్చిన విమర్శలను పక్కన పెడితే... ఇలా పిల్లలే దగ్గరుండి తల్లికి పెళ్లి చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ బుల్లితెర నటి ఊర్వశి ధోలాకియాను కూడా రెండో వివాహం చేసుకోమని ఆమె ఇద్దరు కుమారులు అడుగుతున్నారట.

ఆరేళ్లకే అరంగేట్రం!

బాలనటిగా ఆరేళ్లకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఊర్వశి. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి మెప్పించింది. ఇక పాపులర్‌ హిందీ సీరియల్‌ ‘కసౌటి జిందగీ కే’లో కొమోలికా మజుందార్‌గా నటించి మంచి గుర్తింపు సాధించుకుంది. ఆ తర్వాత ‘ఘర్‌ ఏక్‌ మందిర్‌’, ‘శక్తిమాన్‌’, ‘దేఖ్‌ భాయ్‌ దేఖ్’, ‘చంద్రకాంత’ వంటి ధారావాహికలతో పాటు ‘కామెడీ సర్కస్‌’, ‘నచ్‌ బలియే’ వంటి కార్యక్రమాలతో టీవీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌-6 విజేతగా నిలవడంతో ఆమె క్రేజ్‌ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు సింగిల్ మదర్‌గా కొనసాగుతోన్న ఆమె సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. అంతేకాదు.. బాడీ పాజిటివిటీ వంటి సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన రెండో వివాహంతో పాటు తన పిల్లల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

16 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డాను!

‘బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. 16వ ఏటనే ప్రేమలో పడ్డాను. 17 ఏళ్ల వయసులోనే ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను. వారే సాగర్‌, క్షితిజ్‌. ఆ వెంటనే నా భర్తతో విడిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సింగిల్ మదర్‌గానే ఇద్దరు బిడ్డలను పెంచి పోషించాను. వారికి మంచి చదువు, కెరీర్‌ అందించాలని అహర్నిశలూ పని చేశాను. ఎంతలా అంటే సమయం ఎలా గడిచిపోతోందో కూడా తెలియనంత బిజీగా గడిపాను. ఇప్పుడు నా ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారయ్యారు. వారి కాళ్ల మీద వారు నిలబడగలుగుతున్నారు. అందుకు ఎంతో గర్వంగానూ, సంతోషంగానూ ఉంది’.

డేటింగ్‌ చేయమంటున్నారు!

‘ఇప్పుడు నా ఇద్దరు పిల్లలతో పాటు కుటుంబ సభ్యులందరూ నన్ను మళ్లీ కొత్త జీవితం ప్రారంభించమంటున్నారు. రెండో వివాహం చేసుకోవాలని కోరుతున్నారు. ఇక నా ఇద్దరు పిల్లలైతే ‘అమ్మా! నీకు నచ్చిన వ్యక్తిని వివాహమైనా చేసుకో లేదా డేటింగ్‌ అయినా చెయ్యి’ అని అడుగుతున్నారు. అయితే వారి మాటలను నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. అలా అన్నప్పుడల్లా ఒక నవ్వు నవ్వేసి ఊరుకుంటున్నాను. ఇక భర్తతో విడిపోయిన తర్వాత రెండో వివాహం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. అందుకు సమయం కూడా దొరకలేదు. పైగా నేను స్వతంత్ర భావాలు గల మహిళను. నాకు నచ్చినట్లు నేను జీవించాలనుకుంటాను. ఎవరికోసమో నన్ను నేను మార్చుకోను. ఒకవేళ నన్ను, నా ఇండిపెండెన్స్‌ను అర్థం చేసుకునే వారు దొరికితే అప్పుడు రెండో పెళ్లి గురించి ఆలోచిస్తాను’.

అలా చేస్తే బంధాలు నిలబడవు!

‘ప్రేమ కానీ, పెళ్లి బంధంలో కానీ మనం సౌకర్యవంతంగా ఉంటూనే అవతలివారికి పర్సనల్‌ స్పేస్‌ ఇవ్వాలి. అంతేకానీ ఎదుటి వారు ప్రేమిస్తున్నారని మనల్ని మనం మార్చుకోకూడదు. అలాంటి బంధాలు ఎక్కువ కాలం నిలబడలేవు. నా విషయంలోనే కాదు ఎవరికైనా నేను ఇదే సలహా ఇస్తాను’ అంటూ చెప్పుకొచ్చిందీ అందాల తార.

ఇదీ చూడండి :ఇలా హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూనే ఆక్సిజన్‌ స్థాయులు పెంచుకోవచ్చట!

ABOUT THE AUTHOR

...view details