అమ్మా... దెబ్బతగిలిందే!
అమ్మా... కడుపు నొప్పే!
అమ్మా... జ్వరంగా ఉందే!
అమ్మా... కరోనా అని భయమే!
బాధొచ్చినా, భయమొచ్చినా ఆమె పేరే మన జపం ఎందుకవుతుంది?
ఎందుకంటే... అమ్మ అనే పిలుపే సాంత్వన. అమ్మే వైద్యం, చికిత్స. ‘‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ.. కదిలే దేవత అమ్మ... కంటికి వెలుగమ్మా... అంటారు ‘నాని’కోసం రచయిత చంద్రబోస్. మనలోని ప్రాణం, మనదైన రూపం, నడిపించే దీపం, కనిపించే దేవతంటారాయన. అందుకే కష్టమొస్తే ఆ దేవతనే కదా తలచుకొనేది!
రే.. టైం అయింది తినూ!
రే...లేటైంది పడుకో!
ఒసేయ్... మందులేసుకున్నావా?
.. అన్ని పనులు పెట్టుకోకు అలసిపోతావ్?
...మన గురించి ఇన్ని జాగ్రత్తలు ఎవరు తీసుకుంటారు? అమ్మ కాక ఇంకెవరు? ఆమె ఇంట్లో లేకపోతే మనల్ని ఇవన్నీ ఎవరడుగుతారు?
అందుకే ‘‘అమ్మా అని కొత్తగా మళ్లీ పిలవాలనీ...’ అంటారు ‘లైఫ్‌ఈజ్‌బ్యూటిఫుల్’లో అమ్మ కోసం తపించే బిడ్డల తరఫున వనమాలి. ‘‘నింగి నేల నిలిచే దాకా తోడుగా... వీచే గాలి, వెలిగే తారల సాక్షిగా నవ్వు కావాలే అమ్మా... నను వీడొద్దే అమ్మా.. బంగారం నువ్వమ్మా’’ అని వాళ్లలాగే అమ్మను మనమూ బుజ్జగించాలి మరి!
అమ్మా... నా బ్రష్ ఎక్కడా?
అమ్మా... టిఫిన్ ఏదీ?
అమ్మా... నా ఫోన్ ఛార్జర్ లేదే!
అమ్మా... కొంచెం కాఫీ ఇస్తావా?
లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉంటూ... అమ్మకు ఎన్ని ప్రశ్నలేస్తున్నాం? ఎన్ని పనులు చెబుతున్నాం?
‘‘తరగని బరువైన వరమనే అనుకుంటూ.. తనువున మోశావే అమ్మా’’ అంటాడు రామజోగయ్య శాస్త్రి.. ‘కేజీఎఫ్’ రాఖీ భాయ్ రూపంలో. రోజురోజుకు మోసే బరువు పెరుగుతున్నా.. వరమనే భావిస్తుంటుంది అమ్మ. ఆ ప్రేమను మరింత విరివిగా పంచుతుంది. అందుకే మనం ఎన్ని పనులు చెప్పినా... భారమని ఏనాడు తలంచదు మాతృమూర్తి. నవ్వుతూ మనకు చేసి పెడుతూనే ఉంటుంది. అదే పాటలో ‘‘ఈ జన్మంతా అమ్మా నీకు రుణపడిపోయింది’’ అంటాడు. మరి మనమూ ఆ రుణం కొంతైనా తీర్చుకుందామా?