మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో. ఎంత ఖరీదైన వస్తువైనా ఇట్లా చెప్పగానే అట్లా కొనుక్కొచ్చేస్తారు. పోయిన్నెల్లో మా పెళ్లి రోజని ఈ డైమండ్ నెక్లెస్ కానుకగా కొనిచ్చారు’’ ఎంతో గర్వంగా చెబుతోంది పల్లవి. ‘‘మా ఆయన కూడా డిటోనే. ఎలాంటి కోరిక కోరినా ఏమాత్రం జాప్యం చేయకుండా తీర్చేస్తారు. పోయినేడు వేసవిలో డార్జిలింగ్ చూడాలని ఉందని అన్నానో లేదో వెంటనే టికెట్ బుక్ చేసి తీసుకెళ్లి చూపెట్టారు’’ గొప్పగా చెప్పింది గీత.
‘‘మనమందరం ఎంతో అదృష్టవంతులమే. అందరికీ ఎంతగానో ప్రేమిస్తూ మన కోరికలు వెంటనే తీర్చేసే భర్తలు దొరికారు. మా ఆయన కూడా నేను కోరితే కొండమీద కోతినైనా తెచ్చిస్తారు’’ వాళ్లకు వంత పాడింది పూర్ణిమ. వాళ్ల మాటలు వింటున్న వైదేహి అంది ‘‘ఏమోనే! నాకింకా ఎలాంటి అనుభవం కలగలేదు. పెళ్లై ఇంకా నెల కూడా కాలేదు కదా. అయినా మా ఆయన్ని చూస్తే మటుకు భార్యని ప్రేమగా చూసుకునే భర్తలానే కనిపిస్తున్నాడు.’’
వాళ్లకి కొద్ది దూరంలో సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్న వేదవతి వాళ్ల మాటలు వింటూ తనలో తానే నవ్వుకోసాగింది.
వేదవతి వైదేహి బామ్మగారు. గత నెల్లోనే వైదేహికి వివాహమైంది. వివాహమయ్యాక మొదటిసారి పుట్టింటికి రాగానే ఆమె స్నేహితురాళ్లు ముగ్గురూ ఆమెని కలవడానికి వచ్చారు. వాళ్లు నలుగురూ చిన్ననాటి నుంచీ కలిసి పెరిగిన స్నేహితురాళ్లు. అందరూ కలిసి చదువుకుని, ఒకరి తరువాత ఒకరు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో స్థిరపడినవారు. వైదేహి వివాహానంతరం మరోసారి వైదేహి ఇంట్లో కలుసుకుని ముచ్చట్లు చెప్పుకోసాగారు.
తమ మాటలకు వేదవతి నవ్వుకోవడం గమనించిన వైదేహి ఆవిడ దగ్గరకొచ్చి ‘‘బామ్మా! ఎందుకు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. మా మాటల్లో ఏమైనా తప్పులున్నాయా?’’ అని ప్రశ్నించింది.
దానికి వేదవతి ‘‘ఏమీ లేదే! ఏదో గుర్తుకొచ్చి నవ్వొచ్చింది అంతే’’ అంది. ‘‘కాదు బామ్మా ఏదో ఉంది. నువ్వు అలా ఊరికే నవ్వుకోవు’’ అంది వైదేహి. ఆమె స్నేహితురాళ్లు కూడా వైదేహికి వంత పాడారు విషయమేమిటో చెప్పమని.
వాళ్లంతగా బలవంత పెడుతుంటే వేదవతికి చెప్పక తప్పలేదు తన మనసులో మాటని. ‘‘ఏమీలేదే! మీరంతా మీ భర్తలు మిమ్మల్నెంతగా ప్రేమిస్తున్నారో చెబుతుంటే విని నవ్వొచ్చింది’’ అంది.
దానికి ఆ స్నేహితురాళ్లు నలుగురూ ‘‘అదేమిటి బామ్మగారూ! మా భర్తలు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారంటే అందులో విడ్డూరమేముంది?’’ అన్నారు.
‘‘విడ్డూరం మీ భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తున్నందుకు కాదు. వారి ప్రేమల్ని వెల కట్టడానికి మీరుపయోగిస్తున్న కొలమానాలని చూసి’’ వేదవతి అంది.
‘‘అదేమిటి బామ్మగారూ అలా అనేశారు. మమ్మల్ని వారెంతగా ప్రేమించకపోతే అంత ఖరీదైన బహుమతులను అడగ్గానే ఇస్తారనుకున్నారు?’’ నలుగురూ ముక్తకంఠంతో అన్నారు.
‘‘ఖరీదైన బహుమతులు కొనివ్వడం, ఎంతటి కోరికైనా ఇట్టే తీర్చడం- ఇవే ప్రేమకి ప్రామాణికాలైతే మరి పూరి గుడిసెల్లో ఉండే సాదా, సీదా మనుషులకి ప్రేమలు లేనట్టేనా?’’ అంది వేదవతి. వారి సమాధానానికి ఎదురు చూడకుండా తిరిగి తనే మాట్లాడసాగింది...
‘‘పిచ్చి పిల్లలూ! ప్రేమకు నిదర్శనం ఏవో ఖరీదైన బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం కాదు. అసలైన ప్రేమంటే మనసు పొరల్లో నుంచి పుట్టుకు రావాలి. కట్టుకున్న వారి కష్టాలకు స్పందించేటట్టు చెయ్యాలి. అవతలివారి మెప్పు కోసం కాకుండా, సహజంగా హృదయాంతరాళాల నుంచి ఉత్పన్నమవ్వాలి. ఆ ప్రేమ కనపడవలసింది మన కంటికి కాదు, మనసు పొరలను తాకుతూ మన అంతరంగానికి. భార్యా భర్తల మధ్య అన్యోన్యతా, అనురాగం ప్రేమలకు కావాల్సింది, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి కష్టసుఖాలలో మరొకరు పాలు పంచుకోవడం.’’
ఆవిడ మాటలకు స్నేహితురాళ్లు నలుగురూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఒక్కక్షణం నిశ్శబ్దం అలుముకున్నాక వైదేహి అడిగింది. ‘‘మరైతే బామ్మా! అలాంటి ఉన్నతమైన ప్రేమ నీ అనుభవంలోకి ఎప్పుడైనా వచ్చిందా?’’
ఆ అమ్మాయి మాటలకి వేదవతి ఒక లిప్త కాలం నిశ్శబ్దంగా ఉండిపోయింది. మనసు పుటల్లో ఏ మధుర జ్ఞాపకాలు మెలిగాయో ఏమో కాని ఆవిడ మోములో ఒక ఉద్విగ్నతతో కూడిన మోదం వెల్లివిరిసింది. ఆ ఆనందం తాలూకు ఛాయలు ఆవిడ ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించాయి ఆ నలుగురు స్నేహితురాళ్లకీ. తన అనుభవాలూ, అనుభూతులూ చెబుతూ గత స్మృతులలోకి వెళ్లిపోయింది వేదవతి.
ఒక సామాన్య బడిపంతులికి పుట్టిన ముగ్గురాడ పిల్లలలో అందరికన్నా పెద్దది వేదవతి. తండ్రి పని చేస్తున్న బడిలోనే పదో తరగతి దాకా చదివి ఆ పైన చదవడం వీలుగాక అక్కడితో విద్యాభ్యాసానికి వీడ్కోలు చెప్పేసి ఇంట్లో అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటి పనులతోనూ, చెల్లెళ్లకు చదువు చెప్పడంలోనూ సమయం వెళ్లబుచ్చేది.
ఒకసారి ఎవరిదో పెళ్లిలో వేదవతిని చూసి మనసు పారేసుకున్నాడు ఆ ఊరి శ్రీమంతులలో ఒకరైన నారాయణరావుగారి పెద్దకొడుకు శ్రీపతి. ఆ విషయమే కొందరు పెద్దలతో వేదవతి తండ్రికి చెప్పించారు నారాయణరావుగారు, శ్రీపతి వేదవతిని పెళ్లాడాలనుకుంటున్నాడని. మొదట్లో తమ తాహతుకు మించిన సంబంధమేమోనని సందేహించినా, నలుగురూ చెప్పేసరికి చివరకు వాళ్ల వివాహానికి అంగీకరించారు వేదవతి తండ్రిగారు. వివాహం తరువాత అత్తవారింట్లో వేదవతికి ఎటువంటి తలవంపులూ రాకుండా తన తాహతుకు మించి ఘనంగా పెళ్లి జరిపించారు.
అత్తవారింట అడుగు పెట్టిన వేదవతికి ఘనంగా స్వాగతం లభించడంతో పాటూ ఎన్నో బాధ్యతలు కూడా క్రమంగా మీద పడ్డాయి. పెళ్లైన ఏడాదికే అత్తగారు అనారోగ్యం పాలవడం వల్ల ఇంటి బాధ్యతలతో పాటూ, పాలేళ్ల ఆలనా పాలనా, ఆడపడుచూ ఇద్దరు మరుదుల సంరక్షణ బాధ్యత, తరచూ ఇంటికి వచ్చే చుట్టాలను మర్యాదగా చూసుకునే బాధ్యత ...అన్నీ కూడా ఆమె మీదే పడ్డాయి. అలాగే మావగారికి వయసుమీద పడుతుండడంతో భర్త శ్రీపతే మొత్తం పొలం పనులూ, వ్యాపారం పనులూ అన్నీ స్వయంగా చూసుకునేవాడు.
ఇంటి పనులతో తలమునకలై..శ్రీపతి బయటి పనులతోనూ, వేదవతి ఇంటి పనులతోనూ రోజంతా తలమునకలై ఉండడంతో వారికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అసలు సమయమే దొరికేది కాదు. పొద్దుటే ఐదు గంటలకు లేస్తే రోజంతా ఇద్దరూ తీరికలేని పనులతో సతమతమవుతూ ఉండేవారు. ఊరంతా సద్దుమణిగాక ఎప్పుడో రాత్రి పదిగంటలకు కానీ ఇద్దరికీ కలుసుకోవడానికీ, ఊసులాడుకోవడానికీ సమయం చిక్కేది కాదు. అప్పటికే వేదవతికి అలసటతో కళ్లు మూసుకుపోతుండేవి. ఆ కొద్దిపాటి సమయంలోనే శ్రీపతి వేదవతి కష్టసుఖాలు తెలుసుకుంటుండేవాడు. అలసిపోతే సపర్యలు చేసేవాడు. మనసు బాగా లేకపోతే సాంత్వన పరిచేవాడు. అతనితో గడిపే ఆ కొద్ది గంటల సాంగత్యమే ఆమెకు టానిక్‌లా పనిచేసి మర్నాటి పొద్దుటికల్లా ఎంతటి పని భారాన్నైనా భరించగల శక్తి నిచ్చేది.
భర్త స్ఫూర్తితో వేదవతి తన బాధ్యతలను అందరూ మెచ్చుకునేటట్టు చక్కగా నిర్వర్తించేది. అత్తమామల అవసరాలు గమనిస్తూనే, భర్త తోబుట్టువులా తన పిల్లలా చదువు సంధ్యలూ, కష్టసుఖాలూ చూసుకునేది. బంధు మిత్రులందరినీ ఆదరంతో అభిమానించి, అతిథి సత్కారాలు ఎంతో మర్యాదగా చేసేది. శ్రీపతికి చేదోడు వాదోడుగా ఉంటూ పిల్లలందరి పెళ్లిళ్లూ చేసేసి, సుఖంగా స్థిరపడేటట్టు చేయగలిగింది.ప్రేమను వ్యక్తపరచుకోలేదు..
ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి కష్టసుఖాలు మరొకరు తెలుసుకుంటూ బాధ్యతలను బరువుగా కాకుండా భగవంతుడిచ్చిన ఒక అవకాశంగా చూసుకుంటూ నిర్వర్తించారే తప్ప శ్రీపతీ వేదవతీ ఏనాడూ ఒకరిపై ఒకరికున్న ప్రేమానురాగాలను బాహాటంగా బహిర్గతం చేసుకోలేదు. వేదవతి ప్రత్యేకంగా శ్రీపతినేదైనా కోరడం కానీ, అతడు తీర్చడం కానీ జరగలేదు. ఆమె మనసును చదివేసినట్టు అతనే ఆమెకు కావలసిన వల్లా ఆమె కోరకుండానే సమకూర్చేవాడు. ఆమెకే అప్పుడప్పుడూ ఆశ్చర్యం వేసేది. తన మనసులోని భావాలు తను చెప్పకుండానే అతనికెలా తెలుస్తున్నాయా అని.
ప్రత్యేకంగా ఎప్పుడూ చూడలేదు..
పెళ్లైన కొత్తలో శ్రీపతిని చూస్తే వేదవతికి ఇష్టం, ప్రేమల కన్నా ఒక విధమైన గౌరవంతో కూడిన భయం, బిడియం అధికంగా ఉండేవి. ఊరి పెద్దల్లో ఒకడవడం వల్ల అతని పట్ల అందరూ ఎంతో గౌరవం చూపిస్తూ, వినయ విధేయతలతో మెలిగేవారు. అతను కూడా హుందాగా ఉంటూ చాలా తక్కువగా ఆచి తూచి మాట్లాడేవాడు. అవసరమైన దానికన్నా ఒక్కమాట కూడా ఎక్కువగా పలికేవాడు కాదు. ఎవ్వరినీ నొప్పించక తన పనులు చేసుకుపోవడం అతని ప్రత్యేకత. పెళ్లయ్యాక వేదవతితో కూడా ఎప్పుడూ మరీ ఎక్కువగా మాట్లాడింది లేదు. పండగలకూ పబ్బాలకూ, బట్టలూ ఆభరణాలూ ఏవి కొని తెచ్చినా ఇంటిల్లిపాదికీ సమంగా తెచ్చేవాడేకానీ, ఏ రోజూ వేదవతి పట్ల ఎటువంటి ప్రత్యేకతా చూపెట్టేవాడు కాదు. అలాగని వేదవతి అవసరాలకు ఏనాడూ లోటు రానీయలేదు. ముఖతా ఎప్పుడూ చెప్పకపోయినా తనపట్ల అతనికున్న అవ్యాజమైన అనురాగం, ఆప్యాయత ఏకాంతంగా ఉన్నప్పుడు అతని గుండె చప్పుళ్లలో ఆమెకు నిశ్శబ్దంగా వినిపించేది.
ప్రేమ ఎంత గొప్పదో..