'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..' అన్నాడో కవి. నిజమే కదా మరి.. ఈ సృష్టిలో శాశ్వతంగా నిలిచిపోయే బంధమంటే అది స్నేహమే. ఆస్తి, అంతస్తులతో పనిలేకుండా, లింగభేదం చూసుకోకుండా, నిస్వార్థంతో వ్యవహరించే అనురాగ బంధం ఇది. ఇంతటి మధురమైన అనుబంధం కాబట్టే దీనికంటూ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. ఆ రోజున స్నేహితులంతా ఒక్కచోట చేరి ఆనందంగా ఆడిపాడతారు. మరుసటి ఏడాది వరకూ గుర్తుండిపోయే మరెన్నో మధుర జ్ఞాపకాలను మూటగట్టుకుంటారు. ఇంతటి నేపథ్యం ఉన్న స్నేహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకోవడానికి స్నేహితుల దినోత్సవానికి మించిన సందర్భం మరొకటి ఏముంటుంది చెప్పండి..
ఫ్రెండ్‌షిప్ డేే కు ఆద్యుడు ఎవరంటే..!
స్నేహితుల దినోత్సవం పేరిట ఏటా ఫ్రెండ్స్ అంతా కలిసి ఫ్రెండ్‌షిప్ డే జరుపుకోవడం సర్వసాధారణమైపోయింది. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్న స్నేహితులంతా ఒక్కచోట చేరి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం వెనక ఉన్న అంతరార్థం గురించి చాలామందికి తెలియదు. 1958, జులై 20న డా. అర్టెమియోబ్రాకో అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. చాలాకాలం తర్వాత మిత్రుల్ని కలవడంతో పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ వారంతా ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఈ ఎంజాయ్‌మెంట్ కేవలం ఈ రోజుకే పరిమితం కాకూడదని.. ప్రతి ఏడాది తామంతా కలుసుకోవాలని, తనలాగే ప్రజలంతా తమ స్నేహితులతో సంతోషంగా గడపాలనే ఆలోచన ఆ క్షణం ఆయన మనసులో మెదిలింది. అంతే.. వెంటనే ఈ విషయాన్ని అక్కడున్న మిత్రులతోపాటు ప్రజలకు సైతం తెలిసేలా చేశాడు. అలా సరిగ్గా పది రోజులకు అంటే జులై 30న మెక్సికో నగరంలోని ప్యుర్టో పినాస్కో అనే నగరంలో మొదటిసారిగా ఫ్రెండ్‌షిప్ డే సంబరాలు జరిగాయి. అందుకే అర్టెమియోబ్రాకోను ఫ్రెండ్‌షిప్ డేకు ఆద్యుడిగా పరిగణిస్తారు. ఇలా అప్పటినుంచి ఏటా జులై 30న యూఎస్‌తో పాటు పలు దేశాల్లో స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరికొన్ని దేశాల్లో మాత్రం వేర్వేరు తేదీల్లో ఫ్రెండ్‌షిప్ డే చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మన దేశంలో ఏటా ఆగస్టు తొలి ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాం.
అక్కడ మహిళలకు ప్రత్యేకంగా...
మహిళా దినోత్సవం, మదర్స్ డే.. వంటి రోజులు కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకం.. అదే స్నేహితుల దినోత్సవం అంటే.. ఆడ, మగ అనే లింగ భేదాలు లేకుండా జరుపుకొనే రోజు. కానీ మహిళలకంటూ ప్రత్యేకంగా ఫ్రెండ్‌షిప్ డే అంటూ ఒకటి ఉందన్న విషయం మీకు తెలుసా? అవును.. మీరు విన్నది నిజమే. వర్జీనియాలో 1897లో స్థాపించిన 'కప్పా డెల్టా' అనే సోషల్ క్లబ్‌లో మెంబర్‌షిప్ తీసుకున్న దాదాపు 1.80 లక్షల మంది మహిళలంతా కలిసి తొలిసారిగా జాతీయ మహిళా స్నేహితుల దినోత్సవం జరుపుకొన్నారట. మహిళల కోసం మహిళలంతా కలిసి జరుపుకునే ఈ ప్రత్యేకమైన రోజుకు యూఎస్ రాష్ట్రాల్లోని గవర్నర్‌లు క్రమంగా మద్దతివ్వడంతో అక్కడ ఏటా సెప్టెంబర్‌లోని మూడో ఆదివారం నాడు జాతీయ మహిళా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజున ఒకరికొకరు విలువైన బహుమతులు అందించుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా మహిళలంతా కలిసి కట్టుగా ఉన్నామనే సందేశాన్ని ఈ ప్రత్యేక సందర్భం ద్వారా చెప్పకనే చెబుతున్నారు అక్కడి మహిళలు.
ప్రపంచ శాంతే లక్ష్యంగా..!