తను మొదట్నుంచి అతనితో ఖచ్చితంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో. అతని అసభ్య ప్రవర్తనకు ఆమె మొదటే అడ్డుకట్ట వేయకపోవడంతో ఎలాంటి భయం లేకుండా ఇబ్బంది పెడుతున్నాడనిపిస్తోంది. అయితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. తన మనసులో ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పాలి. ఇప్పటి నుంచైనా అతనితో కఠినంగా వ్యవహరించాలి. తన పరిధి దాటి అతనితో ప్రవర్తించలేదు కాబట్టి, కేవలం అతనితో చాట్ చేసినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఆఫీసులోనైనా సహోద్యోగులతో చాట్ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ అనేది అర్థం చేసుకోవాలి. అతని అసభ్య ప్రవర్తన గురించి తోటి ఉద్యోగులకు తెలిసే విధంగా సూచనలివ్వాలి. అతను ఒంటరిగా రమ్మన్నప్పుడు అతనికి దూరంగా ఉంటూ స్నేహితులతో గడిపేలా చూసుకోవాలి. తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు అతను ఏదైనా అంటే దానికి ఆమె బాధ్యురాలు కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి.
నా భర్తతో ఆ విషయం చెబుతానని బెదిరిస్తున్నాడు..
తను ఓ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తోంది. పెళ్లై మూడేళ్లవుతోంది. రెండేళ్ల పాప ఉంది. పెళ్లి కాకముందు నుంచే జాబ్ చేస్తోంది. మొదట్లో ఫ్రెషర్ కావడం వల్ల పని విషయంలో తన సీనియర్ చాలా హెల్ప్ చేసేవాడు. అతన్ని బాగా నమ్మింది. ఒక్కోసారి పని నేర్పిస్తానని రూమ్‌కి రమ్మనేవాడు. సరేనని వెళ్లింది. మొదట్లో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆఫీసులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని తనూ ఏమీ అనలేకపోయింది. అయితే తన పరిధి దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదు. పెళ్లి కుదిరిన తర్వాత కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రేమిస్తున్నానని టార్చర్ చేస్తున్నాడు. పెళ్లికి ముందులాగా ఉండమని, లేకపోతే తన భర్తతో చెబుతానని బెదిరిస్తున్నాడు. తన భర్తకి అబ్బాయిలతో మాట్లాడడమే నచ్చదు. ఈ విషయం తెలిస్తే విడాకులు ఇస్తాడు. తన కొలీగ్‌ని ఎంత బతిమాలినా వినడం లేదు. తన కోరిక తీర్చమని టార్చర్ పెడుతున్నాడు. అతనిపై తనకు ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవు. అయినా సరే- ‘నీ భర్తతో వ్యక్తిగతంగా ఎలా ఉంటావో చెప్పు.. లేకపోతే అతనితో మన విషయం చెప్తా’ అని బెదిరిస్తున్నాడు. అతన్ని చంపాలన్నంత కోపం వస్తున్నా ఏమీ చేయలేకపోతోంది. ఎందుకంటే అతని దగ్గర తాను చాట్ చేసిన మెసేజ్‌లు ఉన్నాయి. తనకు తన భర్త, పాప కావాలి. ఇలాంటి సమస్యకు పరిష్కారమేంటంటే...
వర్తమాన పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలకు ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి తన సమస్యను ఉన్నత అధికారులు, మానవ వనరుల విభాగం వారికి మొదట సూచనప్రాయంగా తెలిపే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత తగిన సాక్ష్యాధారాలతో ఏవిధంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడో వివరించాలి. ఒకరితో అసభ్యంగా ప్రవర్తిస్తోన్న వ్యక్తి మిగతావారితోనూ అసభ్యంగా ప్రవర్తించరన్న గ్యారంటీ లేదు. కాబట్టి, బయటకు చెప్పకుండా ఇబ్బంది పడుతోన్నవారు ఎవరైనా ఉన్నారేమో చూడాలి. ఒక సమస్యను కలిసికట్టుగా చెప్పినప్పుడు ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి, అలా ఎవరైనా కనిపించినప్పుడు వారితో కలిసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే భర్తకి ఉద్యోగ జీవితంలో ఇతర ఉద్యోగులతో మాట్లాడడం సాధారణమేనన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేయాలి. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కొన్ని పరిధులు గీసుకోవాలి.