తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

కరోనా సమయంలో... ఎందరో మహానుభావులు - కరోనా రోగులకు హెల్ప్

నిరుపేద సాంబయ్య ఎంతో సజ్జనుడు. రోజంతా దైవప్రార్థనలో గడుపుతుండేవాడు. ఒకసారి దేవుడు అతని కలలోకి వచ్చి ‘రేపు మీ ఇంటికి వస్తా’నని చెప్పాడు. దాంతో అతడు పొద్దున్నే లేచి తలుపు తెరుచుకుని వీధిలోకి చూస్తూ కూర్చున్నాడు. ఓ వృద్ధుడు చలికి వణుకుతూ వెళ్లడం చూసి అతడిని లోనికి పిలిచి తనకోసం చేసుకున్న వేడి జావ తాగడానికి ఇచ్చాడు. కాసేపటికి పండ్లమ్ముకునే అవ్వ, ఆ తర్వాత బిడ్డనెత్తుకున్న ఓ బిచ్చగత్తె... అలా అటుగా వెళ్తున్న ఆర్తులను పిలిచి మంచినీళ్లో, మజ్జిగో ఇచ్చి సేదదీర్చి పంపుతూనే ఉన్నాడు. సాయంత్రమయ్యేసరికి అలసి నిద్రపోయాడు. మళ్లీ కలలో దేవుడు కనిపించగానే ‘నీకోసం ఎంతో ఎదురుచూశాను, రాలేదే’మని అడిగాడు. ‘వచ్చాను... వేర్వేరు రూపాల్లో వచ్చాను. తృప్తిగా నీ సేవలు అందుకున్నాను. మనసారా దీవించాను’ చెప్పాడు దేవుడు. మానవసేవే మాధవ సేవ అనీ, ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అనీ- అన్ని మతాలూ చెప్పిన సారాన్ని ఈ కష్టకాలంలో ఆచరణలో చూపిస్తున్నారు ఎందరో సేవామూర్తులు.

so-many-people-helping-others-during-corona-crisis
కరోనా సమయంలో... ఎందరో మహానుభావులు

By

Published : May 16, 2021, 12:53 PM IST

కంటికి కనిపించని వైరస్‌ మహమ్మారిలా మారి ప్రాణాలను తోడేస్తున్న వేళ... సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కుటుంబాలకి కుటుంబాలే దీని బారినపడి ఆరోగ్యపరంగానే కాదు, ఆర్థికంగానూ చితికి పోతున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఐసొలేషన్‌లో ఉన్నవారికి వంటచేసి పెట్టేవారుండరు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి సమయానికి ఆక్సిజన్‌ అందదు. పిల్లలకు చదువుల్లేవు... పెద్దలకు ఉద్యోగాల్లేవు... వృద్ధులకు మందులు లేవు... మొత్తంగా సామాజిక జీవనమే అల్లకల్లోలమైన నేటి పరిస్థితుల్లో రేపటి మీద ఆశ కల్పిస్తున్నది కొందరు మంచి మనుషులే..! వారి నిస్వార్థ సేవలే..! ఎక్కడికక్కడ తమకి ఉన్నంతలో, చేతనైన రీతిలో తోటివారిని ఆదుకుంటున్న వారు ప్రతి ఊళ్లోనూ కన్పిస్తున్నారు.


స్వచ్ఛంద సేవాసంఘాలూ, ట్రస్టులూ తాము సేవలందిస్తున్న రంగాలకే పరిమితం కాక ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా సేవల్ని విస్తరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో- ఒకరి మదిలో మెరిసిన చిన్న ఆలోచన... ఎందరికో దారిచూపి, ఇంతింతై అన్నట్లు విస్తరించి, దేశవ్యాప్తంగా లక్షలాదిమందికి సేవలందడానికీ తోడ్పడుతోంది.

ఒక్క సందేశం...

షెఫ్‌ సారాంశ్‌ గోయిలాకి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఏప్రిల్‌లో ఓరోజు అతడి ఇన్‌స్టాగ్రామ్‌కి ఓ సందేశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ఒక బాలిక కుటుంబాన్నంతా కొవిడ్‌ బలితీసుకుందనీ ఒంటరిగా ఇంట్లో ఐసొలేషన్‌లో ఉన్న ఆ అమ్మాయికి ఆహారం అందించే ఏర్పాటు చేయగలరా అనీ- దాని సారాంశం. ఆస్పత్రుల్లో పడకలూ ఆక్సిజన్‌ కొరత గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఇళ్లలో ఇలా ఒంటరిగా ఉన్నవాళ్ల తిండి సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదని అర్థమైన సారాంశ్‌ ఏలూరులోని స్నేహితులని సంప్రదించి ఆ అమ్మాయికి భోజన ఏర్పాట్లు చేశాడు. ఆ తర్వాత ఇలా ఎక్కడికక్కడ ఇళ్ల దగ్గర చికిత్స పొందుతున్నవారికి భోజన సదుపాయం కల్పించడానికి ఎవరు సాయం చేయగలరో తెలపండి అంటూ అతడు సోషల్‌మీడియా ద్వారా పిలుపివ్వగానే చాలామంది మేమంటే మేమని ముందుకి వచ్చారు. మూడు రోజులకల్లా 40 నగరాల నుంచి వెయ్యిమంది పేర్లిచ్చారు. అంతమందినీ ఎలా సమన్వయం చేయాలో తెలియక సారాంశ్‌ తబ్బిబ్బవుతుండగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరైన ఫ్రెండ్‌ ఒకరు 24 గంటల్లో వెబ్‌సైట్‌ని తయారుచేసి ఇచ్చాడు. అలా ఏప్రిల్‌ 25 కల్లా కొవిడ్‌మీల్స్‌ఫర్‌ఇండియా.కామ్‌’ సిద్ధమైంది.

దేశవ్యాప్తంగా 52 నగరాలవారు చేతిలో ఫోన్‌ ఉంటే చాలు ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఇంటికి భోజనం తెప్పించుకోవచ్చు. 3000 మంది వంట చేసిపెడతామని పేరు నమోదుచేసుకున్నారు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి నగరం పేరు ఎంచుకుంటే అక్కడ అందుబాటులో ఉన్న సంస్థల పేర్లు ఫోన్‌ నంబర్లతో సహా కన్పిస్తాయి. ఒకరిని ఎంచుకుని వారి వాట్సప్‌ నంబరుకు మెసేజ్‌పెడితే చాలు, వేడివేడిగా భోజనం ఇంటికొస్తుంది. వందలాది హోమ్‌షెఫ్‌లు ఈ ఉచిత సేవలు అందించడానికి ముందుకొచ్చారు. ప్రారంభించి కొద్ది వారాలే అయినా- ఏ సమయంలో చూసినా కొన్నివేల మంది వెబ్‌సైట్‌ని వాడుతున్నట్లు తెలుస్తోందనీ ఒక చిన్న ప్రయత్నంతో దేశమంతా ఉద్యమంలా ఊపందుకోవడానికి తాను పరోక్షంగా కారణమైనందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నాడు సారాంశ్‌.

ఒక్క పేషెంట్‌...

డెభ్బై ఐదేళ్ల మహిళ ఎండలో నీరసంగా నడిచి వెళ్లడం చూసి ప్రవీణ్‌ నహతా కారు ఆపాడు. తాను కొవిడ్‌ పేషెంట్‌ననీ ఆస్పత్రిలో చేరదామంటే ఎవరూ ఆటోలో ఎక్కించుకోలేదనీ చెప్పిందామె. అప్పటికే 12కి.మీ. నడిచిన ఆ ముసలివగ్గుని చూస్తే ప్రవీణ్‌కి కళ్లలో నీళ్లు తిరిగాయి. వెంటనే ఆమెని కారులో ఎక్కించుకుని కొవిడ్‌ సెంటర్‌కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు ఆక్సిజన్‌ పెట్టి చికిత్స అందజేస్తే వారం తిరిగేసరికల్లా కోలుకుంది. ప్రవీణ్‌ది మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ‘లోని’ అనే గ్రామం. గ్రామాల్లోని కరోనా బాధితుల్ని ఎవరూ పట్టించుకోవడం లేదనీ వారు నానా అవస్థా పడుతున్నారనీ గమనించాడు ప్రవీణ్‌. ప్రభుత్వ ఆస్పత్రులు లేవు. ఆ పేదలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అసాధ్యం. దాంతో ఐసొలేషన్‌లో చికిత్స తీసుకోవాల్సిన వాళ్లు ఊళ్లో చెట్ల కిందో పశువుల పాకల్లోనో ఉంటున్నారు. అందుకని ప్రవీణ్‌ ఆయా గ్రామ పెద్దలతో మాట్లాడి ఐదు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్పించాడు. కార్యకర్తల సాయంతో వాటికి అవసరమైన పడకలూ, ఆక్సిజన్‌ సిలిండర్లూ లాంటివన్నీ ఆగమేఘాల మీద అమర్చాడు. క్వారంటైన్‌ సెంటర్‌కి ప్రభుత్వ అనుమతి కావాలంటే చికిత్స చేయడానికి అర్హులైన డాక్టర్లు ఉండాలి. అందుకని సెంటర్‌కి ఇద్దరు చొప్పున డాక్టర్లనీ నియమించాడు. మామూలుగా వారికిచ్చే జీతంకన్నా ఎక్కువ మొత్తం ఇచ్చి ఈ పల్లెల్లో సేవలందించేందుకు ఒప్పించాడు. ఇప్పుడక్కడ 200 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మరో 300 మంది దాకా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. వారికి వసతీ భోజనమూ అన్నీ ఉచితమే. ‘ఇప్పటికి కొన్ని లక్షలు ఖర్చయింది. అప్పుతెచ్చాను... డబ్బుదేముంది, మళ్లీ సంపాదించుకోవచ్చు. ప్రాణాలు పోతే రావు కదా. ఇప్పుడు వాళ్లంతా ధైర్యంగా ఉన్నారు’ అని చెబుతాడు ప్రవీణ్‌. పేషెంట్ల బాగోగులు చూస్తూ రాత్రిళ్లు అక్కడే పడుకున్న ప్రవీణ్‌కి కూడా కరోనా సోకింది. దాంతో అతడూ అక్కడే చికిత్స పొంది కోలుకున్నాడు. అహ్మద్‌నగర్‌లో ప్రవీణ్‌ చేపట్టిన ఈ ప్రయోగం మంచి ఫలితం ఇవ్వడంతో ఇప్పుడు చుట్టుపక్కల ఊళ్ల వాళ్లు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.

ఒక్క సిలిండర్‌...

సమయానికి ఆక్సిజన్‌ సిలిండర్ని అందించినప్పుడు రోగి తాలూకు బంధువుల కళ్లలో కన్పించే ఆనందం కోసం ఆ కార్యకర్తలు పగలూ రాత్రీ తేడా లేకుండా కష్టపడుతున్నారు. తెల్లవారుజామున పడుకుంటే మళ్లీ ఎనిమిదింటికల్లా ఫోన్లు మొదలవుతాయి. రోజుకు 15 వేల ఫోన్‌ కాల్స్‌ తీసుకుని వారు అడిగిన చోటల్లా ఆక్సిజన్‌ ఏర్పాటు చేయడమంటే మాటలు కాదు. ఏప్రిల్‌ మొదటివారం నుంచి దాదాపుగా వారి దినచర్య అదే. ఇక వాళ్ల సారథి హర్‌తీరథ్‌ సింగ్‌ అయితే రోజూ ఒక్కపూటే భోజనం, ఒక్క గంటే నిద్ర. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల ముందు తనవి చాలా చిన్న త్యాగాలే అంటాడు అతను. ప్రవాస భారతీయుడు ప్రారంభించిన గురుగ్రామ్‌లోని హేమ్‌కుండ్‌ ఫౌండేషన్‌ గత పదేళ్లుగా పల్లెల్లో ఉచిత పాఠశాలల్ని నిర్వహిస్తోంది. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు భోజనాలు పెట్టి అవసరమైన వారికి ఆక్సిజన్‌ సిలిండర్లనూ ఏర్పాటుచేశారు. ఈసారి మాత్రం ఆక్సిజన్‌ డిమాండ్‌ వీరిని అసలు ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఆక్సిజన్‌ కోసం ఫ్యాక్టరీల దగ్గర కాపలా కాయాలి, ఆస్పత్రుల దగ్గర ఎవరికి కావాలో చూసుకోవాలి, రవాణా మరో బాధ్యత. దాంతో ఎంతమంది కార్యకర్తలున్నా సరిపోవడం లేదంటాడు హర్‌ తీరథ్‌ సింగ్‌. ఒక్క గురుగ్రామ్‌ చుట్టుపక్కలే రోజుకు రెండు వందలకు పైగా సిలిండర్లను అందించాల్సివస్తోంది. ఆస్పత్రికి వెళ్లేలోపు దారిలోనే ఆక్సిజన్‌ అందించేందుకు ఈ సంస్థ కార్యాలయంలో చేసిన ఏర్పాటు(డ్రైవ్‌ త్రూ) వల్ల కొన్ని వందలమంది ప్రాణగండం నుంచి బయటపడ్డారట. చదువుకుంటూనే స్వచ్ఛంద సేవ చేస్తున్న హర్‌తీరథ్‌సింగ్‌ రెండుసార్లు కరోనా బారినపడ్డాడు. అయినా భయపడకుండా మళ్లీ ఈ పని ఎలా చేస్తున్నావని అడిగితే- భయమెందుకు, జీవితానికి ఏదో ఒక సార్థకత ఉండాలి- అంటాడు. కోలుకున్నవాళ్లు కార్యకర్తలుగా సేవలందిస్తామని రావడం చూస్తే చాలా సంతోషంగా ఉంటుందట ఈ యువకుడికి.

ఒక్క సాయం...

మహితానాగరాజ్‌ బెంగళూరులో ఉంటుంది. మొదటిసారి లాక్‌డౌన్‌ సమయంలో విదేశాల్లో ఉన్న ఒకరిద్దరు స్నేహితులు ఫోన్‌ చేసి వృద్ధులైన తమ తల్లిదండ్రులు ఒంటరిగా ఉన్నారనీ, వారికి కావలసిన మందులవీ కొనిచ్చి సాయం చేయమనీ మహితను అడిగారట. ఇళ్లకు వెళ్లి ఆ పెద్దవాళ్లను చూసిన మహితకు ఇలాంటి వాళ్లు చాలామంది ఉంటారు కదా, వారందరి పరిస్థితీ ఏమిటన్న ఆలోచన వచ్చింది. ఇంటికి రాగానే ఆ ఆలోచనను ఫేస్‌బుక్‌లో పంచుకుంది. వందల్లో వచ్చిన కామెంట్లు చూస్తే ఆ పరిస్థితుల్లో ఎంత మంది ఉన్నారో అర్థమైంది. ప్రతి ఊళ్లోనూ అవసరం ఉంది కాబట్టి పరిష్కారం కూడా స్థానికంగానే ఉండాలనుకున్న మహిత ‘కేర్‌మాంగర్స్‌ ఇండియా’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీ పెట్టింది. ఆసక్తి ఉన్నవాళ్లందరినీ కార్యకర్తలుగా నమోదు చేసుకోమంది. సాయం కావాల్సిన వాళ్లు ఎవరైనా ఆ పేజీలో తమ అవసరాన్ని చెప్పి చిరునామా ఇస్తే అక్కడికి దగ్గర్లో ఉన్న కార్యకర్తలు ఆ పని చేసిపెడతారు. కొద్దిరోజుల్లోనే డిమాండ్‌ విపరీతంగా పెరగడంతో పూర్తిస్థాయి హెల్ప్‌లైన్‌గా మార్చేసింది. ఇప్పుడీ పేజీకి 46 వేల మంది సభ్యులున్నారు. దాదాపుగా దేశంలోని అన్ని నగరాల్లోనే కాక, 14 దేశాల్లో కార్యకర్తలు సేవలు అందిస్తున్నారు. ‘కేర్‌మాంగర్స్‌ ఇండియా’ పేరును ‘హ్యూమన్‌కైండ్‌ గ్లోబల్‌’గా మార్చి, మానసిక సమస్యలకు కౌన్సెలింగ్‌ ఇచ్చే ఏర్పాటు కూడా ఈ పేజీ వేదికగా కల్పిస్తోంది మహిత. ఒక చిన్న ఆలోచన, కాస్త చొరవ... ఫలితం దేశదేశాలకూ విస్తరించిన ఈ సేవాభావం.

ఒక్క చోటు...

వైరస్‌ టెస్టులూ చికిత్సలూ ఐసొలేషనూ క్వారంటైనూ... వీటి సంగతి చాలామంది చూసుకుంటున్నారు. కానీ రేపటి పౌరులైన చిన్నారులు బడి ముఖం చూసి ఏడాది దాటిపోయింది. ఈ లెక్కన పల్లెటూరి పేద పిల్లలు ఏమైపోవాలీ అన్న ఆలోచన వేధించింది సంతోష్‌ ఫడ్‌ని. మాండ్వాకి చెందిన ఈ ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ పట్టణాలకీ పల్లెలకీ మధ్య విద్యాప్రమాణాల్లో ఉన్న తేడాని తగ్గించాలన్న లక్ష్యంతో ‘థింక్‌షార్ప్‌ ఫౌండేషన్‌’ పెట్టి సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌గా మారాడు. అతడు ప్రారంభించిన ‘స్టడీమాల్‌’ పద్ధతి పలు గ్రామాల్లో మంచి ప్రభావం చూపుతోంది. బడి అయ్యాక పిల్లలు ఆడుతూ పాడుతూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు తోడ్పడుతుంది ఈ స్టడీమాల్‌. అయితే కరోనా నేపథ్యంలో జరుగుతున్న ఆన్‌లైన్‌ తరగతులకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నాలుగోవంతు పిల్లలు మాత్రమే హాజరు కాగలుగుతున్నారు. దాంతో మిగిలిన పిల్లలు చదువుకు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉందని భావించిన సంతోష్‌ స్మార్ట్‌ఫోన్లూ, ట్యాబ్లెట్లూ కొని గ్రామాల్లోని పిల్లలకు అందజేయడం మొదలెట్టాడు. వంద మంది పిల్లలకు ఆ పరికరాలు కొనివ్వాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. అందుకని ఎక్కువ మంది లబ్ధి పొందేలా చూడడం కోసం ఇరుగుపొరుగు పిల్లలు నలుగురు కలిసి ఒక ఫోన్‌ లేదా ట్యాబ్‌ను వినియోగించుకునేలా ప్రణాళిక తయారు చేసింది ఈ సంస్థ. ఈ పరికరాల్లోని ‘డిజి లైబ్రరీ’ ఆప్‌లో పిల్లలకు కావలసిన 1200 పుస్తకాలు ఉంటాయి. క్రౌడ్‌ ఫండింగ్‌ సాయంతో నిధులు సేకరించడం, ఒక్కో గ్రామంలో పిల్లలకు ట్యాబ్‌లు అందించడం... అలా ఒక ఉద్యమంగా తన పని చేసుకుంటూ వెళ్తున్నాడు సంతోష్‌. తమ పని చూసి స్ఫూర్తిపొందిన చాలామంది ఇప్పుడు పిల్లలకు ట్యాబ్‌లు కొనిస్తున్నారనీ, ఇది క్రమంగా అన్ని గ్రామాలకూ విస్తరిస్తే మళ్లీ పరిస్థితులు మామూలుగా అయ్యేవరకూ పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి తగ్గకుండా చూసుకోవచ్చనీ ఆశిస్తున్నాడు సంతోష్‌.

ఇలాంటివారూ ఉంటారు!

బెంగళూరులోని ఒక ఆస్పత్రి. అర్జెంటుగా 22 ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలి. అధికారులు ఆందోళన చెందుతోంటే పోలీసు ఇన్స్‌పెక్టర్‌ ఒకరు నటుడు సోనూసూద్‌కి మెసేజ్‌ పెట్టాడు. అంతే, కొన్ని గంటల్లో అతడి బృందం సిలిండర్లను తెచ్చి 22 ప్రాణాలను కాపాడింది. దేశంలో ఏ పక్కన ఏ అవసరమున్నా నేనున్నానంటూ సహాయ హస్తం అందిస్తున్న సోనూసూద్‌, ‘ఫీడ్‌ ఇండియా’ పేరుతో సేవలందిస్తున్న వికాస్‌ ఖన్నా లాంటి సెలెబ్రిటీలే కాదు ఎందరో సాధారణ పౌరులూ సాటివారి కోసం చేస్తున్న త్యాగాలు చిన్నవి కావు.
* పాస్కల్‌ సల్దానా, రోజీ దంపతులది ముంబయి. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోజీకి ఎప్పుడే అవసరం వస్తుందోనని ఆస్తులన్నీ అమ్మేసి చేతిలో డబ్బు ఉంచుకున్నాడు పాస్కల్‌. ఇప్పుడు దాంతో ఆక్సిజన్‌ సిలిండర్లు కొని పంచుతున్నారు. అది చాలక నగలు అమ్మేశారు. అప్పులూ చేశారు. ఇప్పుడిక క్రౌడ్‌ ఫండింగ్‌ వెబ్‌సైట్‌ సాయమూ తీసుకుంటున్నారు.
* భార్య బంగారాన్ని అమ్మేసి మరీ తన ఆటోని అంబులెన్స్‌గా మార్చి ఉచితంగా కొవిడ్‌ రోగులకు సేవలు అందిస్తున్నాడు భోపాల్‌కి చెందిన ఆటో డ్రైవర్‌ జావెద్‌.
* నోయిడాలో స్నేహితుడు రంజన్‌ అగర్వాల్‌కి సమయానికి ఆక్సిజన్‌ సిలిండర్‌ అందించడానికి బొకారొ నుంచి 1400కి.మీ. 24 గంటలపాటు నిర్విరామంగా డ్రైవ్‌ చేస్తూ వెళ్లాడు దేవేంద్ర.
* ముంబయికి చెందిన షానవాజ్‌ షేక్‌ దాచుకున్న డబ్బుకి, ఎస్‌యూవీ అమ్మగా వచ్చిన 22లక్షలూ కలిపి ఆక్సిజన్‌ సిలిండర్లు కొని 250 మంది ప్రాణాలు నిలబెట్టాడు.
* తొమ్మిదేళ్ల లిసిప్రియ పర్యావరణ కార్యకర్తగా ఎన్నో అవార్డులు అందుకుంది. వాటిద్వారా వచ్చిన డబ్బునీ పాకెట్‌మనీని కలిపి వంద ఆక్సిజన్‌ సిలిండర్లను కొని బాధితులకు అందజేసిందీ చిన్నారి.

స్వచ్ఛంద సంస్థలూ

అన్నదానానికి పేరొందిన సిక్కుల గురుద్వారాలు ఇప్పుడు కొవిడ్‌ బాధితుల కోసం ప్రత్యేకంగా ‘లంగర్‌’లను నిర్వహిస్తూ ఇళ్లూ ఆస్పత్రులవద్దకే ఆహారాన్ని తీసుకెళ్లి అందిస్తున్నాయి. గాజియాబాద్‌లో అయితే బాధితులకోసం అచ్చంగా ఆక్సిజన్‌ లంగర్‌ని నిర్వహిస్తున్నారు. బెంగళూరులోని 19 స్వచ్ఛంద సంస్థలు సంఘటితమై ‘మెర్సీ మిషన్‌’ పేరుతో కొవిడ్‌ బాధితులకు అవసరమైన అన్ని సేవల్నీ అందిస్తున్నాయి. చెన్నైలో వందలాది యువతీయువకులు సంఘటితమై(ఫుట్‌ సోల్జర్స్‌) ఆస్పత్రుల దగ్గర బృందాలుగా అటు వైద్యులకూ ఇటు రోగులకూ కుడిభుజంగా నిలుస్తున్నారు. వారిలో కొందరు ఉద్యోగాలను మానేసి మరీ వచ్చారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థలు... ఎందరో మంచి మనుషులు..! ఆకలి తీర్చే వారొకరు... సగౌరవంగా అంతిమసంస్కారం చేసేవారొకరు... మాటసాయంతో మనో నిబ్బరాన్నిపెంచుతున్నవారొకరు...మొత్తంగా- ఒకరిని చూసి ఇంకొకరు... వారిని చూసి వేరొకరు... ఇలా, సాటివారికి సాయం చేస్తూ, మంచితనమూ మానవత్వమూ తమలో మెండుగా ఉన్నాయని చాటుతున్న మహానుభావులు ఎందరో..!

స్థానికంగా... సాయం

తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ప్రతి నగరంలోనూ స్వచ్ఛంద సంస్థలు కొవిడ్‌ రోగులకు ఆహారాన్నీ మెడికల్‌ కిట్‌లనూ ఉచితంగా అందిస్తున్నాయి. పలుచోట్ల అపార్ట్‌మెంట్‌ సముదాయాల్లో మహిళలు వంతులవారీగా బాధితులకు భోజనాలు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌ సైక్లింగ్‌ సంఘం ఆధ్వర్యంలో యువత ఇంటికే మందుల్నీ ఆహారాన్నీ చేరవేస్తోంది. నోఫుడ్‌వేస్ట్‌, ఫీడ్‌ ద నీడీ, సీ19టాస్క్‌ఫోర్స్‌, స్పందన, ధనలక్ష్మి ట్రస్ట్‌ లాంటి సంస్థలెన్నో జంటనగరాల్లోని పేద కొవిడ్‌ పేషెంట్లకు ఉచితంగా భోజనం సరఫరాచేస్తుండగా, హ్యూమానిటీ ఫస్ట్‌, సకీనా, సెకండ్‌ ఛాన్స్‌ షౌండేషన్‌ లాంటి సంస్థలు ఆక్సిజన్‌ సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్నాయి. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సేకరించి వేర్వేరు ప్రాంతాల్లో ఉచిత ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసే ప్రయత్నాల్లో ఉన్నాయి మరికొన్ని సంస్థలు. ఆరోగ్యకృష్ణా, టీమ్‌తారక్‌ట్రస్టు, అమ్మ చారిటబుల్‌ ట్రస్టు, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ లాంటివి కృష్ణా, గుంటూరు, విశాఖపట్నాల్లో సేవలందిస్తున్నాయి.

ఇదీ చూడండి:టీకా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ABOUT THE AUTHOR

...view details