‘వరుణ్.. నువ్వు ఇంట్లో నుంచి పనిచేసినా నాకు ఆఫీస్‌కి వెళ్లినట్లే అనిపిస్తోంది.. అస్సలు నీతో గడిపినట్లే అనిపించట్లేదు.. రేపు నాకోసం సెలవు పెట్టచ్చుగా..’ అంటూ ముద్దుముద్దుగా తన భర్తను బతిమాలుకుంటోంది వర్ష. ‘అస్సలు కుదరదు బంగారం.. రేపు మా బాస్‌తో వర్చువల్ మీటింగ్ ఉంది.. వచ్చే వారం చూద్దాంలే..’ అనేసరికి ‘నా విషయంలో నువ్వెప్పుడూ ఇలాగే చేస్తావ్.. పో..!’ అంటూ అలక పాన్పెక్కేసింది వర్ష.
సోహన్‌కు తన భార్య సోనాలీ అంటే ఎక్కడలేనంత ప్రేమ. చిన్న అకేషన్ అయినా సరే.. తన ఇష్టసఖికి సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లిస్తుంటాడు. కానీ సోనాలీ ఈ విషయంలో కాస్త వెనకబడిందని చెప్పుకోవచ్చు. ఓ రోజు ఉండబట్టలేక ‘ఎప్పుడూ గిఫ్ట్‌లిస్తే తీసుకోవడమేనా.. తిరిగి ఒక్కసారైనా నన్ను సర్‌ప్రైజ్ చేసేది ఉందా, లేదా?’ అంటూ ప్రేమగా అడుగుతూనే మూతి ముడుచుకున్నాడు సోహన్.
వినడానికి కాస్త సిల్లీగా అనిపించినా ఇలాంటి చిన్నపాటి అలకలు భార్యాభర్తల మధ్య కామన్. అయితే ఇవి అంతటితోనే ఆగిపోవు.. అలక పాన్పు ఎక్కిన వారు ఆ ఎమోషన్‌ని అలాగే కొనసాగించడం, ఆపై ఇద్దరి మధ్యా మాటామాటా రావడం.. ఇది ఎక్కడిదాకా వెళ్తుందంటే భాగస్వామి అమ్మానాన్నలపై ఉండే కోపాన్నంతా ఇక్కడే తీర్చేసుకునేంతగా! నిజానికి ఇంత చిన్న విషయానికి అంతదాకా వెళ్లడమెందుకు.. ‘సెలవేగా పెట్టేస్తే పోలా.. గిఫ్టేగా ఇచ్చేస్తే సరిపోదా..’ అనుకుంటూ ఒకరికొకరు సర్దుకొని పోతే ఆ సంసారం ఆ జన్మాంతం నిత్యనూతనంగా సాగిపోతుందనడంలో సందేహం లేదు. మరి, ఎలాగూ ఈ విషయం గురించి చర్చకొచ్చింది కాబట్టి.. దంపతుల మధ్య సరదాగా, సిల్లీగా జరిగే ఇలాంటి గొడవలేంటి? అవి తమ అనుబంధాన్ని ఎలా దృఢం చేస్తాయి? తెలుసుకుందామా?
వాళ్లను చూసి నేర్చుకోండి!
దాంపత్య బంధాన్ని నిత్య నూతనం చేసే అంశాల్లో రొమాన్స్ ముందు వరుసలో ఉంటుంది. అయితే ఇది నాలుగ్గోడల మధ్య ఉన్నంత వరకే అందులోని ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించగలం. కానీ కొందరు భార్యాభర్తలు నలుగురిలోనూ చాలా రొమాంటిక్‌గా ఒకరి నడుం మీద మరొకరు చెయ్యి వేయడం, ముద్దులాడడం.. వంటివి చేస్తుంటారు. అది చూసి కన్ను కుట్టిన మరో జంట ఇంటికొచ్చాక.. ‘నువ్వూ ఉన్నావ్ ఎందుకు.. ఎప్పుడైనా అలా చేశావా?’ అంటూ మాటామాటా అనుకోవడం మొదలుపెడతారు. ఇది చినికి చినికి గాలి వానలా మారి ఒకరినొకరు అపార్థం చేసుకునే దాకా వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది వినడానికి కాస్త సిల్లీగానే అనిపించినా.. చాలామంది దంపతులు ఈ విషయం గురించి చిర్రుబుర్రులాడుకుంటారు.. కాదంటారా? అయితే ఇలాంటి సమయంలోనే ఇద్దరూ నేనంటే నేనన్నట్లుగా కోపగించుకోవడం కాకుండా.. ఒకరు అలిగినా మరొకరు ఎదుటివారిని కూల్ చేసేలా ఉండాలి. మీ భాగస్వామి అడిగిన రొమాన్సేదో తాను అలకపాన్పుపై ఉన్నప్పుడు చేయండి.. వెంటనే మీ కౌగిలిలో ఒదిగిపోకపోతే అడగండి..!
ఇంతకీ నువ్వు సినిమాకు వెళ్లింది ఎవరితో?
అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పెళ్లయ్యాక తనకంటూ కాస్త ప్రైవసీ ఉండాలని కోరుకోవడం సహజం. ఈ క్రమంలో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా సినిమాలు, షికార్లు చేస్తుంటారు. అయితే కొంతమంది దంపతులు ఈ విషయంలో కూడా గొడవలు పడుతుంటారు. రోజూ ఒకే చోట బోర్‌గా ఉందని.. అలా కాసేపు స్నేహితులతో గడపడానికి వారిళ్లకో లేదంటే అందరూ కలిసి సినిమాకో వెళ్లారనుకోండి..! ఇక అంతే.. ఇంటికొచ్చాక వారికి తమ భాగస్వామి చేతిలో తిట్ల పురాణం రడీగా ఉంటుంది. ‘నిన్న నేను సినిమాకు వెళ్దామంటే టైం లేదన్నావు.. ఇప్పుడు అదే సినిమాను నువ్వు మీ ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తావా? నేనంటే నీకు లెక్కలేదు.. నా కన్నా నీకు మీ ఫ్రెండ్సే ఎక్కువయ్యారు..! ఇంతకీ నువ్వు వెళ్లింది నీ గర్ల్‌ఫ్రెండ్‌తోనా? బాయ్‌ఫ్రెండ్‌తోనా?’ ఇలా నాన్‌స్టాప్‌గా ఎదుటివారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు. దాంతో వారికి ఓపిక నశించిపోతుంది. అప్పుడు వాళ్లు కూడా రంగంలోకి దిగారనుకోండి.. సంతోషంగా గడపాల్సిన సమయం కూడా ముళ్లపాన్పుపై కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలోనే భార్య అయినా, భర్త అయినా సమయస్ఫూర్తితో ఆలోచించాలి. ఇద్దరిలో ఎవరు తమ ఫ్రెండ్స్‌తో గడపడానికి బయటికి వెళ్లినా.. ‘నీకోసం ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తానం’టూ వారికి హామీ ఇవ్వాలి. మీరు బయటి నుంచి ఇంటికెళ్లే క్రమంలో వారికి నచ్చిన గిఫ్ట్ తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేసినా.. మీపై కోపంగా ఉన్న వారు కూడా వెంటనే కరిగిపోతారు.. కావాలంటే ఓసారి ట్రై చేయండి!
గురక ఆపుతావా?