తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఇలా ఉంటే మీరు వారి గుండెల్లో ఉన్నట్లే! - భార్యభర్తలు ఇలా ఉంటే జీవతం సంతోషమయం

'నీ జతగా నేనుండాలి.. నీ ఎదలో నే నిండాలి.. నీ కథగా నేనే మారాలి..' ఏ దంపతులైనా ఇంత అన్యోన్యంగా, ప్రేమగా కలిసి ఉండాలని, ఎలాంటి అరమరికల్లేకుండా తమ సంసార నావ హాయిగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటారు. అయితే భాగస్వామిలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వాటి ద్వారా వారితో జీవితం అంతా సంతోషంగా జీవించగలమా? లేదా? అనే విషయంలో ఒక అంచనాకి రావచ్చంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఈ లక్షణాలు భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా మెలిగేందుకు బాగా ఉపకరిస్తాయట! అంతేనా.. ఇవి వారి మధ్య ఉన్న ప్రేమని రెట్టింపు చేసి బంధాన్ని మరింత దృఢపరుస్తాయట! ఇంతకీ ఆ లక్షణాలేంటో ఓసారి మనమూ తెలుసుకుందాం రండి.

signs how to know you will be happy in marriage life in telugu
signs how to know you will be happy in marriage life in telugu

By

Published : Jul 2, 2020, 10:41 AM IST

ఆలుమగల దాంపత్యం సంతోషంగా సాగిపోవాలి.. సంసారంలో సరిగమలు పలకాలి.. ఇది సాధ్యం కావాలంటే భార్యాభర్తలిద్దరిలోనూ ఒకరికొకరుగా జీవించే తత్వం, ఒకరిపై మరొకరికి అపారమైన నమ్మకం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇలాంటి పునాదుల మీద ఏర్పడిన వైవాహిక బంధమే దీర్ఘకాలం నిలిచి ఉంటుంది అంటారు పెద్దలు. అయితే భాగస్వామిలో కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా కూడా ఆ వ్యక్తితో జీవితం సంతోషంగా ఉంటుందా? లేదా? అనేది అంచనా వేయడానికి ప్రయత్నించవచ్చు అంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.

సంతోషమే ముఖ్యం..

వైవాహిక జీవితం సంతోషంగా ముందుకు సాగిపోవాలంటే అందుకు దంపతులు ఆనందంగా జీవించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో భాగస్వామిని సంతోషపరచడానికి సందర్భాలేవీ లేకపోయినా చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం, సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం, టూర్లకు తీసుకెళ్లడం.. ఇలా వారికి నచ్చే పని ఏదో ఒకటి చేయచ్చు. ఇలా ఏ పని చేసినా దాని లక్ష్యం.. భాగస్వామి అధరాలపై చిరునవ్వు చూడడమే! గుండెల నిండా నిండిన ప్రేమతో చేసే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు బంధాన్ని మరింత దృఢపరుస్తాయి. ఆలుమగలని మరింత దగ్గర చేస్తాయి.

ఫుల్ సపోర్ట్..

జీవితంలో మీకు ఏవైనా వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమస్యలు ఎదురైనప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మీకు పూర్తి సహాయ సహకారాలు అందించడమే కాదు.. వెన్నుదన్నుగా నిలిచి తిరిగి సాధారణ స్థితికి చేరుకునేలా చేయడానికి ప్రయత్నించే భాగస్వామితో జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు, రచించుకునే ప్రణాళికలు.. ఇలా ప్రతి విషయంలోనూ పూర్తిగా అండగా నిలిచే భాగస్వామి తోడు ఉంటే సంసారం సంతోషంగా ముందుకు సాగిపోవడం మాత్రమే కాదు.. చేసే ప్రతి పనిలోనూ విజయం కూడా మీ వెంటే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సర్దుకుపోయే తత్వం..

సాధారణంగా ఆలుమగలిద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు గొడవ పడడం, మాటామాటా అనుకోవడం.. వంటివి జరుగుతుంటాయి. అయితే కొందరు ఈ గొడవ లేదా మాటలకు మనసు చిన్నబుచ్చుకొని మాట్లాడడం మానేయడం వంటివి చేస్తుంటారు. అటువంటప్పుడు భాగస్వామికి జరిగిన దానిపై సరైన వివరణ ఇచ్చి, బుజ్జగించి తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఇలాంటి చిన్న చిన్న గొడవలు భార్యాభర్తల మధ్య వస్తేనే ఆ బంధం మరింత బలపడుతుంది అంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. అయితే ప్రతి చిన్న విషయానికీ గొడవపడడం కూడా మంచిది కాదని వారి సూచన.

మారమని అడగరు..!

ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు ఎలా వారి బలాలు, బలహీనతలు.. అన్నింటినీ అంగీకరిస్తామో పెళ్లి తర్వాత కూడా వారిని అలాగే అంగీకరించాలి. మీ స్వార్థం కోసం భాగస్వామి ప్రవర్తనలో మార్పులు చేసుకోవాలని అడగకూడదు. ఒకవేళ దంపతుల్లో ఎవరైనా మరొకరికి ఈ తరహా మార్పులు సూచించాలని అనుకున్నప్పుడు వారితో స్నేహపూర్వక వాతావరణంలో మాట్లాడాలి. వారి ప్రవర్తన కారణంగా జరిగే నష్టం ఏమిటి? దానిని మార్చుకోవడం ద్వారా వారికి కలిగే ప్రయోజనాలు ఏంటి.. మొదలైన విషయాలపై వారికి అవగాహన కల్పించాలి. ఫలితంగా వారంతట వారే మార్పుని స్వీకరిస్తారు. అంతేకానీ.. 'నాకు నీ ప్రవర్తన నచ్చలేదు.. నువ్వు మారాలి..' అంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండిపోతే అది లేనిపోని గొడవలకు దారి తీయచ్చు.

జంటగానే పరిష్కారం..

జీవితంలో ఎప్పుడూ సంతోషాలే కాదు.. అప్పుడప్పుడూ సమస్యలు కూడా వస్తుంటాయి. అటువంటప్పుడు వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా భార్యాభర్తలిరువురూ కలిసి పరిష్కరించుకునే దిశగా ఆలోచించాలి. సంతోషం లేదా సమస్య.. ఇలా సందర్భం ఏదైనా భాగస్వామితో కలిసి దానిని ఎదుర్కొనేందుకు సన్నద్ధత చూపే లక్షణం ఉండడం సంతోషకరమైన వైవాహిక జీవితం గడిపేందుకు ముఖ్యమైంది అంటున్నారు నిపుణులు. కాబట్టి సంతోషాన్నే కాదు.. ఇకపై సమస్యలను కూడా భాగస్వామితో పంచుకోవడం ద్వారా బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు.

తొలి ప్రాధాన్యం మీరే..!

  • మీకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికీ ప్రాధాన్యం ఇవ్వడం..
  • రోజులో జరిగిన ప్రతి సంఘటన గురించీ మీతో పంచుకునేందుకు ఆసక్తి చూపించడం..
  • మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, వారి సంతోషాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం..
  • మీపై ఎక్కువగా ప్రేమ కురిపించడం..
  • మీ సంతోషాన్నే వారి సంతోషంగా భావించడం..
  • నీతి, నిజాయతీలతో వ్యవహరించడం..
  • మీరు చెప్పే ప్రతి విషయాన్నీ ఏకాగ్రతతో వినిపించుకోవడం.. మొదలైనవి.

ఈ లక్షణాలన్నీ మీ భాగస్వామిలో కనిపిస్తే వారితో వైవాహిక జీవితం సంతోషంగా ముందుకు సాగిపోవడమే కాదు.. అది దీర్ఘకాలం పాటు నిస్సందేహంగా కొనసాగుతుంది అంటున్నారు నిపుణులు.

ABOUT THE AUTHOR

...view details