అమ్మాయిలు.. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెడతారు. కొత్త ఇళ్లు, కొత్త మనుషులు, వేర్వేరు అలవాట్లు, ఆచారాలతో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే.. అబ్బాయిలూ తమ భాగస్వామి విషయంలో మొదట్లో కాస్త ఆందోళన చెందుతారు. అమ్మానాన్నను వదిలి తానే సర్వస్వమని భావించి వచ్చిన అమ్మాయి తన ఇంట్లో అడ్జెస్ట్ అవుతుందా. తన వాళ్లతో కలిసిపోతుందా అనే అనుమానం వారిని కొంచెం కలవరపెడుతుంది.
ఇలా నూతనంగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన వారు.. తమ భాగస్వాములతో ఎలా మాట్లాడాలో.. ఎలా ప్రవర్తించాలో తెలియక ఆందోళన పడుతుంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ముందడుగేసి మాట కలిపితే ఈ టెన్షన్ పరార్ అవుతుంది. అలా ముందే మీరు మాట కలపాలంటే.. కొత్త జంట మధ్య ప్రేమ ప్రయాణం ప్రారంభం కావాలంటే ఈ చిన్ని చిట్కాలు తెలుసుకోవాల్సిందే...
కమ్యూనికేషన్...
కొత్త జంటకు కమ్యూనికేషన్ అత్యంత అవసరం. రోజులో జరిగిన విషయాలను భాగస్వామితో పంచుకోవడం వల్ల ఆనందాలు రెట్టింపవుతాయి. అలాగే ఏదైనా బాధ ఉంటే దాన్నీ షేర్ చేసుకుంటే తగ్గిపోతుంది. అన్నీ తనతో పంచుకోవడం వల్ల ఎదుటి వారికి మీ పట్ల నమ్మకంతోపాటు అభిమానమూ పెరుగుతుంది. ఇది ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని పెంచుతుంది.