తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Relationship Advice: అతని భార్య కన్నా.. నేనే ఇష్టమట - రిలేషన్​షిప్ సమస్యలు

Relationship Advice : నేనొక ఐటీ ఉద్యోగిని. ఏడాది కిందట ఒకబ్బాయి పరిచయమయ్యాడు. అతనితో స్నేహం ప్రేమగా మారడంతో అన్నిరకాలుగా దగ్గరయ్యా. తనకి పెళ్లై పిల్లలున్నారనే షాకింగ్‌ విషయం తర్వాత తెలిసింది. మోసపోయానని నిలదీశాను.. గొడవ చేశాను. అప్పట్నుంచి నన్ను దూరం పెట్టసాగాడు. కొన్నాళ్లయ్యాక నేనూ మాట్లాడ్డం మానేశా. అయితే కొద్దిరోజుల కిందట తను మరో అమ్మాయితో తిరగడం చూశా. కానీ ఏమైందో తెలియదు.. నాల్రోజుల కిందట నా దగ్గరకొచ్చి ‘నేను పెద్ద తప్పు చేశా. ప్రేమంటే ఏంటో నాకిప్పుడు తెలిసొచ్చింది. మా ఆవిడకన్నా నువ్వే ఇష్టం. మనిద్దరం గుళ్లో పెళ్లి చేసుకుందాం’ అంటున్నాడు. నాకంతా అయోమయంగా ఉంది. నేనతడ్ని నమ్మొచ్చా? - ఎస్‌.ఆర్‌, హైదరాబాద్‌

Relationship Advice
Relationship Advice

By

Published : Feb 5, 2022, 10:10 AM IST

Relationship Advice : విషయం, సమస్యని సవివరంగా చెప్పినందుకు అభినందనలు. గతంలో ఒకసారి మోసపోయిన మీరు మళ్ళీ గుడ్డిగా నమ్మకుండా మిమ్మల్ని మీరు చెక్‌ చేసుకోవడం మంచి పరిణామం. మీకు వయసు, మంచి ఉద్యోగం ఉండటంతో పెళ్లి అనేది సమస్యే కాదు. మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి చాలామంది అబ్బాయిలు ముందుకొస్తారు. ముందు అతడి మైకం నుంచి బయట పడండి. కెరీర్‌, ఆర్థికంగా స్థిరపడటంపైనే మనసు పెట్టండి.

మీతో బ్రేకప్‌ తర్వాత తను మరో అమ్మాయితో కూడా తిరగడం చూశానంటున్నారు.. దీన్ని బట్టి చూస్తే తన వ్యక్తిత్వం ఎలాంటిదో మీకు అర్థమై ఉండాలి. అతన్ని మర్చిపోవడం మాటల్లో చెప్పినంత తేలిక కాకపోవచ్చు. కానీ అతడి కోసం మీ భవిష్యత్తును పాడు చేసుకోవడం అవసరమా? పైగా పెళ్లైన వాడితో ఉండటం.. న్యాయపరంగానూ సమ్మతం కాదు. ఒకవేళ అతడు చెప్పినట్టే పెళ్లాడినా, మీపై వ్యామోహం తీరిన తర్వాత మొహం చాటేయడనే గ్యారెంటీ ఏంటి? ఇవన్నీ ఆలోచించండి. మంచి ఉద్యోగం సంపాదించి సొంతకాళ్లపై నిలబడినట్టే.. అతడి కబుర్లు, కల్లబొల్లి మాటలకు లొంగిపోకుండా ఓ మంచి నిర్ణయం తీసుకోండి. మీ భావి జీవితాన్ని మీరే నిర్మించుకోండి. ఆల్‌ ది బెస్ట్‌.

ABOUT THE AUTHOR

...view details