తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

నా భర్త ఎక్కువగా మాట్లాడడు.. ఈ ఒంటరితనం భరించలేకపోతున్నా!

ఆమె వయసు 28 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. 20 ఏళ్ల వయసు నుంచే పని చేయడం ప్రారంభించడం వల్ల ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు. ఫలితంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న ఆమెకు ఒంటరిగా ఉంటున్నాననే భావన కలుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు సలహా ఇవ్వాలని కోరుతోంది.

By

Published : Mar 13, 2021, 10:45 AM IST

psychologist advice on silent husband and lonely wife in telugu
నా భర్త ఎక్కువగా మాట్లాడడు.. ఈ ఒంటరితనం భరించలేకపోతున్నా!

మీ భర్త మనస్తత్వం, వ్యక్తిత్వ ధోరణి మీరు పెరిగిన వాతావరణానికి, మీ వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు అతను మారడం, లేదా మీరు మీ ఆలోచనలు మార్చుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుందో ప్రాక్టికల్‌గా ఆలోచించాలి.

అలాగే అతని నుంచి మీరు ఆశిస్తున్న మార్పు విషయంలో మీ అంచనాలను కొంత తగ్గించుకుని, అతను ఎలా ఉంటే మీరు సంతోషిస్తారో అతనికి వివరించి చూడండి. అలా కొద్దికొద్దిగా వచ్చిన మార్పులను ప్రోత్సహించడం ద్వారా క్రమంగా మీరనుకున్న మార్పు వస్తుందేమో.

కారణమేమిటి?

ఇన్నేళ్ల నుంచి అలవాటు పడ్డ వ్యక్తిత్వాన్ని అతను ఒక్కసారిగా మార్చుకునే అవకాశం ఉందా అనేది ప్రాక్టికల్ గా ఆలోచించండి. చిన్న వయసు నుంచే అతను ఉద్యోగం, సంపాదన వంటి అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల మానవ సంబంధాలపై పూర్తి అవగాహన లేదేమో? ఒకవేళ అలా కాని పక్షంలో దానికి గల కారణాలు ఏమై ఉండచ్చు? అనేది ఆలోచించండి.

పూర్తిగా వాళ్ల లాగే ఉండాలనుకోవద్దు!

పూర్తిగా వాళ్ల లాగే ఉండాలనుకోవద్దు!

మీ పుట్టింట్లో మీకు అలవాటైన ధోరణిని అతనికి క్రమక్రమంగా అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. ఎలాంటి మాటలు మాట్లాడితే అతని నుంచి ప్రతిస్పందన వస్తుందనేది జాగ్రత్తగా పరిశీలించాలి. తన ఆలోచనా ధోరణి మీవైపు వచ్చేలా ప్రోత్సహించాలి. దానివల్ల అతను మరింతగా మాట్లాడే అవకాశం ఉందేమో గమనించాలి. మీ తల్లిదండ్రులు, సోదరుడి లాగా అతను కూడా అలాగే ఉండాలనేది వాస్తవ దూరమైన ఆంకాక్ష అవుతుందేమో ఆలోచించండి. కాబట్టి ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ అతనిలో మీకు కావాల్సినటువంటి సానుకూల మార్పుని ఎలా తెచ్చుకోగలరు అనే దాని పైన దృష్టి పెట్టాలి.

అభిరుచులను ఆచరణలో పెట్టండి!

మీరు కేవలం అతని మీదే ఆధారపడకుండా మీకంటూ కొన్ని వ్యాపకాలను అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. గతంలో ఆచరణలో పెట్టలేని అభిరుచులను తిరిగి ప్రారంభించే అవకాశాలను పరిశీలించాలి. ఈ రోజుల్లో ఎంత దూరంగా ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించి స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఫలితంగా మీరు ఒంటరిగా ఉన్నానన్న భావనను దూరం చేసుకోగలరేమో ట్రై చేయండి.

ఏ విషయంలో అయినా సరే - ఇతరుల నుంచి మనం మార్పులు ఆశించినప్పుడు, మన వైపు నుంచి మనం తెచ్చుకోగలిగిన మార్పులు ఏంటి? అనేది ఆలోచించక తప్పదు. కాబట్టి మీరు ఏ రకంగా సమయపాలన చేసుకోగలుగుతున్నారు? మీ అర్హతలను ఎలా పెంపొందించుకుంటున్నారు? కొత్త వ్యాపకాలను ఎలా అలవాటు చేసుకుంటున్నారు? మొదలైన విషయాలను చెక్‌ చేసుకోండి. తద్వారా మీరనుకుంటున్న ఒంటరితనాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. - డా|| పద్మజ, సైకాలజిస్ట్.

ఇదీ చూడండి: ఆ బేకరీలో కేక్ కొంటున్నారా.. అయితే జాగ్రత్త

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details