బాలీవుడ్‌కు సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న జంటల్లో ప్రియాంక-నిక్ జొనాస్ జోడీ ఒకటి. 2018 డిసెంబర్లో పెళ్లిపీటలెక్కిన ఈ లవ్లీ కపుల్ తమ దాంపత్య జీవితాన్ని నిత్య నూతనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడానికి ఏ మాత్రం వెనుకాడరీ రొమాంటిక్ కపుల్. ఈక్రమంలో నటిగా ప్రియాంక, సింగర్‌గా నిక్ తమ వృత్తిగత పనుల్లో భాగంగా నిత్యం వివిధ దేశాలు తిరుగుతుంటారు. ఇలా ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే ఈ బ్యూటిఫుల్ కపుల్ తమ అనుబంధాన్ని మరింత దృఢంగా మార్చుకునేందుకు పెళ్లికి ముందే ఓ నియమం పెట్టుకున్నారట. ఈమేరకు తమ రిలేషన్‌షిప్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్ చేసుకుంది ప్రియాంక.
పెళ్లికి ముందే ఆ నియమం పెట్టుకున్నాం..
‘వివాహానికి ముందు వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా ఉండడం వల్ల మేమిద్దరం వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. నా విషయానికొస్తే ఇటు ఇండియాతో పాటు ఒక్కోసారి విదేశాల్లో సైతం ఉండాల్సి వచ్చేది. నిక్‌ది దాదాపు ఇదే పరిస్థితి. అందుకే ఈ సమస్యకు పరిష్కారం కోసం మేమిద్దరం పెళ్లికి ముందే ఓ నియమం పెట్టుకున్నాం. అదేమిటంటే... ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే క్రమం తప్పకుండా ప్రతి మూడు వారాలకొకసారి మేమిద్దరం కలవాలి. మాకు మేము సమయం కేటాయించుకోవాలి. సమన్వయంతో అన్ని పనులు పూర్తిచేయాలి. ఈ స్వీయ ఒప్పందాన్ని మేం బాగా ఫాలో అవుతున్నాం. మా ఇద్దరి మధ్య బంధం బలపడడానికి ఇది ఒక కారణమనుకుంటాను’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.