కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో కాలక్షేపం కోసం ఎక్కువశాతం మంది సోషల్ మీడియా వేదికలపై ఆధారపడుతున్నారు. వీటిలో టిక్‌టాక్ కూడా ఒకటి. అయితే తమ పిల్లలు అనునిత్యం టిక్‌టాక్ అంటూ ఎక్కువ సమయాన్ని వృథా చేస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే అది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందేమోనని చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇదే విషయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పినా.. తల్లిదండ్రుల మాట విని తమ అలవాట్లను మార్చుకునే పిల్లలు ఈరోజుల్లో ఎంతమంది ఉన్నారు..? ఒకవేళ బతిమాలో, భయపెట్టో.. వారి చేత టిక్‌టాక్ వాడకాన్ని తగ్గించేలా చేసినా.. తల్లిదండ్రులకు తెలియకుండా ఈ యాప్‌ను వాడడం ఈ కాలం పిల్లలకు పెద్ద పనేం కాదు. ఈ క్రమంలో టిక్‌టాక్ సంస్థ తమ యాప్‌లో కొత్తగా ‘Family Pairing’ అనే ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల టిక్‌టాక్ ఖాతాలను కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..!
ఇలా చేయండి..!
మీ పిల్లల టిక్‌టాక్ అకౌంట్‌ని కంట్రోల్ చేసేందుకు ముందుగా మీకంటూ ప్రత్యేకంగా టిక్‌టాక్‌లో ఒక అకౌంట్ ఉండాలి. మీరు వాడుతోన్న యాప్ లేటెస్ట్ వెర్షన్ అయితే ఫర్వాలేదు.. ఒకవేళ కాకపోయుంటే మాత్రం ప్లేస్టోర్‌కి వెళ్లి దానిని అప్‌డేట్ చేయండి. ఇప్పుడు టిక్‌టాక్ యాప్ ఓపెన్ చేసి..
- ప్రొఫైల్ పేజీని క్లిక్ చేయండి
- కుడివైపు పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయండి
- ఇప్పుడు General విభాగంలో ‘Digital Wellbeing’ పై క్లిక్ చేయండి
- ఆ తర్వాత ‘Family Pairing’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఇప్పుడు మీకు ‘Who is using this TikTok account?’ (ఈ అకౌంట్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారు..?) అనే సందేశం కనిపిస్తుంది. దాని కింద ‘Parent’, ‘Teen’ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో ‘Parent’ ను ఎంపిక చేసుకొని ‘Continue’ పై క్లిక్ చేయగానే మీ ఫోన్ స్క్రీన్‌పై ఓ QR కోడ్ కనిపిస్తుంది.
- ఇప్పుడు మీరు మీ పిల్లల ఫోన్ తీసుకొని పైన చెప్పిన విధంగా 1 నుంచి 5 స్టెప్స్ వరకు అనుసరించండి. ‘Who is using this TikTok account?’ దగ్గర మాత్రం ‘Teen’ను ఎంపిక చేసుకోండి.
- అలా చేయగానే మీకు ‘Scan Code’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి మీ మొబైల్‌లో వచ్చిన QR కోడ్‌ను పిల్లల ఫోన్‌తో స్కాన్ చేయండి. అప్పుడు ‘మీ అకౌంట్ ఫలానా అకౌంట్‌తో లింక్ అవ్వనుంది’ అని ‘Teen’ అకౌంట్‌కి సందేశం వెళ్తుంది. అక్కడ కనిపించే ‘Link Accounts’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. మీ పిల్లల టిక్‌టాక్ అకౌంట్ మీ అకౌంట్‌తో పెయిర్ అయినట్లే..!
- ఈ కొత్త ఫీచర్ ద్వారా 13 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న టిక్‌టాకర్ల అకౌంట్లను పర్యవేక్షించచ్చు.
పెయిరింగ్ వల్ల లాభాలేంటి..?
- మీ కుటుంబ సభ్యుడు/సభ్యురాలు టిక్‌టాక్ చూసే సమయానికి (వాచ్ టైమ్) పరిమితులు పెట్టొచ్చు.
- మీ కుటుంబ సభ్యుడు/సభ్యురాలు చూసేందుకు తగని కంటెంట్‌ను వాళ్లు చూడకుండా మీరు నియంత్రించొచ్చు.
- మీ కుటుంబ సభ్యుడు/సభ్యురాలికి ఎవరు సందేశాలు పంపాలి..? అనే దానిపై పరిమితులు పెట్టొచ్చు.
ఈ కొత్త ఫీచర్ కేవలం తల్లిదండ్రులు తమ పిల్లల అకౌంట్లను పర్యవేక్షించడం కోసం మాత్రమే కాదు.. భార్య తన భర్త అకౌంట్‌ను; అన్న తన చెల్లి అకౌంట్‌ను; అక్క తన తమ్ముడి అకౌంట్‌ను.. ఇలా అవతలి వ్యక్తి అనుమతితో ఎవరు ఎవరి అకౌంట్‌నైనా పర్యవేక్షించొచ్చు. ఈ క్రమంలో పర్యవేక్షించాలనుకునే వాళ్లు ‘Parent’ అవుతారు.. అవతలి వ్యక్తి ‘Teen’ అవుతారు.