తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

నీ అనురాగానికి వెలలేదు .... నీ ప్రేమకు హద్దులేదు..!

తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు ప్రాణం పోసినందుకు, తన ఒంటి నొప్పులు మరిచి బిడ్డను ఎత్తుకు మోసినందుకు, మొత్తంగా ఇరవై నాలుగ్గంటలూ ఇంటిల్లిపాది సేవలో తనను తాను మరిచిపోతున్నందుకు... అమ్మకి ‘త్యాగశీలి’ అన్న ట్యాగ్‌లైన్‌ తగిలిస్తే సరిపోదు...శుభాకాంక్షలు చెప్పి బహుమతి ఇస్తే ‘మదర్స్‌డే’ (ఈ రోజే) అయిపోదు... మరి..? జీతం భత్యం లేని ఆ కంచి గరుడసేవ భారాన్ని అమ్మ భుజాల మీదినుంచి దించడమే ఆమెకు నిజమైన బహుమతి- అంటున్నాయి కొన్ని దేశాలు. అందుకు వారేం చేస్తున్నారో... ఆ ప్రయత్నాలు సమాజాన్ని ఏ దిశగా నడిపిస్తున్నాయో తెలుసుకోవడం ఆసక్తికరం..!

mothers day
mothers day

By

Published : May 9, 2021, 11:50 AM IST


చదువుకుంటుంది... గొప్ప ఉద్యోగం చేయాలని కలలు కంటుంది.
టీచర్‌... పోలీస్‌... ఇంజినీర్‌... డాక్టర్‌... శాస్త్రవేత్త... కావాలనుకున్న కల ఏదైనా, కష్టపడి సాధిస్తుంది!
తర్వాత... పెళ్లి చేసుకుంటుంది. ఓ ఇంటికి ఇల్లాలవుతుంది. ఆ తర్వాత... అమ్మాయి ‘అమ్మ’ అవుతుంది.
అంతవరకూ బాగానే ఉంది కానీ, ఆ తర్వాతే ఇంకా ఏదో అవుతోందని అనుమానం వచ్చింది అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో పరిశోధకులకి. తమ చేతిలో పని కదా, పూనుకుని ఒక అధ్యయనం చేశారు. పదేళ్ల క్రితం తమ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకుని వెళ్లిన యువతీ యువకులు ఇప్పుడు ఉద్యోగాల్లో ఏ స్థాయికి ఎదిగారో తెలుసుకోవాలనుకున్నారు.

దాదాపుగా అందరూ ఒకే స్థాయి వేతనాలతో ఉద్యోగాల్లో చేరారు కానీ, పదేళ్లయ్యేసరికి చాలామంది మహిళలు సంపాదనలోనూ, హోదాలోనూ పురుషులకన్నా బాగా వెనకబడిపోయారట. 95శాతం పురుషులు కెరీర్‌లో పైపైకి ఎదిగి చేరినప్పటికన్నా కొన్ని రెట్లు ఎక్కువ వేతనం సంపాదిస్తోంటే 40శాతం స్త్రీలలో కొందరు మొత్తానికే ఉద్యోగం మానేస్తే, కొందరేమో చదివిన చదువుతో సంబంధం లేని చిన్న ఉద్యోగాలు చేస్తున్నారట. ఇంకో నలభై శాతం స్త్రీలకు రకరకాల అవరోధాలు ఎదురవడంతో కెరీర్‌లో ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయారట. అదే పురుషుల్లో పదిశాతం మాత్రమే అవరోధాలను ఎదుర్కొన్నారట. మహిళలకు తల్లి బాధ్యతలు అదనం కావడమే ఆ తేడాకు కారణమట. పురుషుడు ఒక్కో మెట్టూ కెరీర్‌లో పైకి ఎదుగుతుంటే, స్త్రీ పిల్లల కోసం సెలవులు పెడుతూ, వారి సంరక్షణ కోసం తన కెరీర్‌తో రాజీపడుతోందని ఆ అధ్యయనం తేల్చి చెప్పింది.

అమెరికాలో జరిగిన ఈ పరిశోధన ఆ దేశంలో ఏ మార్పు తెచ్చిందో తెలీదు కానీ ఇలాంటి పరిశోధనలేవీ చేయకుండానే కొన్ని దేశాలు ‘అమ్మ’ కష్టాల్ని గుర్తించాయి. తల్లులకు మెటర్నిటీ లీవు ఇచ్చినట్లే తండ్రికి పెటర్నిటీ లీవు ఇస్తే వాళ్లు కూడా పిల్లల సంరక్షణలో, ఇంటి పనుల్లో బాధ్యతలు పంచుకుంటారనీ స్త్రీలకి ఉద్యోగం మీద దృష్టిపెట్టేందుకు వీలవుతుందనీ భావించాయి. పలు దేశాలు వేతనంతో కూడిన పితృత్వ సెలవును చట్టబద్ధం చేశాయి. కానీ ఆచరణలో అది పూర్తిగా విఫలమవడం సామాజికవేత్తలను సైతం ఆశ్చర్యపరచింది. పనులు పంచుకోవడం సంగతలా ఉంచితే ఆ సెలవు పెట్టి ఇంట్లో ఉండడాన్ని పురుషులు ‘చిన్నతనం’గా భావిస్తున్నారనీ, ఆఫీసులో మిగిలినవారికన్నా వెనకబడిపోతామని భయపడుతున్నారనీ అధ్యయనాల్లో తెలిసింది.

కొన్ని దేశాలు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. స్త్రీల పని భారం తగ్గించాలంటే పురుషుల దృక్పథాన్ని బలవంతంగానైనా మార్చక తప్పదని భావించాయి. పైగా ఆ విధమైన మార్పు సమాజానికి ఎంతో మేలు చేస్తుందనీ అంచనావేశాయి. ఆ దిశగా చట్టాలను మార్చుకుంటూ వచ్చాయి. ఫలితంగా స్త్రీ పురుష సమానత్వ సూచీలో అవి ఇప్పుడు తొలి స్థానాల్లో సగర్వంగా నిలిచాయి!

స్వీడన్‌లో... డాడీ మంత్స్‌!
అన్ని దేశాల్లోనూ ప్రసూతి సెలవు విధానాలన్నీ అమ్మ చుట్టూనే తిరుగు తుండగా అద్భుతమైన సహాయ వ్యవస్థతో తల్లిదండ్రులిద్దరినీ భాగస్వాములను చేస్తూ స్వీడన్‌- ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అమ్మానాన్నలు ఇంటి దగ్గరుండి పిల్లల్ని పెంచుకోడానికి ప్రభుత్వం 80 శాతం జీతంతో 16 నెలల సెలవు ఇస్తోంది. తల్లికి నాలుగున్నర నెలల మెటర్నిటీ లీవుని ఆమె హక్కుగా పరిగణిస్తారు. తర్వాత తండ్రి తప్పనిసరిగా మూణ్ణెల్ల సెలవు పెట్టాలి. అది కూడా అయిపోయాక మిగిలిన సెలవును ఇద్దరూ వెసులుబాటును బట్టి పంచుకోవచ్చు. అదైనా ఎందుకు ఇచ్చారంటే ఉద్యోగాల్లో కీలకమైన బాధ్యతల్లో ఉన్న వారు నెలల తరబడి సెలవు పెడితే సంస్థలకు ఇబ్బంది కాబట్టి మొత్తంగా వారు సెలవుపెట్టుకోడాన్ని వ్యతిరేకించవచ్చు. అలా జరగకుండా వీలును బట్టి ఇద్దరూ మార్చి పెట్టుకునేందుకే ఈ విధానం. అంతేకాదు, తొలి రెండు నెలల్లోనూ తండ్రి తప్పని సరిగా పది రోజులు సెలవు తీసుకుని భార్యాబిడ్డలతో గడపాలి. నిజానికి చాలా దేశాల్లో మహిళలు మెటర్నిటీ లీవు కోసం పోరాటం జరుపుతున్నప్పుడే- ‘పెయిడ్‌ పేరెంటల్‌ లీవ్‌’ని ప్రపంచానికి పరిచయం చేసిన దేశం స్వీడన్‌. 1974 నుంచి అక్కడ ఈ చట్టం అమల్లో ఉంది. అయితే పేరుకి అది పేరెంటల్‌ లీవ్‌ అయినా సెలవంతా స్త్రీలు మాత్రమే వాడుకోవడం చూశాక 1995 నుంచి పురుషులకు మూడు నెలల సెలవు తప్పనిసరి చేశారు. ‘డాడీ మంత్స్‌’గా పేర్కొనే ఈ సెలవు ఊహించినట్లే మంచి మార్పును తెచ్చింది. చాలామంది ఆ సెలవును ఆర్నెల్లకు పొడిగించి మరీ పిల్లల్ని చూసుకుంటున్నారు. మెటర్నిటీ లీవు అయిపోగానే మహిళలు ఉద్యోగాలకు వెళ్లగలుగుతున్నారు. నెలల పసికందులకు న్యాపీలు మార్చడం, స్నానం చేయించడం, పాలు పట్టి నిద్రపుచ్చడం లాంటి పనులన్నీ పురుషులు స్వయంగా చేస్తున్నారు. తమ సెలవును తండ్రులు నిస్సంకోచంగా వాడుకునేలా ప్రోత్సహించడానికి రకరకాల కార్యక్రమాలు నిర్వహించింది ప్రభుత్వం. అక్కడి రాయబార కార్యాలయమూ ఆ దేశానికే చెందిన ప్రఖ్యాత సంస్థ ‘ఐకియా’ కలిసి ‘స్వీడిష్‌ డాడ్స్‌’ పేరుతో నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రపంచదేశాలను సైతం ఆకట్టుకుంది. ఇంట్లో పిల్లల పనులన్నీ చేస్తున్న తండ్రుల ఫొటోలను ఇందులో ప్రదర్శించారు. ఈ మార్పుల కారణంగా సమానత్వ సూచీలో స్వీడన్‌ కొన్నేళ్లుగా మొదటి ఐదుస్థానాల్లో నిలుస్తోంది.

ఐస్‌లాండ్‌... ఫ్యామిలీ లీవ్‌!
కుటుంబాలకు మేలుచేసే విధానాలు ఎలా ఉండాలో, అమలవుతున్న విధానాల పనితీరును ఎప్పటికప్పుడు ఎలా బేరీజు వేయాలో ఐస్‌లాండ్‌ని చూసి నేర్చుకోవచ్చు. మెటర్నిటీ లీవు తక్కువగా ఉంటే స్త్రీలకు ఇబ్బంది కాబట్టి మొత్తంగా ఉద్యోగం మానేయొచ్చు. అలాగని వేతనం తగ్గించి ఎక్కువ రోజులిస్తే అసంతృప్తికి దారితీయవచ్చు. అందుకని ఏ విధంగానూ ఆమెకు ఇబ్బంది కలగకుండా ‘ఫ్యామిలీ లీవ్‌’ విధానాన్ని రూపొందించారు అక్కడి ప్రణాళికాకర్తలు. పితృత్వ సెలవును తండ్రులు వాడుకునేలా చూడడం ఎలాగా అని యూరోపియన్‌ దేశాలు ప్రయోగాలు చేస్తున్నపుడే- 2000లోనే ఐస్‌లాండ్‌ మొత్తం సెలవుని అమ్మానాన్నలకు చెరిసగం ఇవ్వాలని నిర్ణయించింది. మూడు నెలలు చొప్పున ఇద్దరూ పెట్టుకున్నాక మరో మూణ్ణెల్లు ఎవరైనా పెట్టుకునే వీలు కల్పిస్తూ చట్టం చేసింది. అది అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. 90శాతం తండ్రులు సెలవు తీసుకున్నారు, భేషుగ్గా పిల్లల్ని చూసుకున్నారు. ఐదారేళ్ల పాటు చట్టం ప్రభావాన్ని పరిశీలించిన నిపుణులు ఈ తరహా సెలవు కుటుంబసంక్షేమానికి చాలా అవసరమని తేల్చారు. దాంతో ప్రభుత్వం సెలవును ఏడాదికి పెంచి చెరి ఐదు నెలలూ పెట్టుకున్నాక, రెండు నెలలు ఇష్ట ప్రకారం పంచుకునే వీలు కల్పించింది. అలా ఏడాది నిండాక నర్సరీలో చేర్పించి ఎవరి ఉద్యోగానికి వారు వెళ్లవచ్చు.

అయితే ఇదంతా చెప్పినంత తేలిగ్గానో చట్టం చేసి పడేసినంత సులభంగానో అయిపోలేదు. ప్రపంచమంతటా ఉన్నట్లే అక్కడా పురుషాధిక్యత ఉండేది. మహిళలు ముందు పిల్లల్ని చూసుకోవాలనీ ఆ తర్వాతే ఉద్యోగమనీ అక్కడి పెద్దలూ భావించే వారు. కొత్తలో ఇంట్లో భర్త మీద పిల్లల్ని వదిలి ఆఫీసుకు వెళ్తున్న మహిళలను తప్పుపట్టేవారు. ఇక్కడే మరో ప్రభుత్వ విధానం మహిళలకు ఉపయోగపడింది. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ, నర్సుల వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉంటుంది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచీ వారు పర్యవేక్షిస్తుంటారు. కాన్పులు కూడా చాలావరకూ ఇంటి దగ్గరే చేస్తారు. ప్రాణం మీదికి వస్తుందనుకుంటే తప్ప ఆస్పత్రికీ సిజేరియన్‌ జోలికీ వెళ్లరు. బిడ్డకి మొదటి ఏడాది నిండేవరకూ నర్సులు క్రమం తప్పకుండా ఇంటికి వచ్చి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంటారు. ఈ పర్యవేక్షణా, తల్లీబిడ్డల సంరక్షణలో ప్రభుత్వ జోక్యమూ- వెరసి పేరెంటల్‌ లీవ్‌ అమలును తేలిక చేశాయి. సెలవు తీసుకుని ఇంట్లో ఉండి పనులు చేయకపోతే ప్రభుత్వానికి తెలిసిపోతుందన్న భయం మొదట్లో పురుషుల చేత బలవంతంగానైనా పనిచేయించింది. ఆ తర్వాత అందులోని ఆనందాన్ని వారు ఆస్వాదించడం మొదలెట్టారు. క్రమంగా అందరి దృక్పథాల్లోనూ మార్పు వచ్చింది.
అందుకే ఆ దేశంలో నూటికి 88 మంది మహిళలు ఏదో ఒక ఉద్యోగం చేస్తుంటారు.

ఈ ఇరవయ్యేళ్లలో అమ్మానాన్నా అన్ని పనుల్నీ కలిసి చేసుకోవడాన్ని చూస్తూ పెరిగిన తరానికి స్త్రీ పురుష సమానత్వం గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. కేవలం ఈ సెలవు విధానం వల్ల అన్నిరంగాల్లోనూ మహిళలు బాగా పైకి రాగలిగారు. దాంతో ఐస్‌లాండ్‌ ఏకంగా పన్నెండేళ్లుగా సమానత్వ సూచీలో మొదటి స్థానంలో నిలుస్తోంది.

ఫిన్లాండ్‌... కొత్త ప్యాకేజీ
మహిళ గర్భం దాల్చినప్పటినుంచి పిల్లలు పెరిగి బడికెళ్లేవరకు- ఫిన్లాండ్‌ ప్రభుత్వం ఒక ప్యాకేజీలా అమలుచేస్తుంది. ఈ ఏడాది కొత్తగా తెచ్చిన చట్టం ప్రకారం అక్కడ తల్లిదండ్రులిద్దరికీ కలిపి పద్నాలుగు నెలల సెలవు లభిస్తుంది. వేతనంతో కూడిన లీవ్‌ ప్యాకేజీలో భాగంగా చెరి ఏడు నెలలు తల్లీ తండ్రీ బిడ్డతో గడపాలి. మొన్నటివరకూ 4 నెలల మెటర్నిటీ, రెణ్ణెల్ల పెటర్నిటీ, మరో ఆర్నెల్ల ఆప్షనల్‌ లీవు... ఉండేవి. ఎవరైనా తీసుకోవచ్చన్న అవకాశాన్ని ఎప్పుడూ మహిళలే వాడుకోవడం గమనించిన ప్రభుత్వం కొత్త విధానాన్ని తెచ్చింది. మరొకడుగు ముందుకేసి పిల్లల సంరక్షణ కుటుంబానికి ఆర్థిక భారం కాకూడదని మహిళ గర్భం దాల్చినప్పటినుంచి కాన్పు వరకూ ఆస్పత్రి ఖర్చుని భరిస్తోంది. పిల్లల సంరక్షణకు అవసరమైన వస్తువులన్నిటినీ ఇస్తోంది. పరుపూ బొమ్మలతో మొదలెట్టి కథల పుస్తకాల వరకూ అన్నీ ఇస్తారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగానికి వెళ్లాక పిల్లల్ని ఉంచే డేకేర్‌ సెంటర్లనూ ప్రభుత్వమే ఉచితంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే అత్యుత్తమమైన విద్యావిధానంతో ఆదర్శంగా ఉన్న ఫిన్లాండ్‌ తాజాగా పేరెంటల్‌ లీవ్‌ ప్యాకేజీతో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగానూ పేరు సంపాదించుకుంది. సమానత్వ సూచీలోనూ రెండో స్థానంలో నిలిచింది.

ఇంకా ఉన్నాయి..!
ఇవే కాదు, స్త్రీ పురుష సమానత్వానికి సంబంధించిన జాబితాలో చెప్పుకోదగ్గ స్థానాల్లో ఉన్న దేశాలన్నీ కూడా ఈ రంగంలో విప్లవాత్మకమార్పులు తేబట్టే ఆ ఘనత సాధించాయి. అవి ఈ సెలవును సమాజ సంక్షేమానికి పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాయి.
*ఆర్నెల్లపాటు ఉండే మెటర్నిటీ, పెటర్నిటీ లీవులు కాకుండా ఆ తర్వాత ఇద్దరూ పంచుకుంటూ పిల్లల్ని పెంచు కునేలా మరో మూడేళ్లకు పైగా సెలవిస్తున్న లిథువేనియా జాబితాలో 33వ స్థానం నుంచి 8వ స్థానానికి చేరుకుంది.
*హంగరీలో 70శాతం జీతంతో రెండేళ్లు ఇచ్చే సెలవును తల్లిదండ్రులిద్దరూ మార్చి మార్చి పెట్టుకోవచ్చు.
*ఎస్తోనియాలో 5 నెలల మెటర్నిటీ లీవు, రెండు వారాల పెటర్నిటీ లీవు కాకుండా మరో 14 నెలల సెలవుని తల్లిదండ్రులిద్దరూ మార్చి తీసుకోవచ్చు.
*నార్వేలో తల్లిదండ్రుల సెలవు రకరకాల వెసులుబాట్లతో ఉంటుంది. పూర్తి జీతంతో దాదాపు ఏడాది కానీ, 80శాతం జీతంతో 15 నెలలు కానీ మెటర్నిటీ లీవు తీసుకోవచ్చు. ఆ తర్వాత తండ్రి రెండున్నర నెలలు సెలవు తీసుకోవచ్చు. ఇవి కాకుండా తల్లిదండ్రులిద్దరికీ అదనంగా పూర్తి వేతనంతో మరో 46 వారాల సెలవు దొరుకుతుంది.
*జర్మనీలో మెటర్నిటీ లీవు మూడున్నర నెలలే కానీ పేరెంటల్‌ లీవ్‌ మూడు సంవత్సరాలు. చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని ఇచ్చే ఈ సెలవును ఇద్దరూ సమంగా వాడుకోవడాన్ని ప్రోత్సహిస్తూ బోనస్‌గా మరింత సెలవు ఇస్తారు.

వ్యక్తిగతం... కాదు
సమాజమూ ప్రభుత్వాలూ భావిస్తున్నట్లు మెటర్నిటీ లీవన్నది స్త్రీ వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, కుటుంబ సంక్షేమమూ తద్వారా సమాజ సంక్షేమమూ దీనితో ముడిపడి ఉన్నాయని నిరూపిస్తున్నాయి ఈ దేశాలు. ప్రస్తుతమున్న సామాజిక పరిస్థితుల్లో స్త్రీ పురుష సమానత్వ సాధనకు మరో నూట యాభై ఏళ్లయినా పట్టొచ్చని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేస్తే అలాంటి సమానత్వాన్ని దాదాపుగా సాధించిన దేశాలు ఈ విధానమే అందుకు ఉపయోగపడిందంటున్నాయి.
*పిల్లల ఎదుగుదలలో కీలకమైన తొలి ఏడాదిలో తండ్రి అవసరం చాలా ఉంటుంది. అది తండ్రీ బిడ్డల మధ్య గాఢమైన అనుబంధానికి దోహదం చేస్తుంది. అమ్మా నాన్నా అన్ని పనులూ చేయడాన్ని చూస్తూ పెరిగిన పిల్లలకు వివక్ష తెలియదు.
*మహిళకు పనిభారం తగ్గుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. బిడ్డ దగ్గర భర్త ఉంటాడన్న ధీమాతో కెరీర్‌ మీద దృష్టి పెట్టగలుగుతుంది. పిల్లల సంరక్షణలో పాలుపంచుకున్న తండ్రులు సహజంగానే ఇంట్లో ఇతర బాధ్యతల్నీ పంచుకుంటారు.
*కార్యాలయాల్లో స్త్రీలు తరచూ సెలవులు పెడతారన్న అపోహ పోతుంది. కెరీర్‌పరంగా ఎవరికీ నష్టం వాటిల్లదు. వేతనాల్లో వ్యత్యాసం తగ్గుతుంది.
*అనుబంధాలపరంగానూ ఆర్థికంగానూ మొత్తంగా కుటుంబం సంతోషంగా ఉంటుంది.
కాబట్టే- ఈ విధానం సమానత్వానికి పునాది వేసిందని ముక్తకంఠంతో సెలవిస్తున్నాయి ఆ దేశాలన్నీ.

* * * * *

మన దేశ కార్మిక చట్టాల్లో మాతృత్వ సెలవే తప్ప పితృత్వ సెలవు లేదు. పేరెంటల్‌ లీవ్‌ ప్రస్తావనా లేదు.
క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు లాంటి వాళ్లు ఆ మధ్య పితృత్వ సెలవు తీసుకుని దాని గురించి అందరూ చర్చించేలా చేశారు. ఆ చర్చ విధానకర్తల దాకా వెళ్లడం- మహిళలకే కాదు, సమానత్వ సూచీలో చివరాఖరున ఉన్న మన దేశానికీ చాలా అవసరం.
ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అయినా ఆ దిశగా ఆలోచన మొదలైతే... అమ్మకు సాయంగా అడుగు ముందుకు పడితే... అంతకన్నా ఏం కావాలి..!

‘అమ్మ’కీ సెలవు లేని దేశాలివి!

అసలు ప్రసూతి సెలవు అనే విధానమే లేని దేశాలూ ఉన్నాయి ప్రపంచంలో. వాటన్నిటిలోనూ మొదటిది అమెరికా. అక్కడ ప్రభుత్వ విధానాల్లో ఈ విషయం ప్రస్తావనే ఉండదు. ప్రైవేటు సంస్థలన్నీ తమ అవసరాలను బట్టి ఈ సెలవును ఇస్తుంటాయి. యూఎస్‌ ఫ్యామిలీ అండ్‌ మెడికల్‌ లీవ్‌ చట్టం కింద ఉద్యోగ భద్రతతో కూడిన 12 వారాల సెలవు ఇస్తారు కానీ దానికి జీతం ఉండదు. వృద్ధుల, పిల్లల సంరక్షణ అవసరానికి దీన్ని స్త్రీ పురుషులు ఎవరైనా వాడుకోవచ్చు. అయినా ఆ చట్టం అన్ని ఉద్యోగాలకీ వర్తించదు. కొన్ని రాష్ట్రాలు సొంతంగా ఫ్యామిలీ లీవ్‌ పాలసీలను తయారుచేసుకుని అమలుచేస్తున్నాయి. అమెరికాతో పాటు సూరినామ్‌, స్వాజిలాండ్‌, పపువా న్యూగినియా, పసిఫిక్‌ సముద్రంలోని కొన్ని ద్వీపాలు... ఈ జాబితాలో ఉన్నాయి.

ఇదీ చూడండి:మథర్స్​ డే: కొవిడ్‌ నుంచి కుటుంబాన్ని కాపాడుకున్న తల్లులు

ABOUT THE AUTHOR

...view details