తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

బయటికి చెప్పరు.. కానీ దీని గురించే గొడవ పడతారట ! - బెస్ట్ కపూల్​ ఎలా ఉండాలంటే

ఈ రోజుల్లో పెళ్త్లె ఎన్నో ఏళ్లు గడిచిన చాలామంది దంపతులు ఉన్నట్టుండి విడిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇక పెళ్లి కాని ప్రేమికుల సంగతి చెప్పక్కర్లేదు ! చాలామంది ప్రేమికులకి బ్రేకప్ అనేది సాధారణమైపోయింది. అయితే వీరంతా విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా ? ఆ.. ఏముంది ! పెళ్త్లెన దంపతులైతే భర్త వేధింపులో, అత్తమామల సాధింపులో అయ్యుంటాయి ! ప్రేమికులైతే అభిప్రాయభేదాలు వచ్చుంటాయిలే.. అనుకుంటున్నారా ? మీ ఆలోచన కొంతవరకు కరక్టే అయినా వీటన్నిటికీ మించి ఓ బలమైన కారణమే ఉందట.. అదేంటో మీరే చదవండి !

couples
బయటికి చెప్పరు.. కానీ దీని గురించే గొడవ పడతారట !

By

Published : Sep 18, 2020, 7:39 PM IST

హైదరాబాద్‌కి చెందిన పూజకి 29 ఏళ్లు. బహుళజాతి సంస్థలో అరవై వేల జీతం అందుకుంటోంది. గత నాలుగేళ్లుగా విజయ్‌తో సహజీవనం సాగిస్తోంది. విజయ్‌ది చిన్న ఉద్యోగం. డబ్బు విషయంలో మొదట్లో ఇద్దరూ పెద్ద ఇబ్బంది పడలేదు. అయితే విజయ్‌తో భవిష్యత్తు గురించి ఆలోచించిన పూజ ఇకపై ఇంటి ఖర్చుల భారం విజయ్‌దే అని తేల్చిందట. కొంతకాలం అలానే భరించిన విజయ్ తర్వాత పూజనే అప్పడగడం మొదలెట్టాడట. ఇక అప్పు గురించి అడిగినప్పుడల్లా విజయ్ రేపు మాపు అనడం చూసి ఓ రోజు విజయ్‌ని నిలదీయగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందట. అప్పటి వరకు తమది ‘అన్‌కండిషనల్ లవ్’ అని భావించిన వారిని డబ్బే అడ్డుగా మారి విడదీసింది.

ఉద్యోగం మానేసిందని...

ప్రతిమకి పాతికేళ్లప్పుడే పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు ప్రతిమ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేది. పెళ్లిచూపుల్లో అనంత్‌తో కలిసి మాట్లాడినప్పుడు భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగం కంటిన్యూ చేయాలనుకుంది. అయితే ఇటీవల వారికి ఓ బాబు పుట్టడంతో అతడి ఆలనాపాలనా చూసుకుంటానని చెప్పి ప్రతిమ పూర్తిగా ఉద్యోగం మానేసింది. దీంతో అనంత్ ప్రతిమతో మునుపటిలా ఉండడం మానేశాడని తెలిపింది. అంతేకాదు ఇంటికి సంబంధించి సేవింగ్స్ విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు తన మీద కసురుకుంటున్నాడని చెబుతోంది. మొదట్లో తమ దాంపత్య జీవితం బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం డబ్బు తమ మధ్య అగాధం సృష్టిస్తోందని ప్రతిమ తెలుపుతోంది. అందుకే మళ్లీ ఉద్యోగానికి వెళ్తానంటోంది ప్రతిమ.

అందరికీ అదే అతి పెద్ద సమస్య !

పూజ, ప్రతిమలే కాదు.. దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య చిన్న స్పర్థని కూడా పెద్ద అగాధంలా మార్చేది డబ్బే! అవును... చాలామంది భావించినట్లు చాలా సమస్యలకి డబ్బే పరిష్కారం కావచ్చు కానీ దాంపత్య బంధానికి మాత్రం మొదటి శత్రువు డబ్బేనట. ఈ అంశం పైన నిర్వహించిన సర్వేలనేకం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. విడాకులకు దారి తీసే కారణాల్లో డబ్బు కూడా ప్రధానమైనదట. అంతేకాదు.. చాలామంది తమ జీవిత భాగస్వాములతో తమ బరువెంతో చెబుతారట కానీ తమ బ్యాంక్ అకౌంట్లో జమ చేసిన డబ్బు ఎంతుందో చెప్పరట. చాలామంది దంపతులు తమ మధ్య డబ్బు ప్రస్తావన రాగానే జీవిత భాగస్వామిపై చిరాకు పడతారట. డబ్బు విషయంలో జీవిత భాగస్వామి ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు కచ్చితంగా అభద్రతాభావంతోనే ఉంటారన్నది నిపుణుల అభిప్రాయం.

కూర్చుని మాట్లాడుకోండి !

ఆర్థిక రంగ నిపుణులైనా, మానసిక నిపుణులైనా సమస్యకి పరిష్కారం చూపడానికి ఇచ్చే సలహా ఒక్కటే ! అదే కూర్చుని మాట్లాడుకోవడం. ఉదాహరణకి ఒక వ్యక్తి తన భార్యకి ఆర్థిక విషయాల పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడంతో వ్యాపారంలో వచ్చే నష్టాల గురించి ఆమెతో చర్చించేవాడు కాదట. చిన్న నష్టాలే కదా రేపో మాపో కవర్ చేయొచ్చులే అనుకున్నాడట. తర్వాత చిన్న చిన్న నష్టాలన్నీ కలిసి వ్యాపారం దివాళా తీసే స్థాయికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య షాక్‌లో ఉండిపోయిందట. మొదట్నుంచీ ఓ ప్రణాళికంటూ లేకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైంది వారి ఆర్థిక పరిస్థితి. తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుని, ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటే కానీ వారి ఆర్థిక పరిస్థితి మెరుగవ్వలేదు.

డబ్బు గురించి దంపతుల మధ్య ఏదైనా సమస్య వస్తే.. దానిని ఇద్దరూ కలిసి ఏవిధంగా అధిగమించవచ్చో ప్రణాళికలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటికయ్యే ఖర్చు ఎక్కడ పెరుగుతోంది, ఎక్కడ తగ్గించాలి ? వచ్చే రాబడిని దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాల కోసం ఎలా పొదుపు చేయాలి ? అనే విషయాలు తెలియాలంటే.. ఇద్దరూ కూర్చుని సానుకూలంగా మాట్లాడుకుంటే తప్ప ఏ సమస్యైనా పరిష్కారం కాదని నిపుణులు అంటున్నారు. అందుకు ఇలా చేయమని సలహా ఇస్తున్నారు.

ఇలా చేయండి..

  • ముందు ఆర్థికంగా మీ గోల్స్ ఏంటో రాసిపెట్టుకోండి. తర్వాత వాటి గురించి మీ జీవిత భాగస్వామితో (లేదా కాబోయే వారితో) మాట్లాడండి.
  • ఆ సమయంలో ఇద్దరికీ ఉన్న అప్పులు, ఆస్తుల గురించి ఎలాంటి సంకోచాలూ లేకుండా మాట్లాడుకోండి. అలాగే బ్యాంక్ ఖాతాలోని డబ్బు గురించి తెలపండి. అవసరమైతే ఇద్దరి పేరున జాయింట్ అకౌంట్ తెరవండి. దాని ద్వారానే ఎటువంటి లావాదేవీలైనా చేయండి.
  • అత్యవసరం కోసం 'ఎమర్జన్సీ ఫండ్' కింద కొంత డబ్బుని ఎప్పుడూ పక్కన పెట్టి ఉంచాలి. ప్రాణాపాయం జరిగినప్పుడో, వ్యాపారం దివాళా తీసినప్పుడో అత్యవసర పరిస్థితుల్లో దానిని వినియోగించాలి.
  • నెల నెలా ఆదాయ వ్యయాలతో ఒక బడ్జెట్ తయారు చేయండి. దాని ప్రకారం వారంలో ఒక సమయం పెట్టుకుని బేరీజు వేసుకోండి. ఈ సమయంలో అప్పుల గురించి దాచకండి. అలాగే పొదుపు, పెట్టుబడుల గురించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి.
  • అన్నిటికన్నా ముఖ్యమైంది... సంయమనంతో ఉండడం! ఆర్థిక ప్రణాళికలో అప్పుడప్పుడూ అనుకున్నదానికి కొంత అటు, ఇటు అవ్వడం సహజం. మీరు కంగారు పడి, మీ భాగస్వామిని కంగారు పెట్టకుండా సామరస్యంగా పరిష్కారం కోసం ఆలోచించండి.

కలిసి 'డ్రైవ్' చేయండి !

సొంత కారులో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరూ కలిసి డ్రైవింగ్‌ని పంచుకుంటే ఎంత సులువుగా ఉంటుంది చెప్పండి! ఆర్థిక ప్రయాణం కూడా అలాంటిదే అంటున్నారు నిపుణులు. దంపతులిద్దరూ ఒక ప్రణాళిక వేసుకుని ఒక సంవత్సరం తర్వాత ఏం చేయాలి.. అయిదు సంవత్సరాల తర్వాత తమ ఆర్థిక స్థితి ఎలా ఉండాలి వంటి వాటి గురించి చర్చించుకుంటే ఇద్దరికీ ఇంటి ఆర్థిక స్థితిపై అవగాహన ఉంటుంది. అంతేకాదు దీనివల్ల ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు కాబట్టి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుందంటున్నారు నిపుణులు.

ప్రత్యేకించి కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి బయట పడాలంటే దంపతుల మధ్య ఆర్ధిక విషయాల్లో ఈ మాత్రం అవగాహన, ముందస్తు ప్రణాళికలు ఎంతో అవసరం. ఏమంటారు?

దాంపత్య బంధాన్ని సుదృఢం చేసుకునేందుకు దంపతులిద్దరూ అలవరచుకోవాల్సిన కొన్ని అలవాట్లేంటో తెలుసుకున్నారు కదా! మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీరూ వీటిని ఫాలో అయిపోయి.. మీ ఆలుమగల అనుబంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదించేయండి..

ABOUT THE AUTHOR

...view details