భార్యంటే బానిస కాదు. భర్తంటే భరించేవాడనీ కాదు. పెనిమిటిని సుతారంగా పెనవేసుకున్న తీగ ఆమె. ఆలి ఆలింగనంతో తరిస్తున్న తరువు ఆయన. ఆ తీగ పందిరి ఎక్కకున్నా.. ఈ తరువు బరువుగా భావించి కుంగిపోయినా దాంపత్యం భారమవుతుంది. ఒకరికొకరు అవకాశం కల్పిస్తూ అల్లుకుపోవడమే దాంపత్య రహస్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే సంసార సూత్రం.
ఈగోల గోల ఎందుకు?
చిలిపి చిరాకులు, వలపులో పరాకులు ఎరుగని మంద భాగ్యులు సంసారాన్ని చదరంగంతో పోల్చారు. కష్టనష్టాలు దాటలేని అసమర్థులు సంసారం సాగరమని తీర్మానించారు. మూడు ముళ్లు వేస్తున్నప్పుడు కలిగే ఆనందాన్ని కడదాకా కొడిగట్టకుండా చూసుకోగలిగితే.. దాంపత్యం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఉంటుంది. ఏడడుగులు వేసినప్పుడు ఉన్న స్ఫూర్తితోనే జీవన యానం చేస్తే.. సంసారం నల్లేరు మీద బండి నడకలా సాగిపోతుంది. తలంబ్రాలప్పుడు ఒకరిపై ఒకరు పైచేయి సాధించినా సరదాగా స్వీకరించిన అప్పటి వైఖరిలో మార్పు రాకుంటే.. ఈగోల గోల పొడచూపదు. అది గొడవల దాకా రాదు. పైచేయి గురించి ఎందుకు పేచీ? గిల్లికజ్జాలను గోడలు వినేదాకా తెచ్చుకొని, గల్లీలోకి ఈడ్చుకొని.. కోర్టు దాకా లాక్కున్నాక గానీ తెలియదు.. సాధించేది ఏమీ ఉండదని !
అమ్మ మహిమ అది !
అలగటాలు, ఆటపట్టించడాలు ప్రతి సంసారంలో ఉండేవే. ఉమామహేశ్వరుల మధ్య గిల్లికజ్జాలకేం కొదవలేదు. యుగయుగాల సంసారం కదా! ఓసారి ప్రమథ గణాలు స్తుతులతో శివుడ్ని ఆకాశానికి ఎత్తేశారట. తన పక్కనే ఉన్న పార్వతి వంక ఒకింత గర్వంగా చూశాడట పరమేశ్వరుడు. పార్వతి చిరునవ్వుతో ఓ ఐదు రంధ్రాలున్న పూల బంతి భర్తకు ఇచ్చిందట. ఆ రంధ్రాల్లోకి చూసిన శివుడికి.. బంతిలో ఐదు బ్రహ్మాండాలు, ఐదు కైలాసాలు, అక్కడ ఐదుగురు రుద్రులూ కనిపించారట. అంతే! అమ్మగారి మహిమెంతో తెలిసొచ్చింది. అయ్యగారి గర్వం సర్వం నిర్వీర్యమైపోయింది. శక్తి లేనిది పురుషుడు ఎలా ఉండగలడు? భార్య తోడు లేనిది భర్తకు విలువ ఏముంటుంది? ఆలుమగల్లో ఒకరు ఎక్కువా కాదు.. ఒకరు తక్కువా కాదు.. అనడానికి ఆదిదంపతులు చూపిన లీల ఇది. ఈ సారాంశాన్ని గ్రహిస్తే.. అవతలి వాళ్లు బెట్టు చేసినప్పుడు ఇవతలి వాళ్లు పట్టువిడుపులు ప్రదర్శించాలి. ఇవతలి వాళ్లు గర్వానికి పోతే.. అవతలి వాళ్లు యుక్తిగా నెగ్గాలి.