చిన్నారులకి ఏడు నెలల నుంచే ఘన పదార్థాలను చాలా మెత్తగా చేసి పెట్టొచ్చు. రకరకాల ఆహార పదార్థాలను పరిచయం చేయడానికి ఇదే సరైన సమయం. ఆహారాన్ని మెత్తగా, బరకగా, గుజ్జుగా చేసి పెట్టొచ్చు. విభిన్నమైన రంగుల్లో, పలు రుచుల్లో పరిచయం చేయొచ్చు. ఏడు నెలల నుంచి సంవత్సరం నిండేలోపు దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాలను రుచి చూపించాలి. చిన్నప్పట్నుంచే వీటిని మొదలుపెడితే చిన్నారికి అన్నీ అలవాటు అవుతాయి.
మూడేళ్ల మీ చిన్నారిని మీతోపాటు భోజనాల బల్లపై కూర్చోపెట్టండి. తనే కొద్దికొద్దిగా తినేలా నేర్పించండి. ముందు తినకుండా ఇబ్బంది పెట్టినా మెల్లగా అలవాటు అవుతుంది. అయితే వాళ్ల పొట్ట చాలా చిన్నది. కాబట్టి తక్కువ మొత్తంలో పెట్టాలి. ఇంట్లో స్వీట్స్, బిస్కట్స్, చాక్లెట్స్ అస్సలు పెట్టొద్దు. అన్ని రకాల ఆహార పదార్థాలతో కూడిన ప్రణాళిను రూపొందించుకోండి. మెత్తగా ఉడికించిన కూరగాయల ముక్కలు, ఆకుకూరల పేస్ట్, పండ్ల గుజ్జు, మెత్తగా చేసిన ఉప్మా, ఇడ్లీ, కిచిడీ, పొంగలి... చాలా మెత్తగా ఉడకబెట్టిన కీమా, చికెన్.. ఇవన్నీ కొద్దికొద్దిగా ఏడాది వయసు నుంచే అలవాటు చేయాలి.