స్కాట్లాండ్‌లో పుట్టిన జేన్ ఫ్రేజర్ 20 ఏళ్లకే కేంబ్రిడ్జి నుంచి ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత లండన్‌లోనే గోల్డ్‌మెన్ శాక్స్, మెకన్సీ అండ్ కంపెనీలో ఉద్యోగం చేశారు. నాలుగేళ్లపాటు పనిచేశాక లండన్ జీవితం బోర్‌కొట్టి మాడ్రిడ్‌కు వెళ్లారామె. స్పెయిన్‌లో ఆమె జీవితం ఎంతో సరదాగా సాగిపోయేది. అక్కడ పనిచేసిన రెండేళ్లలో స్పానిష్ కూడా నేర్చుకున్నారు. తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన అమెరికా వెళ్లాలనుకున్నారు. నేరుగా ఉద్యోగిగా వెళ్లకుండా ముందు హార్వర్డ్‌లో ఎంబీఏ చేశారు. తర్వాత మెకన్సీ లండన్ శాఖలో అవకాశం రావడంతో ట్రస్ట్‌డ్ అడ్వైజర్‌గా చేరారు.
అప్పటికే బ్యాంకింగ్ రంగంలో స్థిరపడ్డ కొందరు స్త్రీ, పురుషుల్ని చూశారు జేన్. వాళ్లు కెరీర్‌లో అద్భుతంగా రాణించేవారు. కానీ నలభైలకి దగ్గరవుతున్నా కుటుంబ జీవితం మొదలుపెట్టేవారు కాదు. కానీ జేన్ మాత్రం పర్సనల్, ప్రొఫెషనల్... రెండు జీవితాలూ బాగుండాలనుకున్నారు. అప్పుడే సీనియర్ ఒకరు ‘కచ్చితంగా రెండు చోట్లా విజయం సాధించొచ్చు. కానీ రెండూ ఒకేసారి మాత్రం సాధ్యం కాదు’ అని చెప్పారట. ఆ సలహాని పాటించిన జేన్... ఏడాది తిరిగేసరికి పార్ట్‌టైమ్ జాబ్‌కి మారారు. ‘ఆ సమయంలోనే ఆల్బెర్టో పెయెడ్రాను పెళ్లి చేసుకున్నా. ఆయన కూడా బ్యాంకర్. మేం ముందు పిల్లల్ని కనాలనుకున్నాం. అమ్మ పాత్రకి పూర్తి న్యాయం చేయాలనుకుని కొన్నాళ్లు పార్ట్‌టైమ్ జాబ్‌కీ దూరంగా ఉన్నా’ అని చెబుతారు జేన్. తరువాత రెండేళ్లకి రెండో అబ్బాయి పుట్టాడు. అదే టైమ్‌లో ఆల్బెర్టో... ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా’ ఐరోపా విభాగం బాధ్యతలు చూసుకునేవారు. రెండో అబ్బాయికి ఏడాది వచ్చాక పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని మళ్లీ కొనసాగించారు. ‘పిల్లలు స్కూల్‌కి వెళ్లడం మొదలయ్యాక ఫుల్‌టైమ్ వర్క్‌లోకి దిగా. ఈసారి ‘సిటీ’ బ్యాంకులో చేరా. గ్లోబల్ ఆర్గనైజేషన్స్‌లో పనిచేస్తే.. అవకాశాలతోపాటు, బృందంలో భిన్నత్వమూ ఉంటుంది’ అంటారు జేన్.
విక్రమ్ సారథ్యంలో...
లండన్‌లో ఉంటూ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు విభాగంలోని ‘గ్లోబల్ మేనేజ్‌మెంట్ టీమ్’తో పనిచేసేవారు జేన్. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో అప్పటి సీఈఓ విక్రమ్ పండిట్ నుంచి ఫోన్... ‘మీకు గోల్డ్‌మేన్, మెకన్సీలో అనుభవం ఉంది. మీరు తక్షణమే ‘గ్లోబల్ హెడ్ ఆఫ్ స్ట్రాటజీ’గా బాధ్యతలు తీసుకోండి’ అని చెప్పారాయన. జేన్ ‘ఓకే’ చెప్పారు కానీ, తాను చేయగలనా అన్న చిన్న సందేహం. ఓ స్నేహితురాలికి విషయం చెబితే ‘సీఈఓనే పిలిచారంటే నువ్వు చెయ్యగలవన్న నమ్మకంతోనే కదా’ అని బదులివ్వడంతో వెంటనే అమెరికా ప్రయాణమయ్యారు. ఆ సమయంలో అనుబంధంగా ఉన్న అనేక అప్రధాన విభాగాల్ని తగ్గించుకోవడమే మేలని తేల్చారు. దాంతో రూ. లక్ష కోట్ల డాలర్ల విలువైన విభాగాల్ని అమ్మి నష్టాన్ని తగ్గించుకుంది సిటీ. దాదాపు లక్షమంది ఉద్యోగుల్నీ వదులుకున్నారు. ఆ సమయంలో జేన్ అమెరికాలో ఉంటే, ఆమె కుటుంబం లండన్‌లో ఉండేది. అప్పటికి ఆల్బెర్టో ఒక బ్యాంక్‌కి సీఈఓగా ఉన్నారు. ఒకరు కెరీర్ త్యాగం చేయాలనుకున్నారు. వయసులో పెద్దయిన ఆల్బెర్టో విశ్రాంతి తీసుకుంటానన్నారు. ఆ వెంటనే ‘ఏదైనా కొత్త బాధ్యత ఇవ్వండి’ అని విక్రమ్‌ని అడగ్గా జేన్‌ను ‘ప్రైవేట్ బ్యాంక్ గ్లోబల్ హెడ్’గా నియమించారు. ఆ హోదాలో ఎందరో సెలెబ్రిటీల్ని కలుస్తూ వారి నుంచి చాలా నేర్చుకున్నానంటారు. తరువాత నష్టాల్లో ఉన్న మార్ట్‌గేజ్ బిజినెస్‌కి మార్చగా ఆ ఛాలెంజ్‌నీ స్వీకరించారు. అక్కడ హోమ్‌లోన్ సమస్యని పరిష్కరించి మళ్లీ లాభాల బాట పట్టించారు. అదే ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్.