భార్యాభర్తలిద్దరిదీ ఒకే రకమైన మనన్తత్వం ఉండకపోవచ్చు. కొందరు ఎక్కువ ఖర్చు పెడతారు. మరికొందరు ప్రతి రూపాయీ లెక్కేసుకుని మరీ పొదుపు చేస్తారు. తీరు వేరైనా మీ అభిప్రాయాల్ని, ఇంటి అవసరాల్ని ఎదుటివారితో స్పష్టంగా పంచుకోగలిగినప్పుడు అవతలివారూ అర్థం చేసుకుంటారు. ఖర్చులతోపాటు పొదుపునకు ఇంటి బడ్జెట్‌లో స్థానం ఇస్తేనే ఆర్థిక ఇబ్బందుల ధాటికి తట్టుకోగలుగుతారు.
ఆర్థిక క్రమశిక్షణ అలవడాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - vasundhara story
ఇంటి బాధ్యతల్ని నెరవేర్చే క్రమంలో ఆర్థిక విషయాల్లోనే ఎక్కువగా ఆలుమగల మధ్య ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. మరి ఆర్థిక క్రమశిక్షణ అలవడాలన్నా, ఇబ్బందుల్లేకుండా భవిష్యత్తు హాయిగా సాగిపోవాలన్నా...ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
ఆర్థిక ప్రణాళిక లోపించడం, అవసరాలకు-ఖర్చులకు మధ్య పొంతన కుదరకపోవడం వంటి విషయాల్లో సహజంగా చర్చలు, వాదనలు జరుగుతుంటాయి. సమస్య మూలం గుర్తించకుండా ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం ఉండదు. ఇద్దరూ ఉద్యోగులైతే నెల జీతం ఖాతాలో జమ అయిన రోజు నుంచే ఎప్పుడు ఎంత నగదు బయటకు తీశారో నమోదు చేసుకోండి. ఏ రోజు వాడిన మొత్తం గురించి అప్పుడే విడివిడిగా రాయండి. దాంతో దేనికి ఎంత వినియోగిస్తున్నారో తెలుస్తుంది. వృథా తెలుసుకుని నివారించే వీలు కలుగుతుంది.
ఆదాయం ఎంతున్నా...ఖర్చులూ దానికి తగ్గట్లే ఉంటాయి. అందుకే పరిమితికి మించి ఖర్చు చేయడం, మితిమీరి క్రెడిట్ కార్డుల్ని వినియోగించడం వంటివి చేయొద్దు. ముందు అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వండి. తర్వాతే...సౌకర్యం, విలాసం. ఏ వస్తువు కొనాలన్నా కొంత పొదుపు చేశాకే అనే నియమం పెట్టుకోవడం వల్ల వడ్డీల మోత తప్పుతుంది.