భార్యాభర్తల బంధం.. అదో మధురమైన అనుబంధం. దానిని పటిష్టం చేసే అంశాలు చాలానే ఉంటాయి. కాస్త రొమాన్స్, ఇంకాస్త ఏకాంతం.. వీటిలో మరింత కీలకమైనవి. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులు దంపతుల మధ్య ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా చేస్తున్నాయి.
నువ్వు నాకు నచ్చలేదు...
చాలా జంటలు గొడవలు పడ్డప్పుడు ఒకరంటే మరొకరికి ఇష్టం లేదన్నట్లుగా మాట్లాడుకుంటారు. మీరూ ఆ కోవకి చెందిన వారా.. అయితే ఇప్పటి నుంచైనా అలాంటి మాటలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ మాట భాగస్వామి మనసును గాయపరుస్తుంది. ఇదే మీ బంధాన్ని పెళుసుబారుస్తుంది.
నేను లేకపోతే నువ్వేమీ చేయలేవు...
అంటూ కొందరు ఎదుటివారిని తేలిక చేసి మాట్లాడతారు. ఇది మంచి పద్ధతి కాదు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు తోడు నీడగా అడుగులు వేసినప్పుడే ఆ బంధం మరింత దృఢమవుతుంది. కాబట్టి నేను లేకపోతే నువ్వు లేవు... లాంటి భారీ డైలాగులొద్దు. ఏదైనా సందర్భంలో భాగస్వామిపై కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండటమో లేదా ఆ ప్రదేశం నుంచి కాసేపు దూరంగా వెళ్లడమో చేయాలి. లేదా ఇద్దరూ కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాలి.