సంసారమన్నాక మనస్పర్థలు, గొడవలు సహజమే! అయితే దంపతుల్లో ఎవరో ఒకరు రాజీపడి వీటిని సద్దుమణిగేలా చేస్తేనే కాపురం సజావుగా ముందుకు సాగుతుంది. కానీ ఇలా అర్థం చేసుకునే తత్వమున్న దంపతులు ఈ కాలంలో చాలా అరుదుగానే కనిపిస్తున్నారంటున్నారు నిపుణులు. ఇందుకు ఆర్థిక స్వాతంత్ర్యం, అసూయాద్వేషాలు, పురుషాధిపత్యం.. వంటివెన్నో కారణాలు కావచ్చు! అయితే వీటి కారణంగా ఇద్దరి మధ్య పలు విషయాల్లో వచ్చే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అనుబంధాన్ని తెగే దాకా లాగుతున్నాయని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరి, ఇలా జరగకూడదంటే ఈ కాలపు దంపతులు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.
ఓ మెట్టు దిగండి!
వివాహ బంధమంటే ఎన్నో బరువు బాధ్యతలతో కూడుకున్నది. పెళ్లి కాక ముందు వరకు ఎలా ఉన్నా.. పెళ్లయ్యాక మాత్రం దంపతులిద్దరూ ఒకరికొకరు కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం తప్పనిసరి! అయితే ఈ కాలపు దంపతుల్లో ఇది కొరవడుతోందని చెబుతున్నారు నిపుణులు. దీనికి కారణం.. వారికి చిన్న వయసులోనే పెళ్లి కావడం, లేదంటే ఇద్దరి మధ్య వయోభేదం ఎక్కువగా ఉండడం..! ఫలితంగా ఒకరి మాటలు-అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించకపోవడం, పరిణతితో ఆలోచించలేకపోవడం.. వంటివే ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. అయితే వీటిని ఇలాగే వదిలేస్తే అనుబంధానికే ముప్పు వాటిల్లచ్చు. కాబట్టి ఇలాంటి కలతల్ని దూరం చేసుకోవాలంటే.. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటేనే సాధ్యమవుతుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరిలో ఒకరు కాస్త మొండిగా ఉన్నా.. మరొకరు ఓ మెట్టు దిగితే తప్పు లేదు. ఫలితంగా గొడవలూ సద్దుమణుగుతాయి.. ఎదుటివారూ మీ ఓపికను అర్థం చేసుకొని వారి ప్రవర్తననూ క్రమంగా మార్చుకునే అవకాశాలుంటాయి.
పంచుకుంటేనే ఫలితం!
ఇంటి పనులు, ఆఫీస్ పనులు.. ఈతరం దంపతుల మధ్య దూరం పెరగడానికి ఇవీ ఓ రకంగా కారణమే! అందుకే ఆఫీస్ పనులు పక్కన పెట్టినా ఇంటి పనుల్ని కలిసి పంచుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇవనే కాదు.. పిల్లల వల్ల కూడా ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించలేకపోతున్నామన్నది చాలామంది దంపతులు చెబుతోన్న మాట! అలాగని పిల్లల్నీ వద్దనుకోలేం.. ఎందుకంటే వాళ్లూ మన జీవితంలో అంతర్భాగమే! అయితే దీనికి ఒకే ఒక్క మార్గం ఉందంటున్నారు నిపుణులు. ఎలాగైతే పిల్లలకు జన్మనివ్వడంలో ఆలుమగల బాధ్యత సమానంగా ఉంటుందో.. పిల్లల్ని పెంచి పెద్ద చేసే బాధ్యతనూ కలిసి పంచుకున్నప్పుడే ఒక్కరిపైనే పూర్తి భారం పడకుండా ఉంటుంది.. తద్వారా అటు సమయమూ మిగులుతుంది.. ఇటు పిల్లలకు-మీకు మధ్య అనుబంధం రెట్టింపవుతుంది. ఇక ఈ దొరికిన సమయాన్ని దంపతులిద్దరూ వినియోగించుకోగలిగితే సంసారంలో కలతలకు చోటే ఉండదు.. ఏమంటారు?!