తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటే పెళ్లే వద్దనుకున్నా.. - love stories

అబ్బాయి రూపవంతుడు.. గుణవంతుడు.. పైగా తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు.. ఇలాంటి లక్షణాలు ఉంటే చాలు.. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇలాంటి వ్యక్తి మా ఇంటి అల్లుడైతే బాగుంటుందని అనుకోకుండా ఉండలేరు. అయితే 'అలా గొప్పగా ప్రవర్తించే ముసుగు వెనక ఆధిపత్య ధోరణితో.. మాటలతో హింసించే అహంకారులు కూడా ఉంటారు జాగ్రత్త!' అంటోంది ఓ అమ్మాయి. ఇంతకీ తన కథేంటో తెలుసుకుందామా..

ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటే పెళ్లే వద్దనుకున్నా..
ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటే పెళ్లే వద్దనుకున్నా..

By

Published : Mar 7, 2021, 4:51 PM IST

Updated : Mar 9, 2021, 4:02 PM IST

నా పేరు మాధురి. మాది ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడిన కుటుంబమే. నేను ఎంబీయే పూర్తి చేశాను. ఆ తర్వాత నాన్న నాకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో తెలిసినవాళ్లందరికీ సంబంధాలుంటే చూడమని చెప్పారు. అంతేకాకుండా దగ్గరుండి మరీ మ్యాట్రిమోనియల్ సైట్‌లో కూడా నా ప్రొఫైల్ అప్‌లోడ్ చేయించారు. ఆ తర్వాత లెక్కలేనంత మంది అబ్బాయిల వివరాలు నా మెయిల్‌కి వచ్చేవి. అలా వచ్చినవాటితో పాటు, బంధువులు తీసుకొచ్చిన సంబంధాలన్నింటినీ అమ్మానాన్న వారాంతాల్లో పరిశీలించేవారు. కుటుంబం, ఉద్యోగం, సంపాదన, అందం, ఇలా వారికున్న ప్రాధాన్యాల ఆధారంగా కొన్ని సంబంధాలను ఎంపిక చేశారు. ఆ తర్వాత వాటన్నింటినీ వడపోసి చివరికి అక్షయ్ విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఉన్న అతని వివరాల ప్రకారం అతని గురించి ఎంక్వైరీ చేయించి, అంతా సరే అనుకున్నాక సంబంధం కలుపుకోవడానికి ముందడుగు వేశారు. అక్షయ్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాక మా ఇద్దరికీ పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. నాకు అబ్బాయి, వాళ్లకి నేను నచ్చడంతో సంబంధం ఖాయం చేశారు.

ఆ తర్వాత మంచిరోజు చూసి ఇద్దరికీ నిశ్చితార్థం జరిపారు. పెళ్లిచూపులు, నిశ్చితార్థం రోజున అక్షయ్ మాట్లాడుతున్న తీరు, అతని ప్రవర్తన చూసి అందరూ నా అంత అదృష్టవంతురాలు లేదని అన్నారు. నేను కూడా అలాగే భావించాను. నిశ్చితార్థం అయిన తర్వాతి రోజు నుంచి మేమిద్దరం రోజూ ఏదో ఒక సమయంలో కలుసుకొని మాట్లాడుకునేవాళ్లం. మొదట్లో అక్షయ్‌తో సమయం గడపడమంటే ఎంతో హాయిగా అనిపించేది. మృదుమధురమైన అతని మాటలు వింటూ ఉంటే ఎంతసేపైనా అలాగే వినాలనిపించేది. కొన్ని అంశాల్లో మా ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నా ఇద్దరం ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకునేవాళ్లం. ఎప్పుడైనా అక్షయ్ చేసే పనుల్లో నేను ఏదైనా సలహా ఇస్తే దాన్ని ఓ సూచనగా పరిగణిస్తున్నానని చెప్పేవాడు. అలా నా మాటకు విలువనిచ్చేవాడు భర్త కాబోతున్నందుకు ఎంతగానో సంతోషించేదాన్ని. తను కూడా నాకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుంటూ తగిన సలహాలిస్తూ ఉండేవాడు.

అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత తను ఏదైనా విషయం చెబుతున్నప్పుడు నేను గమనించిన విషయాన్ని తనతో పంచుకోబోతుంటే.. 'ఎందుకు ప్రతి దాంట్లోనూ నాకు సలహాలివ్వాలని చూస్తావు? అలా ఉచిత సలహాలు ఇచ్చేవారంటే నాకు చిరాకు' అంటూ కోప్పడేవాడు. అంతేకాదు.. 'నాకు సలహాలిచ్చేటంత తెలివితేటలు నీ దగ్గర లేవులే' అని చిన్నబుచ్చుకునేలా మాట్లాడేవాడు. నేను ఏ పని చేస్తున్నా.. దాని గురించి తనతో కచ్చితంగా చెప్పి తీరాల్సిందేనని కండిషన్ పెట్టేవాడు. నేనెప్పుడూ తాను చెప్పిన విధంగానే నడుచుకోవాలనే మనస్తత్వం అతనిది. దీంతో నాకిష్టం లేకపోయినా తనకు నచ్చినట్టుగా చేయాల్సి వచ్చేది. అంతేకాదు కొన్ని రోజుల తర్వాత నన్ను పూర్తిగా తెలివిలేనిదాని కింద జమ కట్టేశాడు. నేను దేన్నైనా సహిస్తాను కానీ.. ఎదుటివారి తెలివితేటల్ని తక్కువగా అంచనా వేస్తే మాత్రం సహించలేని మనస్తత్వం నాది. అందుకే నన్ను తెలివితక్కువదానిగా చూడొద్దని.. నా పని నన్ను చేసుకోనివ్వమని ఎన్నోసార్లు చెప్పి చూశాను. అయినా అక్షయ్ ప్రవర్తనలో ఏం మార్పు రాలేదు. పైగా మాటిమాటికీ 'నాకు చెప్పేంత తెలివితేటలు నీ దగ్గర ఉన్నాయా?' అని చులకన చేసేవాడు. ఇలా చేస్తూ ఉంటే నన్ను అగౌరవపరిచినట్లుగా ఉందని కూడా చెప్పాను. నేను ఏది చెప్పినా పూచికపుల్లలాగా తీసి పడేసేవాడు. నేను దీన్ని తట్టుకోలేకపోయేదాన్ని.

పెళ్లి కాకముందే అన్ని విషయాల్లోనూ నన్ను అణిచేసేందుకు చూస్తున్నాడంటే.. పెళ్లయ్యాక నా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వూహించుకున్నాను. ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ నిత్యం మాటలతో హింసించే ఇతనితో చివరి వరకు కాపురం చేయడం కుదురుతుందా? అనే సందేహం కూడా నన్ను పట్టిపీడించేది. అయితే అప్పటికే మా రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. రాకపోకలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో నేను అక్షయ్‌ని పెళ్లిచేసుకోనని చెబితే తప్పుగా అనుకుంటారేమోనని ముందు సందేహించాను. ఎందుకంటే నేను తీసుకునే నిర్ణయం వల్ల నా పెళ్లి ఆగిపోతుంది. దీనివల్ల నలుగురిలోనూ నా కుటుంబం నవ్వులపాలవుతుందనే ఆలోచన నన్ను వేధించేది. అయినా ఆలోచనలతో కాలయాపన చేయడం వల్ల చివరికి నష్టం జరిగేది నాకే అనిపించింది. ఇక ఏదేమైనా అతణ్ని పెళ్లి చేసుకోలేనని మా ఇంట్లో చెబుదామని నిశ్చయించుకున్నాను.

మొదట అక్షయ్ గురించి, అతని ప్రవర్తన గురించి నేను చెబుతుంటే అమ్మానాన్న నమ్మలేదు. అయితే తర్వాత వారికి అక్షయ్ గురించి పూర్తిగా వివరించి కొన్నిరోజులు అతని ప్రవర్తనను పరిశీలించమని చెప్పాను. వాళ్లు అలాగే చేసి నేను చెప్పింది నిజమని నమ్మారు. అయితే ఒకసారి పెళ్లి చెడిపోతే.. మళ్లీ సంబంధాలు రావేమోనని ముందు భయపడ్డారు. కానీ ఓ మూర్ఖుడి చేతిలో నన్ను పెట్టి నా జీవితాన్ని బలివ్వడానికి వారి మనసు అంగీకరించలేదు. అందుకే నాన్న అక్షయ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ సంబంధం మేం చేసుకోమని తెగేసి చెప్పారు. దీంతో ఆ పెళ్లి సంబంధం రద్దయిపోయింది.

నేను చెప్పాలనుకుంటుందేంటంటే.. ఎదుటివారిని తెలివితక్కువ వారిగా చిత్రీకరించి.. వారిని మాటలతో బాధపెట్టి వారిపై పైచేయి సాధించాలనుకోవడం మంచి పద్ధతి కాదు. కట్టుకోబోయేవాడైనా సరే.. ఇలాంటి ప్రవర్తనను మనం ఆమోదించాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. జీవితాంతం కలిసి ఉండబోయే వ్యక్తి ప్రవర్తన మనకు నచ్చకపోతే ఎవరికోసమో అతన్ని చేసుకొని బాధపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. అలాంటి పరిస్థితుల్లో మన నిర్ణయం సరైనదే అయితే తల్లిదండ్రులతో పాటు అందరూ మనకు తోడుగా.. అండగా నిలుస్తారు. నా జీవితానుభవం ద్వారా నేను తెలుసుకున్న వాస్తవమిది. -మీ మాధురి

ఇదీ చదవండి:నా భర్త హోమో సెక్సువల్... అందుకే అలా చేశా!

Last Updated : Mar 9, 2021, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details