ఇద్దరి మధ్య గాఢమైన అనుబంధం, ఒకరంటే మరొకరికి చెప్పలేనంత ప్రేమ, సాన్నిహిత్యం.. సాధారణంగా ఏ బంధంలోనైనా ఈ మూడు అంశాలుంటే అది పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు లెక్క. అయితే కొందరిలో ఈ మూడూ ఒకే వ్యక్తిపై ఉండాలని రూలేం లేదు. ఈ క్రమంలో ఒకే వ్యక్తి ఒకరితో కలిసి ఉంటూ, మరొకరితో అనుబంధం పెంచుకోవచ్చు. సాధారణంగా ఇదే వివాహేతర సంబంధాలకు కారణమవుతుంది.
ఎక్కువ శాతం మందికి ప్రస్తుతం ఉన్న బంధంలో బోర్ కొట్టడం లేదా అందులోని ఒత్తిడిని తగ్గించుకోవడానికి వేరొకరిని ఆశ్రయించడం, తమని తమ భాగస్వామి కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారని వారిపై ప్రేమను, నమ్మకాన్ని పెంచుకోవడం.. ఇలా వివాహేతర సంబంధాలకు చాలా కారణాలే ఉంటాయి. సాధారణంగా కొన్ని వివాహేతర సంబంధాలను పరిశీలిస్తే..
కేవలం కోరికలకే..
కేవలం కోరికలకే పరిమితమయ్యే బంధాలు కూడా కొన్నుంటాయి. ఇలాంటి సంబంధాల్లో ఉన్నవారికి వివాహేతర సంబంధంలో ఉన్న తమ భాగస్వామిపై తమకున్న కోరికలను నెరవేర్చుకునే వరకు వాళ్లని విడిచిపెట్టాలన్న ఆలోచన ఏమాత్రం రాదు.
కేవలం ఆ ఒక్కరితో మాత్రమే శారీరక సంబంధానికి కట్టుబడి ఉండకపోవచ్చు. ఇలాంటి బంధాలు ఎక్కువ కాలం నిలవవు. తమ భాగస్వామితో చక్కటి జీవితం గడుపుతున్నాం.. అన్న ఆలోచన వచ్చి కనువిప్పు కలగగానే ఇలాంటి బంధాలకు దూరంగా ఉండడం ప్రారంభిస్తారు కొందరు. ఎదుటివాళ్లు మనతో కాస్త క్లోజ్‌గా మాట్లాడితే చాలు.. వాళ్లకు మనతో సమయం గడపడమంటే ఇష్టమని, తామిద్దరం ప్రేమలో ఉన్నామని భావిస్తుంటారు మరికొందరు.
వీరికోసం అవతలివారు తమ భాగస్వామిని కూడా వదిలేస్తారని వూహించుకుంటారు. కానీ ఇలా మధ్యలో కలిసిన బంధాలు మధ్యలోనే విడిపోతాయి. దీంతో చివరకు నిరాశే మిగులుతుంది. అంతేకాదు.. ఇలాంటి పనులు చేస్తున్నారని అసలు భాగస్వామికి తెలిస్తే.. అప్పటివరకు ఉన్న సదభిప్రాయం పోవడంతో పాటు, వివాహ బంధానికే ముప్పు వాటిల్లే అవకాశముంటుంది. కాబట్టి ఇలాంటి బంధాలు ప్రారంభించడం కంటే మీ భాగస్వామితో మాట్లాడి, వీలైతే సెక్సాలజిస్ట్, సైకాలజిస్ట్.. వంటి నిపుణుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం.. అలాంటి ఆలోచనలు మదిలోకి రాకుండా జాగ్రత్తపడడం మంచిది.
కోపంతో ప్రారంభమయ్యేవి..
వివాహేతర సంబంధాల్లో ఈ తరహా బంధాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. భర్త లేదా భార్య తమతో సరిగ్గా సమయం గడపట్లేదనో.. తాము చెప్పినట్లు వినట్లేదనో కోపగించుకొని వివాహేతర బంధాలను ప్రారంభించేవారూ లేకపోలేదు. మరికొందరు ఇలాంటి బంధాలు కొనసాగించే తమ భాగస్వామిపై కోపగించుకొని వారూ ఇలాంటి బంధాల్ని ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి రిలేషన్‌షిప్స్‌లో ప్రస్తుత బంధంలో తమకున్న ఒత్తిడి, సమస్యలను ఎదుటివారితో పంచుకోవడానికి మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. పైగా వీటివల్ల ఒరిగేదేమీ ఉండదు.. దంపతుల మధ్య గొడవలు జరగడం తప్ప. 'తన కోపమే తన శత్రువు' అన్నట్లుగా భాగస్వామిపై కోపంతో ఇలాంటి పంతాలకు పోతే తమ వివాహబంధంలో నిరాశే మిగులుతుంది. కాబట్టి ఇలాంటి బంధాలు ప్రారంభించే బదులు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను వారే మాట్లాడుకొని పరిష్కరించుకోవడం వల్ల భేదాభిప్రాయాలన్నీ సమసిపోయి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది.