పిల్లలు పుట్టకముందే ఇవి చేసేయండి! - వీటిని పిల్లలు పుట్టకముందే చేసేయండి!
జీవితంలో ఒక్కో వయసులో ఒక్కో రకమైన బాధ్యతలుంటాయి. పెళ్లికి ముందు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించడం ఒక బాధ్యతైతే; పెళ్లి తర్వాత భాగస్వామితో కలిసి బాధ్యతలు పంచుకోవడం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ల ఆలనాపాలనా చూడడం, ఆ తర్వాత పెద్దవాళ్లను చూసుకోవడం.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి క్యూలో ఉంటాయి. జీవితమంతా ఇలా బిజీ బిజీగానే గడిచిపోతుంటే ఇంక ఎంజాయ్ చేసేదెప్పుడు అంటారా? అదే.. అక్కడికే వస్తున్నాం.. ముఖ్యంగా పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టకముందు.. ప్రతి మహిళ చేయాల్సిన కొన్ని పనులున్నాయి.. మరి అవేంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నట్లున్నారు.. చదివేయండి మరి..
వీటిని పిల్లలు పుట్టకముందే చేసేయండి!
By
Published : Apr 20, 2021, 12:40 PM IST
పొదుపు చేస్తున్నారా??
పిల్లలు పుట్టకముందు ప్రారంభించాల్సిన అతి ముఖ్యమైన పని పొదుపు చేయడం. పెళ్త్లెన తొలినాళ్ల నుంచే పొదుపు చేయడం మొదలుపెడితే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవచ్చు. లేదంటే దాని ప్రభావం పిల్లల బంగారు భవిష్యత్తుపై పడుతుంది. కాబట్టి పెళ్లి తర్వాత ఖర్చులను అదుపులో ఉంచుకొని భాగస్వామితో కలిసి పొదుపు చేయడం మొదలుపెట్టడం మంచిది.
సరదాగా అలా..
చాలామంది పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టడానికి మధ్యలో కనీసం ఒక సంవత్సరమైనా గ్యాప్ ఇస్తుంటారు. ఎందుకంటారా.. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ల ఆలనా పాలనా చూసుకునే క్రమంలో భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి సరదాగా గడిపే తీరిక, ఆసక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు పిల్లల్ని చూసుకోవడానికే సమయం సరిపోదు. కాబట్టి పిల్లలు పుట్టకముందే భాగస్వామితో హనీమూన్‌కి వెళ్లడం, కొత్త ప్రదేశాలను చూసి రావడం, సరదాగా తనతో ఒంటరిగా గడపడం... ఇలా ఇద్దరూ కలిసి వీలైనంతగా ఎంజాయ్ చేయడం మంచిది.
స్నేహితులతో కలిసి..
స్నేహితులతో కలిసి కాస్త సమయం గడపాలని ఎవరికైనా ఉంటుంది కదండీ.. అది పెళ్లయిన ఆడవాళ్లకైనా సరే.. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి అవకాశం రాకపోవచ్చు. కాబట్టి పిల్లల బాధ్యత ఏర్పడకముందే మీ ఫ్రెండ్స్, మీరు కలిసి సరదాగా గడపడానికి ప్లాన్ చేసుకోవడం వల్ల ఆ ఎంజాయ్‌మెంట్ మిస్సయ్యామన్న దిగులుండదు.
సాహసం చేయాలనుందా?
కొంతమంది మహిళలకు సాహసకృత్యాలు చేయడమంటే చాలా ఇష్టం. కానీ పిల్లలు పుట్టిన తర్వాత శరీరం సహకరించకో, లేదంటే ఇక ఇది సరైన వయసు కాదనో.. ఇలా పలు కారణాల వల్ల వెనకడుగు వేస్తుంటారు. కాబట్టి ముందుగానే ఇలాంటి సాహసకృత్యాలేవైనా చేయాలనుంటే చేసేయడం మంచిది.
దుస్తుల విషయంలోనూ..
ఈ రోజుల్లో అయితే ఏ వయసులో అయినా మోడ్రన్‌గా తయారవడం సర్వసాధారణమైపోయింది. కానీ కొందరు మాత్రం పిల్లలు పుట్టక ముందు రకరకాల మోడ్రన్ డ్రస్సులు వేసుకున్నా, ఆ తర్వాత మాత్రం చీరలు, చుడీదార్స్ మొదలైన వాటికే పరిమితమవుతుంటారు. ఒకవేళ వారికి వేసుకోవాలనిపించినా.. 'పిల్లలు పుట్టినా ఇంకా ఈ స్త్టెల్స్ ఏంటంటూ' ఎవరైనా విమర్శిస్తారని వేసుకోకుండా ఉండేవాళ్లూ ఉన్నారు. నిజానికి ఎప్పుడు ఏ డ్రస్సు వేసుకోవాలన్న విషయంలో ఎవరి వ్యక్తిగత నిర్ణయం వారిది. అయినా ఎవరో ఏదో అనుకుంటారని మొహమాట పడే పరిస్థితులలో ఆ డ్రస్సులేవో ముందే వేసుకొని ఆ మోజు తీర్చుకోవడం మంచిది కదా!
సినిమాలు, షికార్లు..
పెళ్లి అయిందంటే సినిమాలకు, షికార్లకు ఢోకానే ఉండదు. అయితే పిల్లలు పుట్టారంటే ఈ సరదాలన్నిటినీ కొంతకాలం కట్టిపెట్టాల్సిందే. అందుకే పిల్లలు పుట్టకముందే దంపతులిద్దరూ నచ్చిన రీతిలో సరదాగా గడపడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్యా దూరాలేమైనా ఉంటే తొలగిపోయి.. అర్థం చేసుకునే మనస్తత్వం కూడా పెరుగుతుంది.
అభిరుచుల కోసం..
కొంతమందికి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. మరికొందరికి గార్డెనింగ్ అంటే ఇష్టం. మరొకరికి మరోటంటే ఇష్టం. కానీ పిల్లలు పుట్టిన తర్వాత వీటన్నింటికీ అంత సమయం దొరక్కపోవచ్చు. అందుకే పిల్లలు పుట్టకముందే మీ అభిరుచులు నెరవేర్చుకోవడానికి కూడా తగినంత సమయం కేటాయించాలి.
నిద్రా అవసరమే..
నిద్ర సరిగ్గా లేకపోతే పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అవి భవిష్యత్తులో ఆరోగ్యపరంగా దుష్పరిణామాలకు దారితీస్తాయి. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లను అలా వదిలేసి హాయిగా నిద్రపోలేం కదా! అందుకే గర్భం ధరించక ముందే మీకు దొరికిన సమయంలో నిద్రపోవడానికి కూడా తగిన సమయం కేటాయించడం చాలా ముఖ్యం. అలాగే గర్భం ధరించిన తర్వాత నిద్రలేమి వల్ల కలిగే దుష్పరిణామాలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సమయంలోనూ సరైన నిద్ర చాలా అవసరం.
ఇక్కడ చెప్పినవన్నీ కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. మీకు మరిన్ని ఆసక్తులు, అభిరుచులు ఉండచ్చు. అలాగే కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లడం, ఫ్రెండ్స్ ని కలవడం మొదలైనవి సాధ్యం కాకపోవచ్చు. అయితే సాధారణంగా పిల్లలు పుట్టే ముందు చేయాల్సిన కొన్ని పనుల గురించి చెప్పడం మాత్రమే ఇక్కడ మా ఉద్దేశం. ఈ క్రమంలో పెళ్లయ్యాక, పిల్లలు పుట్టక ముందు మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని వాటిని నెరవేర్చుకోండి మరి!