- మాదాపూర్ ఐటీ కంపెనీల్లో ఇద్దరూ సహోద్యోగులు. రెండేళ్లపాటు సహజీవనం చేశారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 6 నెలలకే కలసి ఉండలేమనే అభిప్రాయానికి వచ్చారు. ఇద్దరూ కలసి ఉన్నపుడు బోర్ కొడుతుందనేది వారి సమాధానం.
- పెళ్లయి మూడు నెలలు.. కుటుంబాలకు దూరంగా ఖరీదైన ఫ్లాట్‌లో నివాసం. కొత్త దంపతులు కదా! అని తల్లిదండ్రులు కూడా దూరంగా ఉన్నారు. ఇలాంటి భర్తతో కాపురం నా వల్ల కాదంటూ అమ్మాయి తేల్చి చెప్పింది.. కౌన్సెలింగ్‌లో ఆరాతీస్తే ‘ప్రేమతో ఇంటికొచ్చిన తన తండ్రి పట్ల భర్త దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ కన్నీరు పెట్టుకుంది.
Breakup With Love Life: పెద్ద చదువులు, ఉన్నత కొలువులు, అత్తమామల వేధింపులు లేవు, ఆర్థిక ఇబ్బందులు మచ్చుకైనా కనిపించవు.. కానీ ఆలుమగల మధ్య నిత్యం కలహాలు.. కలసి ఉండటం మా వల్ల కాదంటూ పోలీస్‌స్టేషన్లకు చేరుతున్నారు. సున్నిత మనస్కులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. పిల్లలున్న దంపతులు మాత్రమే కౌన్సెలింగ్‌కు వస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఐటీ, కార్పొరేట్ సంస్థల్లో లక్షల సంపాదన.. మరోవైపు పొట్టకూటి కోసం కూలినాలీ చేసుకుంటూ బతుకెళ్లదీసే పేద కుటుంబాలున్నాయి. వీరిలో అధిక శాతం గొడవ పడి ఠాణా వద్దకు పంచాయితీకి చేరేది బాగా చదువుకున్న జంటలే అంటున్నారు పోలీసులు. సైబరాబాద్ పోలీసులకు డయల్ 100 ద్వారా రోజూ వచ్చే 750 ఫోన్‌కాల్స్‌లో 300 మహిళల వేధింపులకు సంబంధించినవే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
నాలుగేళ్ల వ్యవధిలో హత్యలు,ఆత్మహత్యలు, వరకట్న వేధింపులు, అత్యాచారం, వేధింపులతో నమోదైన కేసులివీ..
సైబరాబాద్ పరిధిలో |
2018 | 2,555 |
2019 | 2,830 |
2020 | 2,302 |
2021 | 2,500-2,550 (అంచనా) |
కారణాలు చిన్నవే
భార్యాభర్తల తగాదాల్లో ఇటువైపు నుంచి చూసినపుడు సమస్య చిన్నదిగా అనిపిస్తుంది. మనోవేదన అనుభవించే వారికే ఆ బాధ తెలుస్తుందంటారు క్లినికల్ సైకాలజిస్టు ఆరె అనిత. గచ్చిబౌలి మహిళా పోలీస్‌స్టేషన్‌కు ఏటా 4,000కు పైగా ఫిర్యాదులు వస్తుంటాయని అంచనా. వీటిలో 70-80 శాతం ప్రైవేటు ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు, ఐటీ నిపుణులు ఉంటున్నారు. విడిపోవడానికి కారణాలు కూడా చిన్నవిగా కనిపిస్తున్నాయంటారు గచ్చిబౌలి మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.బాలకృష్ణ. ‘మద్యం అలవాటు, వివాహేతర సంబంధాలు, వరకట్న వేధింపులకు గురవుతున్న గృహిణులు భర్త నుంచి బయటపడాలని భావిస్తున్నారు. పిల్లల్ని కూడా తామే పోషిస్తామంటున్నారు. అంతటి కఠిన నిర్ణయం తీసుకునేందుకు ఎంతోకాలంగా అనుభవిస్తున్న మనోవేదన కారణం’ అంటూ విశ్లేషించారు.
రోజుకు ఐదు ఫిర్యాదులు
భార్యాభర్తల తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రతిరోజు సగటున ఐదు వరకు అందుతున్నాయి. ఇందులో భార్యభర్తలిద్దరూ ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేసేవారివే ఎక్కువ. వివాహేతర సంబంధాలు హత్య/ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. భార్యభర్తల్లో ఎవరో ఒకరు ఇతరులతో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించడం ద్వారా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని కేసుల్లో ఆర్థిక సమస్యలు విభేదాలకు కారణమవుతున్నాయి. కొంతమంది భర్తలు వచ్చే సంపాదన తాగుడుకు ఖర్చు చేయడం ద్వారా ఆయా ఇళ్లలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి.