అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నా... జీతభత్యాలు, అవకాశాలు వంటి విషయాల్లో నేటికీ మహిళలు సమానత్వం సాధించలేకపోతున్నారు. పని ప్రదేశంలో నెలకొన్న పురుషాధిక్య ధోరణి నుంచి స్త్రీలు బయటపడి పురుషుల కంటే సమర్థంగా రాణించడం అసాధ్యమేనా? అంటే కాదంటున్నారు కార్పొరేట్ నిపుణులు. పనిచేసే చోట కొన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే పురుషాధిక్య రంగాల్లోనూ స్త్రీలు అద్భుతంగా రాణిస్తారని వారు సూచిస్తున్నారు.
మీటింగుల్లో మాట్లాడండి!
పని ప్రదేశాల్లో ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సమావేశాలుండడం కామనే. అయితే ఇలాంటి మీటింగుల్లో మాట్లాడడానికి మహిళల కంటే పురుషులే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట. 'హార్వర్డ్ బిజినెస్ రివ్యూ' ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మీటింగుల్లో మాట్లాడడానికి, తమ అభిప్రాయాల్ని వెల్లడించడానికి పురుషుల కంటే మహిళలు తక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని తేలింది. అంతేకాదు.. ఒకవేళ మాట్లాడినప్పటికీ ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కలగజేసుకోవడం, అందుకు క్షమాపణ చెప్పడం తరచుగా జరుగుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది. ఇందుకు తాము చెప్పేది అంత విలువైన విషయం కాదని వారు భావించడమే కారణమట! తద్వారా వారు తమలోని ఆత్మవిశ్వాసాన్ని సైతం కోల్పోతున్నారట! అందుకే ఇలాంటి ఆలోచనలకు స్వస్తి పలికి తమ అభిప్రాయాలే విలువైనవిగా గుర్తించి వాటిని ఆఫీసు మీటింగుల్లో నిస్సందేహంగా వ్యక్తపరచాలని సూచిస్తున్నారు కార్పొరేట్ నిపుణులు. ఇలా మహిళలు తమ అభిప్రాయాల్ని పంచుకోవడం మొదలుపెట్టి దాన్నే కొనసాగించడం వల్ల వినేవారు కూడా మరింత శ్రద్ధ, ఆసక్తిని కనబరిచే అవకాశం ఉంది. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం మరింతగా రెట్టింపవుతుంది.. అది వారు చేసే పనిపై సానుకూల ప్రభావం చూపి వారిని మరింత ముందుకు తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు.
మరో వ్యక్తి జోక్యం లేకుండా..
పని ప్రదేశాల్లో అటు బాస్‌తోనైనా, ఇటు ఇతర ఉద్యోగులతోనైనా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటప్పుడు కొందరు ఉద్యోగినులు ఫలానా వారి నుంచి వారికి ఎదురైన సమస్యల్ని ఇతర ఉద్యోగులతో పంచుకోవడం, వారి ప్రవర్తన గురించి అసహనం వ్యక్తం చేయడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ సమస్య ఏమో గానీ ఇతరులు మీ వ్యక్తిత్వం గురించి తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది. ఇది పని ప్రదేశంలో మీ పురోగతిని దెబ్బతీస్తుంది. కాబట్టి మీకు ఎవరితోనైతే సమస్య ఎదురైందో ఆ విషయం గురించి వారితోనే నేరుగా మాట్లాడడం మంచిది. తద్వారా మీ సమస్యకు పరిష్కారం దొరకడంతో పాటు మీలో ఉన్న ధైర్యం గురించి కూడా వారికి తెలుస్తుంది. మీవైపు నుంచి ఎలాంటి తప్పు లేకుండా ఉంటే మీ ఈ ప్రవర్తన మిమ్మల్ని మరింత ముందుకు వెళ్లేందుకు దోహదం చేస్తుందే తప్ప మీ పురోగతిపై ఎలాంటి ప్రతికూలత చూపదు.
ప్రశంసల్ని స్వీకరించండి..
మనం చేసే పని ఏదైనా సరే దాని అవుట్‌పుట్‌పైనే మన పురోగతి ఆధారపడుతుందన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే పనిలో మంచి ప్రతిభ కనబరిచినప్పుడు పైఅధికారులు మన పనిని మెచ్చుకోవడం కామనే. కానీ కొందరు మహిళలు ఈ పొగడ్తల్ని స్వీకరించి తమ శక్తిని నిరూపించుకోకుండా.. 'దేవుడి దయ వల్లే లక్కీగా ఆ ప్రాజెక్టు సక్సెసయింది..', 'ఈ విజయంలో నా కొలీగ్స్ బాగా సహాయం చేశారు..' అంటూ చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల వారే ఆ పనిని పూర్తిచేయడంలో ముఖ్య భూమిక పోషించినప్పటికీ వారి శక్తియుక్తుల గురించి, ప్రతిభ గురించి ఇతరులకు తెలియకపోవచ్చు. కాబట్టి మీరు చేసిన పనికి పైఅధికారుల నుంచి అందిన ప్రశంసల్ని స్వీకరించండి. తద్వారా మీలో ఆత్మవిశ్వాసం, పని పట్ల మక్కువ పెరగడంతో పాటు కెరీర్‌లోనూ మీరు పురోగతి సాధించవచ్చు.