కర్ణాటకలోని మైసూరుకు చెందిన 73 ఏళ్ల కిరణ్ రాణే (పేరు మార్చాం) టీచర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అందరమ్మాయిల్లాగే యుక్త వయసులో ఎన్నో కలలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినా అక్కడ ఆమెకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. దీంతో తన భర్త నుంచి విడాకులు తీసుకొని తన తల్లిదండ్రుల చెంతకు చేరారామె. ఇలా తొలి వివాహ బంధం మిగిల్చిన చేదు అనుభవాలు ఆమెకు పెళ్లంటేనే అయిష్టత కలిగేలా చేశాయి. దీంతో ఇన్నాళ్లూ అమ్మానాన్నల వద్దే ఉంటూ కాలం గడిపారు కిరణ్. అయితే వాళ్లు కాలం చేయడంతో ఒక్కసారిగా ఒంటరయ్యారామె. దీంతో ఆప్యాయంగా పలకరించేవారు, ఆమె క్షేమ సమాచారాలు కనుక్కునేవారే కరువయ్యారు. ఎక్కడికెళ్లినా ఒంటరిగా, బెరుకుగా వెళ్లాల్సి వచ్చేది.
వరుడు కావలెను!
అయితే ఇలాంటి ఒంటరితనం ఆమెను తీవ్రంగా బాధించేది. అందుకే ఎలాగైనా దీన్నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నారు కిరణ్. ఈ క్రమంలో తోడు కోసం ఇన్నాళ్లూ తాను ఎలాంటి బంధానికైతే దూరంగా ఉంటూ వచ్చారో ఆ అనుబంధాన్నే ఎంచుకున్నారు. ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్న ఆమె.. తనకు తగిన జీవిత భాగస్వామితో మలి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అందుకోసం తనకు ఎలాంటి లక్షణాలున్న వరుడు కావాలో స్పష్టం చేస్తూ ఓ మ్యాట్రిమోనియల్ ప్రకటన కూడా ఇచ్చారామె. ఇందులో భాగంగా ‘నాకు సంప్రదాయ కుటుంబానికి చెందిన, ఆరోగ్యవంతుడైన, నా కంటే వయసులో పెద్దవాడైన వరుడు కావాలి..’ అంటూ వివరంగా తానిచ్చిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక ఈ ప్రకటన చూసిన ఓ 69 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ ‘మీకు తగిన వరుడిని నేనే.. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ స్పందించడంతో కిరణ్ ఎదురుచూపులకు తెరపడినట్లయింది. ఇక వీరిద్దరూ త్వరలోనే ఒక్కటవ్వాలని ఎంతోమంది నెటిజన్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరికొంతమందేమో ‘ఈ వయసులో పెళ్లి చేసుకోవడం అవసరమా?’ అంటూ విమర్శిస్తున్నారు.
అమ్మకు మళ్లీ పెళ్లి!
కిరణ్ ఒక్కరే కాదు.. మహిళల పెళ్లి గురించి సమాజంలో నెలకొన్న మూసధోరణులు బద్దలు కొట్టిన స్త్రీలు మరికొంతమంది ఉన్నారు. కారణమేదైనా వివాహబంధం నుంచి బయటికొచ్చి తమ పిల్లలే ఊపిరిగా బతుకుతోన్న త్యాగ మూర్తులెందరో! కానీ తాము పెళ్లి చేసుకొని వెళ్లిపోతే తమ తల్లి ఒంటరవుతుందన్న ఉద్దేశంతో ఈ సమాజపు కట్టబాట్లను కాలదన్ని తమ తల్లికి మళ్లీ పెళ్లి చేసింది ఆస్తా వర్మ అనే ఓ అమ్మాయి. వివిధ కారణాల వల్ల వైవాహిక బంధాన్ని తెంచుకొని తన కోసమే జీవిస్తోన్న తన తల్లికి ఓ తోడు కావాలని నిర్ణయించుకొని.. ‘టిండర్’ అనే డేటింగ్ యాప్‌లో ఓ ప్రకటన పోస్ట్ చేసింది. ‘మా అమ్మ కోసం 50 ఏళ్ల అందమైన వరుడు కావలెను. అతడు వెజిటేరియన్ అయి ఉండాలి.. మందు అలవాటు ఉండకూడదు.. జీవితంలో బాగా స్థిరపడి ఉండాలి..’ అంటూ వరుడికి ఉండాల్సిన లక్షణాలను పొందుపరిచి మరీ చేసిన ఈ మ్యాట్రిమోనియల్ ప్రకటన అప్పట్లో తెగ వైరలైంది. తన తల్లి గురించి తాను తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి అందరూ ఆమెను అభినందించారు.