కలిసి వెళ్లాలి..
'వినోద్.. ఈ రోజు ఇంట్లో కాస్త పని ఎక్కువైంది. నాకు చాలా అలసటగా ఉంది. అన్నం, కూర అన్నీ డైనింగ్ టేబుల్‌పై రెడీగా ఉంచాను. కాస్త నువ్వే వడ్డించుకొని తినకూడదు..! నేనెళ్లి పడుకుంటా..', ఓ భార్య వినతి. 'కీర్తనా.. ఆఫీసులో ఈ రోజు మీటింగ్ జరిగింది. దానికి తోడు అదనపు పని ఒత్తిడితో నా తల పగిలిపోయేలా ఉంది. నీ పని త్వరగా పూర్తి చేసుకుని వచ్చెయ్.. నేను వెళ్లి పడుకుంటాను ప్లీజ్..' ఓ భర్త తన భార్యకు చెబుతున్న మాట. మీరు కూడా ఇలా ఎవరికి వారే వెళ్లి పడుకుంటున్నారా? అయితే ఆ పద్ధతిని ఎంత త్వరగా మార్చితే అంత మంచిది. ఎందుకంటే రాత్రుళ్లు నిద్రపోవడానికి పడకగదిలోకి ప్రవేశించే దంపతులు ఎవరికి వారుగా కాకుండా కలిసి వెళ్లడం వల్ల వారి మధ్య అనుబంధం మరింతగా బలపడుతుందంటున్నారు నిపుణులు. అయితే ఇది అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. కానీ వీలైనప్పుడల్లా ఇలా చేయడానికే దంపతులు మొగ్గు చూపడం మంచిది. ఈ క్రమంలో ఒకవేళ ఇద్దరిలో ఎవరి పని త్వరగా పూర్తయినా మరొకరి కోసం కాసేపు వేచి ఉండడంలో తప్పులేదంటున్నారు. ఎందుకంటే దీనివల్ల ఆలుమగల మధ్య అర్థం చేసుకునేతత్వం, సర్దుకుపోవడం.. వంటివి అలవడతాయి. ఇలాంటివన్నీ వారి అనురాగాన్ని రెట్టింపుచేసేవే కదా!
మనసు విప్పండి!
ఆలుమగల మధ్య అనురాగం రెట్టింపవడానికి ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంతో అవసరం అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మాకు అంత సమయం దొరకట్లేదంటారా? మరేం ఫర్వాలేదు. అందుకు కూడా కేరాఫ్ అడ్రస్ బెడ్‌రూమే. రాత్రుళ్లు వీలైనంత వరకు ఒకేసారి పడకగదిలోకి ప్రవేశించే భార్యాభర్తలు ఎవరికి వారు నిద్రలోకి జారుకోవడం కాకుండా.. ఆ రోజు జరిగిన విషయాలు, జోక్స్, సమస్యలు.. వంటివన్నీ పరస్పరం పంచుకోవాలి. తద్వారా వారి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. అంతేకాకుండా.. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరిగి ఒకరికొకరు మరింత దగ్గరయ్యే ఆస్కారం ఉంటుంది.