ఈక్వెడార్ రాజధాని క్విటోకు చెందిన జూలియో సీజర్ మోరా, వాల్డ్రామినా క్వింటెరస్ సుమారు 80 ఏళ్ల క్రితం ఇంట్లోంచి పారిపోయి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. సుఖ దుఃఖాల్లో కలిసే ఉంటామన్న అప్పటి పెళ్లినాటి ప్రమాణాలను నిలబెట్టుకుంటూ దాంపత్య బంధాన్ని ఆస్వాదిస్తున్నారీ ఓల్డ్ కపుల్. వారి అన్యోన్యతకు దేవుడి ఆశీర్వాదం కూడా తోడయిందేమో అన్నట్లు వారి ఆయుర్దాయం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది.
మధురిమల ఆస్వాదన..
ప్రస్తుతం జూలియో వయసు 110 ఏళ్లు కాగా, అతడి భార్య వాల్డ్రామినాకు 104 ఏళ్లు. సుమారు 8 దశాబ్దాలుగా దాంపత్య బంధంలోని మధురిమలను ఆస్వాదిస్తున్న ఈ స్వీట్ కపుల్ ప్రపంచంలోనే వృద్ధ దంపతులుగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఈ లవ్లీ కపుల్ ప్రస్తుతం మనవలు, మనవరాళ్లు, ముని మనవళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
పెద్దలను ఎదిరించి... ఇంట్లోంచి వెళ్లిపోయి..
జూలియో 1910 మార్చి 10న పుట్టగా, క్వింటెరస్ 1915 అక్టోబర్ 16న జన్మించింది. వేసవి సెలవుల్లో భాగంగా వాల్డ్రామినా ఓ సారి తన సోదరి ఇంటికి వెళ్లింది. ఆమె భర్త జూలియో బంధువు కావడం, జూలియో కూడా అదే అపార్ట్‌మెంట్లో నివాసం ఉండడంతో 1934లో మొదటిసారిగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆపై ప్రేమ బంధంగా చిగురించింది. స్వతహాగా సాహితీ వేత్త అయిన జూలియో ప్రేమ కవిత్వాలు క్వింటెరస్‌ను కట్టిపడేస్తే.. అందం, అంతకుమించి దయార్థ్ర హృదయమున్న వాల్డ్రామినాను చూసి ఇట్టే ఆమెతో ప్రేమలో పడిపోయాడు జూలియో.
ప్రేమ బంధం పెళ్లితో అనుబంధంగా...
ఇక తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకోవాలనుకున్న ఆ ప్రేమ పక్షుల ఆశలకు వారి పెద్దలు, కుటుంబ సభ్యులు అడ్డుకట్టవేశారు. అయినా సరే పెద్దలను ఎదిరించి తమ ప్రేమను గెలిపించుకోవాలనుకున్న వారిద్దరూ ఇంట్లోంచి పారిపోయారు. ఏడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఆ లవ్‌బర్డ్స్ 1941 ఫిబ్రవరి 7న రహస్యంగా ఓ చర్చిలో పెళ్లి చేసుకున్నారు.
'అవే మా అన్యోన్య బంధానికి బాటలు వేశాయి'
అప్పటి నుంచి సుఖ దుఃఖాలను కలిసి పంచుకుంటూ కాపురం సాగిస్తున్న ఈ లవ్లీ కపుల్‌కు మొత్తం ఐదుగురు సంతానం. వీరంతా డిగ్రీ పట్టాలు సాధించి భార్యాపిల్లలతో ఉన్నతంగా స్థిరపడిన వారే. వీరితో పాటు 11 మంది మనవలు, మనవరాళ్లు, 21 మంది ముని మనవళ్లు, మనవరాళ్లు, 9 మంది ముని ముని మనవలు, మనవరాళ్లు ఉన్నారు.
వాళ్లు అంగీకరించలేదు...
‘మా వివాహానికి మా కుటుంబ సభ్యులెవరూ అంగీకరించలేదు. అయినా మేం వారిని ఎదిరించి ఒక్కటయ్యాం. మేమిద్దరం దగ్గరైనా మా కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మాకు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో పెళ్లయ్యాక మా బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలనుకున్నాం. ఇందులో భాగంగా పరస్పరం గౌరవించుకున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం..ఒకరి అభిరుచులను మరొకరు గ్రహించాం.