చాలా మందికి మేకప్ వేసుకోవడానికి ఉన్న ఓపిక తీయడానికి ఉండదు. కానీ మేకప్ తీయకుండా అలానే వదిలేస్తే చర్మం పొడిబారుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
ఐలైనర్, మస్కారా వంటివి కళ్ల అందాన్ని రెట్టింపు చేస్తాయనడంలో ఏ సందేహమూ లేదు. కానీ వాటిని ఎక్కువ గంటలు ఉంచుకుంటే కళ్ల నుంచి నీరు కారడం, ఎర్రగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పడుకునే ముందు కళ్లను శుభ్రంగా చన్నీళ్లతో కడిగేయండి. ఐ మేకప్ రిమూవర్‌తో తుడిచేయండి. అవేవీ లేనప్పుడు పచ్చిపాలల్లో దూదిని ముంచి తీసేయొచ్చు.
ముఖంపై ఉన్న మేకప్‌ని తొలగించుకోకుండా అలానే వదిలేస్తే ఆ వ్యర్థాలతో చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఓ వయసు దాటాకా రావాల్సిన ముడతలు ముందుగానే పలకరిస్తాయి. మొటిమలు, వైట్‌హెడ్, బ్లాక్ హెడ్స్ వంటివీ ఇబ్బందిపెడతాయి. ఇవేవీ కాకూడదంటే... రిమూవర్‌తో తొలగించుకోవాల్సిందే. ఆపై మాయిశ్చరైజర్ రాయడం మరిచిపోవద్దు సుమా! లేదంటే చర్మం పొడిబారుతుంది.
లిప్‌స్టిక్ మీ పెదాలపై ఉండే తేమను పీల్చుకుంటుంది. దీన్ని ఎక్కువసేపు అలానే వదిలేయడం వల్ల పొడిబారి పగిలిపోతాయి. అందుకే లిప్‌స్టిక్‌ని తుడిచేశాక కొద్దిగా తేనె రాసుకోండి.