తెలుగు సంవత్సరాది ఉగాది నాడు తినే షడ్రుచుల సమ్మేళనం కమ్మదనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పచ్చడి జీవిత సారాన్ని తెలియజేస్తుందని అనుకుంటాం. అయితే కమ్మనైన ఈ ఆరు రుచులు అందం, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అది ఎలాగో చూద్దాం.
తీపి... ఉగాది పచ్చడిలో వేసే బెల్లంలో మహిళల ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలెన్నో ఉన్నాయి. భోజనం తర్వాత తినే చిన్న బెల్లం ముక్క ఆహారాన్ని పూర్తిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. బెల్లంలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్స్‌తోపాటు జింక్, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ముఖంలో వృద్ధాప్య ఛాయలను త్వరగా రానివ్వవు. అంతేకాదు, జీవక్రియలను వేగవంతం చేసి, బరువు పెరగకుండా చేస్తుంది. రజస్వల అయినప్పటి నుంచి అమ్మాయిలతో రోజూ చిన్నబెల్లం ముక్కను తినిపిస్తే.. ఇందులోని ఐరన్ రక్తంలోని హీమోగ్లోబిన్‌ను వృద్ధి చేస్తుంది. నెలసరిలో కడుపునొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. గర్భిణుల్లో రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతుంది.
పులుపు:చింతపండు గుజ్జులో విటమిన్-సి తోపాటు పలు పోషకాలుంటాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో అమినోయాసిడ్స్, బీటాకెరొటిన్ పుష్కలంగా ఉండి, చర్మకణాలు, కంటిచూపును ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే వీటిలోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి. విటమిన్-బి నరాల వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. మెదడును చురుకుగా ఉంచుతుంది.
ఉప్పు: తగిన మోతాదులో వాడటం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జీవక్రియల్లో ప్రధానపాత్ర పోషించే థైరాయిడ్ బాగా పని చేసేందుకు అయోడిన్ అవసరం. అలాగే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. రక్తపోటు తగ్గకుండా పరిరక్షిస్తుంది.