ఈరోజుల్లో వ్యక్తిగత అభిరురులు లేదా చేసే వృత్తి ఉద్యోగాల రీత్యా బ్యూటీ ఉత్పత్తుల వాడకం తప్పనిసరైపోయింది. అయితే మిగిలిన ఉత్పత్తుల సంగతి పక్కన పెట్టి, కాసేపు కేశ సంబంధిత ఉత్పత్తుల గురించి మాట్లాడదాం. ఇవి ఉపయోగించిన కాసేపు జుట్టు చాలా అందంగా కనిపిస్తుంది. కానీ, అవి జుట్టుని మరింత బలహీనపరిచి చివర్లు చిట్లడం లేదా తెగిపోయేలా చేస్తాయి. ఇలా సగం సగం తెగిన వెంట్రుకలు మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ ప్రయత్నించాలని అనుకున్నా మీకు అడ్డంకిగా మారతాయి. అందుకే వీటికి ప్రత్యామ్నాయాలు పాటించడం తప్పనిసరి.
కెమికల్స్‌కి దూరంగా..
జుట్టు ఎదగడానికి అవసరమయ్యే పోషకాలను ఎప్పటికప్పుడు ఆహారం ద్వారానే కాకుండా బయట నుంచి కూడా అందిస్తూ ఉండాలి. అలాగే జుట్టు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా తప్పనిసరి. అంటే దుమ్ము, ధూళి, చుండ్రు.. ఇలాంటివేవీ లేకుండా జాగ్రత్తపడాలి. తలస్నానం చేసేటప్పుడు కూడా ఎంత మేరకు షాంపూ అవసరమో అంతే వినియోగించాలి. అయితే వీటిలో సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి. లేదంటే అవసరానికి మించి షాంపూ ఉపయోగించినప్పుడు దాని ప్రభావం జుట్టు మీద తప్పకుండా కనిపిస్తుంది. అందుకే రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తుల్ని ఎంత తక్కువ వాడితే జుట్టుకి అంత శ్రేయస్కరం.
తొందరగా ఆరాలని..
ఆఫీసుకి టైం అవుతోందనో, కాలేజీ బస్సు మిస్సవుతుందనో జుట్టు త్వరత్వరగా ఆరిపోవాలని డ్రయర్లు వాడుతూ ఉంటాం. అయితే వీటి వల్ల అప్పటికప్పుడు జుట్టు ఆరిపోయి మీ సమస్య పరిష్కారం అయిపోయినా.. మీకు అవి కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. అవేంటంటే అలాంటి ఉత్పత్తుల ద్వారా విడుదలయ్యే వేడి జుట్టుని మరింత బలహీనపరుస్తుంది. ఇక, తల దువ్వేటప్పుడు వెంట్రుకలు సగంలో తెగిపోవడం లేదా మొత్తానికి వూడిపోవడం జరుగుతుంది. కాబట్టి డ్రయర్లు, కర్లర్స్, స్ట్రెయిటనర్స్.. మొదలైన ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
జుట్టుని బిగుతుగా కట్టొద్దు..
కాలేజ్‌కు వెళ్లే అమ్మాయిలు లేదా ఆఫీసుకు వెళ్లే మహిళలు స్టైల్‌గా కనిపించడానికో లేక సమయాభావం వల్లనో ఎక్కువగా పోనీటైల్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ జుట్టంతా అలా బిగుతుగా లాగి బ్యాండ్ పెట్టడం వల్ల అవి కుదుళ్లలో చాలా బలహీనంగా అయిపోతాయి. జుట్టుపై ఒత్తిడి పెరిగి తెగిపోతుంది. కాబట్టి జుట్టుని సాధ్యమైనంత వరకు వదులుగానే ఉంచాలి. అలా వదులుగా ఉండే హెయిర్‌స్త్టెల్స్ ప్రయత్నించడమే ఉత్తమం.
చివర్లు ట్రిమ్ చేయాలి..
జుట్టు చివర్లను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి. కానీ, అలా కత్తిరించడం వల్ల జుట్టు పెరగదేమోనని చాలా మంది అనుకుంటారు. అది కేవలం ఒట్టి అపోహ మాత్రమే. జుట్టుని తరచుగా ట్రిమ్ చేస్తూ ఉండటం వల్ల చివర్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టుకు అవసరమయ్యే పోషణ సులభంగా అంది, ఎదుగుదల బాగుంటుంది. అందుకే జుట్టుని ట్రిమ్ చేయడానికి వెనుకాడద్దు.
బయట నుంచి పోషణ..
కేశాలు ఆరోగ్యంగా ఎదగాలంటే ఆహారం ద్వారా అందించే పోషకాలతో పాటు హెయిర్ మాస్క్‌ల ద్వారా కూడా బయట నుంచి పోషణ అందించాలి.
అలాంటి కొన్ని హెయిర్ మాస్క్స్:
కోడిగుడ్డు సొనతో..
కావాల్సినవి:
- కోడిగుడ్డు సొన - 1
- తేనె- ఒక చెంచా
- ఆలివ్ ఆయిల్- ఒక చెంచా
- క్యాస్టర్ ఆయిల్- ఒక చెంచా
- ఆర్గన్ ఆయిల్- ఒక చెంచా
తయారీ:
ముందు కోడిగుడ్డు సొన ఒక పాత్రలో వేసుకుని బాగా గిలకరించాలి. తర్వాత తేనె, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఆర్గన్ ఆయిల్ కూడా వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత మంచి షాంపూ, కండిషనర్‌తో జుట్టుని శుభ్రపరుచుకుంటే సరి.. నిగనిగలాడే కురులు సొంతమవుతాయి.
స్ట్రాబెర్రీలతో..
కావాల్సినవి:
- స్ట్రాబెర్రీలు- (మీ జుట్టు పొడవుని బట్టి సరిపడినన్ని)
- కొబ్బరినూనె- ఒక చెంచా
- తేనె- ఒక చెంచా