కొవిడ్ సమయంలో మహిళల ఉద్యోగ సంతృప్తి, మానసిక ఆరోగ్యం విపరీతంగా దెబ్బతిన్నాయన్నది డెలాయిట్ సంస్థ అధ్యయనంలో తేలింది. గత నవంబర్, ఈ ఏడాది మార్చిల్లో ఈ సర్వేను నిర్వహించారు.
Corona Effect : కరోనా వల్ల మహిళల్లో మానసిక ఒత్తిడి - stress for women due to lock down
కరోనాతో విధించిన లాక్డౌన్ వల్ల పాఠశాలలకు సెలవులివ్వడంతో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. అటు కొలువులు చేసే పురుషులూ వర్క్ ఫ్రం హోం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎటొచ్చి మహిళలకే ఇటు ఆఫీస్ వర్క్.. అటు ఇంటి పని.. మరోవైపు పిల్లల అల్లరి. కొవిడ్ వల్ల కార్యాలయాల్లో, ఇంట్లో మహిళలపై విపరీతమైన భారం పెరిగిందని ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపుతోందని డెలాయిట్ సంస్థ అధ్యయనంలో తెలుస్తోంది.
ప్రతి 10 మందిలో ఏడుగురు (69 శాతం) భారతీయ మహిళలు కొవిడ్‌కు ముందు తమ ఉద్యోగం చాలా బాగుందని లేదా బాగుందని చెప్పారు. కానీ ప్రస్తుతం 28 మాత్రమే ఈ సమాధానాన్ని మళ్లీ ఇవ్వగలిగారు. కొవిడ్ ముందుకీ, ఇప్పటికీ ఎంత భారీ మార్పో దీన్ని చూస్తే అర్థమవుతుంది. దాదాపు 10లో ఆరుగురు (57 శాతం) మహిళలు తమ కెరీర్‌లో ఆశించినంత వేగంగా వృద్ధి లేదని చెప్పారు. ఇది ప్రపంచ సగటు (42 శాతం) కంటే ఎక్కువ. ఎంచుకున్న ఉద్యోగాల పట్లా మునుపటి కంటే తక్కువ ఆశాజనకంగా ఉన్నారు. ఇది గ్లోబల్ శాంపిల్లో 51 శాతంతో సమానం.
26 శాతానికిపైగా భారతీయ మహిళలు ఉద్యోగాన్ని వదిలేయాలని ఆలోచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది 23 శాతముంది. పనిభారం, ఇంటి బాధ్యతల్లో పెరుగుదలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. కొద్ది శాతం సంస్థలు మాత్రమే తమ ఉద్యోగినులకు అవసరమైన వనరులను కల్పిస్తున్నాయి. ఎక్కువ జీతంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తున్నాయి. అధికారిక మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లు మహిళలకు అందిస్తున్నది చాలా తక్కువ (దేశీయంగా 17%, ప్రపంచవ్యాప్తంగా 22). అభివృద్ధి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా 22% ఉంటే మన మహిళలకు 16 శాతమే. పదోన్నతుల విషయంలో లింగ వివక్ష మన దగ్గర 15%, ప్రపంచవ్యాప్తంగా అది 19%. 38 శాతం మందికి మాత్రమే వివక్ష, వేధింపులపై ఎలా ఫిర్యాదు చేయాలన్న స్పష్టత ఉంది.