ఎటు చూసినా ప్రకృతి అందాలతో అలరారుతోన్న మయన్మార్‌లోని అతివల అందాలు వర్ణించతరమా..! తమ పూర్వీకులు పాటించిన సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులనే తామూ పాటిస్తూ.. వయసు వారిని మరిచిపోయిందేమో అన్నంత నవయవ్వనంగా మెరిసిపోతున్నారీ ముద్దుగుమ్మలు. మరి, మయన్మార్ సుందరాంగుల వెనకున్న ఆ సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకొని పాటించేద్దామా!
అవాంఛిత రోమాల్ని తొలగించే ‘తనకా’! అవాంఛిత రోమాల్ని తొలగించే ‘తనకా’..
తనకా.. దీన్ని మయన్మార్ మగువల ప్రత్యేక సౌందర్య సాధనంగా చెప్పచ్చు. ఇది పౌడర్ రూపంలో లభ్యమవుతుంది. అక్కడ ఎక్కువగా ఉండే ‘తనకా’ చెట్ల బెరడు నుంచి దీన్ని తయారుచేస్తారు. తనకా పొడికి రోజ్ వాటర్ లేదా సాధారణ నీటిని కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని అవాంఛిత రోమాలున్న, ముఖ శరీర భాగాల్లో అప్లై చేసుకొని బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మానికి సరైన తేమను అందించి మృదువుగా మార్చడంతో పాటు అవాంఛిత రోమాలకు శాశ్వతంగా చెక్ పెట్టచ్చంటున్నారు మయన్మార్ ముద్దుగుమ్మలు. ఇలా ఈ పొడిని అక్కడి మగువలే కాదు.. చిన్నపిల్లల్లో ఎదురయ్యే చర్మ సమస్యల్ని నివారించడానికి సైతం ఉపయోగిస్తుంటారు. ప్రకృతి వరంగా అందించే ఈ బెరడు వల్ల చర్మానికి ఎటువంటి హానీ ఉండదు. అలాగే అతినీలలోహిత కిరణాల వల్ల కందిపోయిన చర్మాన్ని పునరుత్తేజితం చేయడానికీ ఈ తనకా ఫేస్‌ప్యాక్ ఎంతగానో సహాయపడుతుంది. ఈ బ్యూటీ ట్రెడిషన్ ఈనాటిది కాదు.. పూర్వకాలం నుంచే ఈ తనకాను తమ సౌందర్య సాధనంగా మలచుకున్నారు అక్కడి మగువలు. అదే పద్ధతిని కొనసాగిస్తూ నేటి తరం అతివలు కూడా సంపూర్ణ సౌందర్యంతో మెరిసిపోతున్నారు.
‘తయా’తో కురులకు పోషణ..
పెరిగిపోతున్న కాలుష్యం ఓ పక్క.. కల్తీ సౌందర్య ఉత్పత్తులు మరోపక్క.. వీటన్నింటి మధ్య పొడవాటి జాలువారే కురులను కాపాడుకోవడం సవాలే. ఇలా జుట్టు విషయంలో ఎన్ని సమస్యలైనా ఎదుర్కొని తమ కేశ సంపదను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు మగువలు. ఇక దాని కోసం ఎన్నెన్నో ఖరీదైన నూనెలు, షాంపూలను వాడడానికీ వెనకాడరు. అయితే అలా అనవసరంగా ఖర్చు పెట్టే కంటే మయన్మార్ భామలు పాటించే ఈ చిట్కాను ఫాలో అయిపోండి. తయా అనే చెట్టు నుండి సేకరించిన బెరడును చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఆపై దాన్ని బాగా దంచి ఓ అరగంట పాటు నీళ్లలో నానబెడితే చాలు. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టుకు షాంపులా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు చుండ్రుతో ఇబ్బందిపడుతుంటే.. బెరడును నానబెట్టిన నీళ్లలో ఓ స్పూన్ నిమ్మరసం కలుపుకుని కురులకు పట్టిస్తే క్రమంగా చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. అంతేకాదు.. ఇది కేశాలకు సహజసిద్ధమైన కండిషనర్‌గా పనిచేసి జుట్టును మృదువుగా మారుస్తుంది. ఇలా కురులకు పోషణనందించడంలో తయా బెరడుకు సాటి మరొకటి లేదంటున్నారు మయన్మార్ ముద్దుగుమ్మలు.
ఆ పొడితో స్ర్కబ్బింగ్..
ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి మనం అనుసరించే బ్యూటీ ట్రీట్‌మెంట్ స్క్రబ్బింగ్. ముఖంపై పేరుకుపోయిన మృతకణాల్ని తొలగించి.. మోమును మృదువుగా మార్చడంలో ముందుంటుందీ సౌందర్య ప్రక్రియ. మరి దానికోసమే అందరికంటే భిన్నంగా కాస్త ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తున్నారు మయన్మార్ బ్యూటీస్. కిన్‌పున్ అనే చెట్టు నుండి సేకరించిన విత్తనాలను స్క్రబ్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. కాఫీ కలర్‌లో ఉండే ఆ గింజలను పొడిచేసి దాన్ని వారు స్నానమాచరించే సమయంలో స్క్రబ్‌లా వాడుతున్నారు. ఫలితంగా చర్మం లోపలి నుండి శుభ్రపడి మెరుపును సంతరించుకుంటుంది. దీనితో పాటు నల్లగా నిగనిగలాడే కురులు కావాలనుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకోసం ముందుగా ఈ కిన్‌పున్ చెట్టు గింజలను నీళ్లలో ఉడికించి.. ఆపై చల్లారాక వడకట్టాలి. ఇప్పుడు ఆ నీటిలో షాంపూ కలుపుకుని తలస్నానం చేయడం వల్ల ఇది జుట్టుకు సహజసిద్ధమైన కలర్‌ని అందిస్తుంది. ఇలా ఈ గింజలు అటు చర్మ సౌందర్యాన్ని, ఇటు కేశ సౌందర్యాన్ని ఏకకాలంలో ఇనుమడిస్తాయి.
ఆహారంతో సొంతమయ్యే సౌందర్యం! ఆహారంతో సొంతమయ్యే సౌందర్యం..
ప్రకృతి ప్రసాదించిన సౌందర్య ఉత్పత్తులతో పాటు మనం తీసుకునే సమతులాహారం కూడా మన అందాన్ని ద్విగుణీకృతం చేస్తుందంటున్నారు మయన్మార్ భామలు. అలాగని కేవలం శాకాహారం తీసుకోవడమో, లేదంటే నచ్చినవన్నీ పక్కనపెట్టేయడమో కాకుండా.. తాము పాటించే ఆహారపుటలవాట్లు తమకు అందంతో పాటు నాజూకైన శరీరాకృతినీ అందిస్తున్నాయంటున్నారు వారు. ఈ క్రమంలో వారు తినే రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా సీ-ఫుడ్ (చేపలు, రొయ్యలు వంటివి) ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల శరీరానికి కావాల్సిన మాంసకృతులు అందడంతోపాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా తగ్గుముఖం పడుతుంది. ఇలా వీరు సీ-ఫుడ్‌ని రోజూ స్టిక్కీ రైస్‌తో పాటు తీసుకుంటుంటారు. ఈ రైస్‌లో కార్బోహైడ్రైట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వారు బరువును కూడా అదుపుచేసుకోగలరు. ఇటువంటి చక్కని ఆహార నియమాలు పాటించడం కూడా వారి బ్యూటీ పద్ధతుల్లో ఒక భాగం. ఇలా నిత్యనూతనంగా.. నవయవ్వనంగా కనిపించడంలో వారు పాటించే ఆహార నియమాల పాత్ర కూడా ఎంతో కీలకం అని చెప్పడంలో సందేహం లేదు.
నూనెలతో మెరుపు..
చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు.. మచ్చలేని చందమామ లాంటి మెరుపును సొంతం చేసుకోవాలంటే.. శరీరానికి తేమను అందించడం చాలా అవసరం. దాని కోసం నూనెను మించిన మాయిశ్చరైజర్ లేదంటున్నారు బర్మీస్ ఉమెన్. దానికోసం ఆర్గాన్ నూనె, టీట్రీ నూనెలను ఉపయోగిస్తున్నారు. స్నానమాచరించడానికి ముందు.. లేదా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఈ నూనెల్లో ఏదో ఒక దాంతో శరీరానికి మర్దన చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల నూనె శరీరంలోకి బాగా ఇంకిపోతుంది. ఆపై గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే సరి. మీ చర్మం ఎంతో ఆరోగ్యంగా, మెరుస్తూ, నవయవ్వనంగా మారడం ఖాయం అంటున్నారు వారు. ఇది ఎంతో సాధారణమైన చిట్కానే అయినా.. దీని ఫలితం మాత్రం అమోఘమని తమ స్వీయానుభవంతో చెప్తున్నారీ అతివలు.
ఇదీ చదవండి:మీకు తెలుసా...? తులసితో తళతళలాడే అందం!