తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

సిజేరియన్‌ గురించి మీలోనూ ఈ అపోహలున్నాయా?! - health tips in telugu

సుఖ ప్రసవంలో నొప్పులు భరించలేకో, వివిధ రకాల అనారోగ్యాల వల్లో (కాంప్లికేటెడ్‌ ప్రెగ్నెన్సీ) ప్రస్తుతం చాలామంది మహిళలకు సిజేరియన్‌ కాన్పులే అవుతున్నాయి. అయితే ఈ తరహా ప్రసవం జరిగినప్పుడు కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందని, ఆపైనా దీర్ఘకాలంలో పలు సమస్యలు తలెత్తుతాయని చాలామంది అనుకుంటారు. కానీ అవన్నీ అపోహలేనని కొట్టిపారేస్తున్నారు నిపుణులు. సిజేరియన్‌ అయినా నార్మల్‌ డెలివరీ అయినా తిరిగి మునుపటి స్థితికి రావడమనేది మనం తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంటుందంటున్నారు.

Cesarean‌
సిజేరియన్‌ గురించి మీలోనూ ఈ అపోహలున్నాయా?!

By

Published : May 4, 2021, 11:21 AM IST

  • భార్గవి ఇప్పుడు ఏడు నెలల గర్భిణి. ప్రస్తుతం రెండోసారి గర్భం ధరించిన ఆమె.. మొదటిసారి సహజ ప్రసవానికే మొగ్గు చూపింది. కానీ కొన్ని అనారోగ్యాల వల్ల సిజేరియన్‌ అయింది. దాంతో ఈసారి కూడా సి-సెక్షన్‌ ఖాయమనుకుంటోంది.
  • ఏడాది క్రితం సిజేరియన్‌ ద్వారా బాబుకు జన్మనిచ్చిన పావనికి ఈ మధ్య విపరీతమైన నడుంనొప్పి వేధిస్తోంది. దీనికి కారణం సి-సెక్షన్‌ అనుకుంటోంది.

మొదటిసారి సిజేరియన్‌ అయితే రెండోసారీ ఇలాగే కాన్పు అవుతుంది.

ఇది ముమ్మాటికీ అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మొదటిసారి ఆపరేషన్‌ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినా రెండోసారి నార్మల్‌ డెలివరీ అయిన మహిళలు చాలామంది ఉన్నారంటున్నారు. అయితే ఇది పూర్తిగా వారి ఆరోగ్య స్థితిపైనే ఆధారపడుతుందట! ఎలాంటి అనారోగ్యాలు లేకపోతే రెండోసారి నార్మల్ డెలివరీ జరగచ్చు.. ఈ క్రమంలో ఒక్కోసారి కుట్ల తాలూకు మచ్చ డ్యామేజ్‌ అయ్యే ప్రమాదమూ ఉందంటున్నారు. ఏదేమైనా రెండో కాన్పు విషయంలో ఏ సందేహాలున్నా డాక్టర్‌ వద్ద నివృత్తి చేసుకొని వారి సలహా మేరకు నిర్ణయం తీసుకోవడం మంచిది.

వెన్నెముకకు ఇచ్చే మత్తు ఇంజెక్షన్‌ వల్ల దీర్ఘకాలంలో నడుంనొప్పి వస్తుంది.

ఇది చాలామందిలో ఉండే అపోహ. ఎందుకంటే ఆపరేషన్‌ అయినప్పుడే కాదు.. సుఖ ప్రసవం అయినా కొంతమందిలో నడుంనొప్పి వేధిస్తుంటుంది. దీనికంతటికీ కారణం.. డెలివరీ తర్వాత బాలింతలు కూర్చొనే భంగిమలే! వంగిపోయి కూర్చోవడం, చేరగిలబడడం.. ఇలాంటి భంగిమల వల్ల లోయర్‌ బ్యాక్‌పై ప్రతికూల ప్రభావం పడి.. తద్వారా నడుంనొప్పి వచ్చే అవకాశం ఉందట! అందుకే నిల్చున్నా, కూర్చొని బిడ్డకు పాలిచ్చినా నడుం నిటారుగా ఉండేలా చూసుకుంటే సమస్య ఉండదంటున్నారు నిపుణులు.

సి-సెక్షన్‌ కంటే సుఖ ప్రసవంలో ఎక్కువ నొప్పిని భరించాల్సి వస్తుంది.

ఈ రెండు కాన్పులూ నొప్పితో కూడుకున్నవే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే సిజేరియన్‌ సమయంలో మత్తు మందు ఇస్తారు కాబట్టి అప్పుడు నొప్పి తెలియకపోయినా దాని ప్రభావం తగ్గిపోయాక నొప్పిగా అనిపిస్తుంటుంది. అదే సహజ ప్రసవంలోనూ Perineum (వెజైనాకు ఇరువైపులా కట్‌ చేయడం) చేస్తారు. కాబట్టి ఈ కాన్పులోనూ నొప్పిని భరించాల్సిందే! ఇలా ఈ రెండు కాన్పుల్లో నొప్పి తగ్గిపోవాలంటే సుమారు 10 రోజులు సమయం పడుతుందట!

సిజేరియన్‌ అయితే తల్లిపాలు త్వరగా ఉత్పత్తి కావు.

సుఖ ప్రసవమైనా, ఆపరేషన్‌ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినా వక్షోజాల్లో పాల ఉత్పత్తి ఒకేలా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో డెలివరీ అయిన వెంటనే బిడ్డకు పాలివ్వచ్చంటున్నారు. అయితే సిజేరియన్‌ కోసం సాధారణ అనస్తీషియా ఇస్తే.. తల్లీబిడ్డలిద్దరిలో ఆ మత్తు వదలడానికి కొన్ని గంటలు సమయం పడుతుంది. అదే వెన్నెముకకు మత్తు ఇస్తే.. బిడ్డ పుట్టిన వెంటనే ఆపరేషన్‌ థియేటర్‌లోనే పాలివ్వచ్చట! కొంతమంది తల్లుల్లో ఎలాంటి కాన్పు జరిగినా పాలు సరిగ్గా ఉత్పత్తి కావు. అలాంటప్పుడు డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుతూ చక్కటి పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది.

ఆపరేషన్‌ అయితే తక్కువ బ్లీడింగ్‌ అవుతుంది.

సహజ ప్రసవం ద్వారా బ్లీడింగ్‌ ఎక్కువగా అవుతుంది.. ఇది చాలా రోజుల పాటు కొనసాగుతుంది.. అదే సిజేరియన్‌లో దీని తీవ్రత అంత ఉండదు అనుకుంటుంటారు చాలామంది. కానీ ఇది నిజం కాదు.. బ్లీడింగ్‌ అనేది డెలివరీ అయ్యే విధానంపై ఆధారపడి ఉండదని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా ఏ ప్రసవమైనా సుమారు ఆరు వారాల దాకా రక్తస్రావం అవుతుందట! అయితే అంతకంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్‌ కొనసాగినా, దాంతో పాటు ఇతర వెజైనల్‌ డిశ్చార్జి, దుర్వాసన, మంట.. వంటి సమస్యలున్నా ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించడం తప్పనిసరి!

అది సుఖ ప్రసవమైనా, సహజ కాన్పు అయినా.. త్వరగా కోలుకోవాలంటే చక్కటి పోషకాహారంతో పాటు, సుఖ నిద్ర, నిపుణుల సలహా మేరకు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఈ చిట్కాలు దీర్ఘకాలంలో ఇతర అనారోగ్యాల బారిన పడకుండా తల్లుల్ని కాపాడతాయని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి అనవసర అపోహలు పెట్టుకోకుండా అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ.. ఆరోగ్యంగా ముందుకు సాగమంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details