నెలసరిపై ఓ 20ఏళ్ల యువతి అవగాహన కల్పిస్తోంది. ఆ సమయంలో అవసరమైన ఉత్పత్తులను అందిస్తూ ఓ ఎన్జీవోను ఏర్పాటు చేసింది. ఆమే సంజనా దీక్షిత్. తన పదహారో పుట్టినరోజును ఓ ఎన్‌జీవోలో నిర్వహించుకోవడానికి వెళ్లింది సంజనా. అక్కడ అపరిశుభ్రంగా ఉన్న టాయ్‌లెట్‌లు, నిర్వహణ సరిగా లేని గదులు చూసి షాక్‌కు గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎలా జీవించగలుగుతారని తీవ్ర ఆవేదనకు లోనైంది. ఆ సమయంలో కొందరు అమ్మాయిలు నెలసరి రోజుల్లో స్కూలు, కాలేజ్‌లకు దూరమవ్వడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, మూఢనమ్మకాలు వంటి విషయాలపై వార్తాపత్రికలో కథనం చదివాక ఈ విషయాలపై యువతులకు అవగాహన కల్పించాలనుకుంది. మొదట తను వెళ్లిన ఎన్‌జీవోకే వెళ్లి నిర్వాహకులతో మాట్లాడి... అక్కడి అమ్మాయిలకు అవసరమైన శానిటరీ న్యాప్కిన్లను అందించాలనుకుంది. తెలిసినవారు, బంధువులు, స్నేహితుల నుంచి నిధులు సేకరించింది. రూ.15వేల లక్ష్యంతో మొదలుపెడితే రూ.50 వేలు వసూలయ్యాయి. వాటితో ప్యాడ్‌లను కొని బెంగళూరులోని వివిధ ఎన్‌జీవోలకు అందించింది.
'రుతుచక్ర' సేవలు
కేవలం శానిటరీ న్యాప్కిన్లకే పరిమితమైతే సరిపోదనిపించిందామెకు. గైనకాలజిస్టులతో మాట్లాడి ముందుగా తను పూర్తి అవగాహన తెచ్చుకుంది. ఆ తర్వాత ‘రుతుచక్ర’ పేరిట సంస్థను ప్రారంభించింది. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు అపరిశుభ్రత కారణంగా వచ్చే జబ్బులు, దానిపై ఉన్న అపోహలు, గర్బధారణ సమస్యలపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశం. మొదట ఎన్‌జీవోల్లో వర్క్‌షాప్‌లను నిర్వహించింది. క్రమంగా చుట్టూ ఉన్న గ్రామాలకూ విస్తరించింది. బోధనలా ఉంటే వినడానిక్కూడా ఇష్టపడరని గ్రహించింది. వాళ్లతో మాట్లాడుతూ, చర్చిస్తూ అవగాహన కల్పించేది. మొదట్లో కుటుంబ సభ్యులే సాయం చేసేవారు. తర్వాతర్వాత ఎంతోమంది వాళ్లే వచ్చి చేరడం మొదలుపెట్టారు. ఇప్పటివరకూ పదిలక్షలకుపైగా శానిటరీ ప్యాడ్‌లు, టాంపూన్‌లను అందించింది. దాదాపుగా 10వేల మందికి వీటిపై అవగాహన కల్పించింది. కొవిడ్ సమయంలోనూ దీన్ని కొనసాగించింది.