తొమ్మిది నెలల పాటు కడుపులో బిడ్డను, వూహల్లో వారి రూపును చూసుకుని మురిసిపోతుంది గర్భం ధరించిన ప్రతి మహిళ. ఇక తొమ్మిదో నెల మొదలైనప్పట్నుంచి ఎప్పుడెప్పుడు బిడ్డను కళ్లారా చూసుకుందామా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రసవం అయిన తర్వాత పండంటి బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని గుండెలకు హత్తుకోవడం ద్వారా తన ప్రేమాభిమానాలను బిడ్డకు తెలియజేస్తుంది ఆ తల్లి. అంతేనా.. పాల రూపంలో తన శక్తినంతా బిడ్డకు ధారపోస్తుంది. అయితే తల్లిపాల విషయంలో కూడా రకరకాల అపోహలు మనం వింటూనే ఉంటాం. వాటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియక కొందరు వాటికే ప్రాధాన్యం ఇస్తూ పాటిస్తుంటారు. కానీ అలా చేయడం తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. ఇంతకీ తరచూ వినే ఆ అపోహలు, వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలుసుకుందాం రండి..
- వక్షోజాలు చిన్నవిగా ఉంటే బిడ్డ తాగేందుకు సరిపడా పాలు ఉత్పత్తి కావు..!
ఇది పూర్తిగా అపోహ మాత్రమే. వాస్తవానికి బిడ్డ తాగేందుకు సరిపడా పాలు ఉత్పత్తి కావడానికి, తల్లి వక్షోజ పరిమాణానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వక్షోజ పరిమాణం కేవలం కొవ్వుతో కూడుకున్న కణజాలంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కానీ పాల ఉత్పత్తికి అవసరమయ్యే కణజాలం (ఫంక్షనల్ టిష్యూ) వేరేగా ఉంటుంది. గర్భం ధరించింది మొదలు ఈ కణజాలం కూడా మెల్లగా వృద్ధి చెందుతూ ప్రసవం అయ్యే సమయానికి పాల ఉత్పత్తికి అనుగుణంగా మారుతుంది. కాబట్టి బిడ్డకు సరిపడా పాల ఉత్పత్తి కావడానికి, వక్షోజాల పరిమాణానికి ఎలాంటి సంబంధం ఉండదని గుర్తించాలి.
- ఛాతీకి ఇన్‌ఫెక్షన్ ఉన్నవారు బిడ్డకు పాలు ఇవ్వకూడదు..
ఇది ఎంతమాత్రం నిజం కాదు. ప్రసవం సమయానికి కొందరు మహిళల్లో చనుమొనలు బాగా నల్లగా మారడం, వాటి చుట్టూ ఉన్న చర్మం కాస్త రఫ్‌గా అయినట్లు ఉండడం, అలాగే చనుమొనలు కాస్త నొప్పిగా అనిపించడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఒక్కసారి బిడ్డకు పాలు పట్టడం ప్రారంభించిన తర్వాత ఇవన్నీ క్రమేపీ వాటంతటవే సర్దుకుంటాయి. కొందరు మహిళల్లో కొన్ని క్షీరనాళాలు మూసుకుపోవడం లేదా ఛాతీ ఇన్‌ఫెక్షన్.. వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇటువంటప్పుడు బిడ్డకు పాలివ్వకూడదని చాలామంది చెబుతారు. కానీ బిడ్డకు పాలివ్వడం వల్ల ఇన్‌ఫెక్షన్ తగ్గడమే కాదు.. మూసుకుపోయిన క్షీరనాళాలు సైతం వాటంతటవే తెరుచుకుంటాయి. అంటే తల్లి ఎంత ఎక్కువగా బిడ్డకు పాలిస్తే అంత ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి.
- కొత్తగా తల్త్లెన మహిళల్లో సరిపడా పాలు ఉత్పత్తి కావు..
ఇది కేవలం అపోహ మాత్రమే. సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు తాగే పాలు చాలా తక్కువ మోతాదులోనే ఉంటాయి. వారికి తల్లిపాలు తప్ప మరేమీ సులభంగా జీర్ణం కావు. అయితే వారి జీర్ణాశయం చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ప్రతి రెండు గంటలకు ఓసారి కొద్దికొద్ది మోతాదులో తల్లి పాలు పడితే సరిపోతుంది. ఈ క్రమంలో ప్రసవం తర్వాత ఉత్పత్తి అయ్యే పాలు బిడ్డ కడుపు నిండడానికి నిరభ్యంతరంగా సరిపోతాయి. అయితే తొలి మూడు లేదా నాలుగు రోజుల పాటు వచ్చే ముర్రుపాలు బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా ఆవశ్యకం. ఇవి తక్కువగానే ఉత్పత్తి అయినప్పటికీ బిడ్డకు సరిపోతాయి. వీటి తర్వాత వచ్చే పాలు కూడా బిడ్డకు ఎంత ఎక్కువగా పడితే అంత ఎక్కువగా మళ్లీ ఉత్పత్తి అవుతూ ఉంటాయి.
- బిడ్డకు పాలిచ్చినన్ని రోజులు గర్భం ధరించే అవకాశాలుండవు..