ఉత్తరప్రదేశ్ మహిళా శిక్షక్ సంఘ్ నెలసరిలో మహిళల సమస్యలపై గళమెత్తింది. ప్రతి నెలా నెలసరి సెలవులను కేటాయించాలంటూ ఆ సంస్థ అధ్యక్షురాలు సులోచనా మౌర్య ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు అనామిక చౌదరిని కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సెలవులను ప్రత్యేకంగా పరిగణించాలని, మిగతా వాటితో కలపకూడదని కోరింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ ఈ సౌకర్యాన్ని కల్పించాలంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి...
దేశంలో పలు ప్రైవేటు సంస్థలు నెలసరి సెలవులను ఇస్తున్నాయని, యూపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని కోరింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళతానని అనామిక చౌదరి చెప్పింది. ఆ మూడు రోజులూ ఎంత అసౌకర్యంగా ఉన్నా నిలబడి విధులు నిర్వహించే మహిళా ఉపాధ్యాయుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఈ సెలవులను ఆచరణలోకి తేవడానికి కృషి చేయాలని కోరింది.