భాగ్యనగరంలో బతుకు బండి నడవాలంటే దంపతులిద్దరూ కష్టపడాల్సిందే. అటు ఆఫీసు పని, ఇటు ఇంటి పని చేసుకుంటూ ముందుకెళ్లడంలో మహిళలదే కీలకపాత్ర. సమతూకం పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. ఉదయాన్నే ఇంటి పని చక్కబెట్టుకుని భర్తను ఆఫీసుకు పంపి...తనూ ఆఫీసుకు వెళ్లి..అక్కడి నుంచే పిల్లల ఆన్‌లైన్ పాఠాలను పర్యవేక్షిస్తూ సవ్యసాచిలా అన్ని పనులు చక్కబెట్టాలి. కరోనా కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడం, ఎక్కువ కాలం ఇంటి వద్దే ఉండటంతో చాకిరీ పెరిగింది. ఆఫీసు పని, ఇంటిపని మధ్య సమతూకం పాటించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా మంది మహిళలు అనారోగ్యం బారిన పడుతున్నట్లు ‘ఎమ్‌క్యూర్ ఫార్మాస్యూటికల్స్ ‘ఇండియన్ ఉమెన్స్ హెల్త్ రిపోర్ట్-2021’లో తాజాగా వెల్లడించింది. హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబయి, పుణె నగరాల్లో 1000 మంది మహిళలను ప్రశ్నించగా ఈ విషయం వెల్లడైంది. చాలా మంది మహిళలు పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, గర్భధారణ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారని...సమస్యలు చెప్పుకోలేక చాలా మంది ఉద్యోగాలు వదిలేశారని పేర్కొన్నారు.
- నగరంలో ఉద్యోగినులు 30%
- కరోనాకు ముందు రోజులో ఆఫీసు పని 7 గంటలు
- ఇంటి పని 4.2 గంటలు
- ఆరోగ్యంపై అవగాహన లేనివారు 71%
- వ్యక్తిగత ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నవారు 52%
- కుటుంబ నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నవారు 41%