తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అమ్మ మనసు హాయిగా... కడుపులో బిడ్డ చల్లగా! - pregnants should not go into depression

ఏదో కోల్పోయిన భావన! ఎవరు పలకరించినా.. తెలియని విసుగు... పైగా అలసట... వీటన్నిటి ఫలితంగా భావోద్వేగాలు అదుపు చేయలేకపోతుంటారు. ఇలాంటి లక్షణాలు మనలో కొన్నిసార్లు కనిపిస్తుంటాయి. ఇది తీవ్రమైతే కుంగుబాటుగా గుర్తించాలి. ఈ పరిస్థితి గర్భిణుల్లో కనిపిస్తే... మరింత జాగ్రత్తగా ఉండాలి. అసలు దీనివల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలు చెబుతున్నారు గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ వై.సవితాదేవి.

ladies should not suffer depression during pregnancy
అమ్మ మనసు హాయిగా... కడుపులో బిడ్డ చల్లగా!

By

Published : Jul 9, 2020, 1:35 PM IST

కుంగుబాటు (డిప్రెషన్‌) మహిళల్లో ఏ దశలోనైనా కనిపించవచ్చు. ఇందుకు సామాజిక, వ్యక్తిగత కారణాలతో పాటు కొన్నిసార్లు శారీరక, హార్మోన్ల మార్పులూ కారణమవుతాయి. గర్భిణీల్లో దాదాపు 10 నుంచి 25 శాతం మంది డిప్రెషన్‌కు లోనవుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. కుంగుబాటుకు గురవుతున్న విషయాన్ని వెంటనే గుర్తించి... దాన్నుంచి బయటపడాలి. లేకపోతే తల్లితోపాటు గర్భస్థ శిశువుపైనా దుష్ప్రభావం పడుతుంది.

కారణాలేంటంటే..

గర్భం దాల్చినప్పుడు హార్మోన్ల ఉత్పత్తిలో తేడాల వల్ల శారీరకంగా, మానసికంగా చాలా మార్పులొస్తాయి. కాన్పు సవ్యంగా జరుగుతుందా? బిడ్డకు ఏమైనా ప్రమాదం జరుగుతుందా? ఇలా.. ఎన్నెన్నో అనుమానాలుంటాయి. గృహహింస, ఒంటరితనం లాంటివి కుంగుబాటుకు గురిచేస్తాయి. మొదట్నుంచీ భావోద్వేగ సమస్యలు, యాంగ్జైటీ డిజార్డర్స్‌, ప్రీమెనుస్ట్రువల్‌ డిస్ఫోరిక్‌ డిజార్డర్‌ (పీఎమ్‌డీడీ) ఉన్న స్త్రీలలో గర్భం దాల్చినప్పుడు ఈ పరిస్థితి రావొచ్చు. ముందునుంచి వాడుతున్న మందులను గర్భం వల్ల మానేస్తే సమస్య తీవ్రం కావొచ్చు.

గుర్తించడమెలా..

గర్భిణుల్లో మొదటి మూడు నెలల్లో మూడ్‌ స్వింగ్స్‌, నిద్ర పట్టకపోవడం, అలసట, తినాలనిపించకపోవడం, రుచులు మారిపోవడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అది కుంగుబాటు అవునో.. కాదో.. స్వీయ పరీక్షతో అంచనాకు రావాలి. గడిచిన నెల రోజుల్లో చాలా విచారంగా, జీవితం మీద ఎలాంటి ఆశా లేదనిపించే ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టాయా? ఎంత ఇష్టమైన పనిచేసినా సంతోషం కలగడం లేదా? వీటికి సమాధానం అవును అయితే మీరు కుంగుబాటుకు గురవుతున్నట్టే! ఇలాంటప్పుడు శారీరకంగానూ కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. త్వరగా అలసిపోవడం, ఆకలి లేకపోవడం, నిద్రలేమి, ఆత్మనూన్యత.. ఇవన్నీ కుంగుబాటుకు దారితీసే లక్షణాలుగా గుర్తించాలి.

ఇలా బయటపడండి..

సమస్యను ఆదిలోనే గుర్తించగలిగితే.. మందుల అవసరం లేకుండానే పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు. ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులను సంప్రదించాలి. కౌన్సెలింగ్‌, కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ (సీబీటీ), ఇంటర్‌ పర్సనల్‌ సైకో థెరపీ (ఐపీటీ) వంటివాటిని ఎంచుకుంటారు వైద్యులు. చాలావరకూ వీటివల్ల ఉపశమనం కలుగుతుంది. ఇవి కాకుండా కొన్నిరకాల వ్యాయామాలు, ఆక్యుపంక్చర్‌ విధానాలు సూచిస్తారు. డిప్రెషన్‌ ఎక్కువగా ఉంటే.. యాంటీ డిప్రెసెంట్‌ మందులు సూచిస్తారు. సాధారణంగా కుంగుబాటుకు వాడే మందులన్నీ గర్భవతులు వాడటం వీలు కాకపోవచ్చు. అవి శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందుకే డాక్టర్లు మందుల అవసరం లేకుండా ప్రయత్నిస్తారు. తప్పనిసరైతేనే మందులిస్తారు.

మందులు వాడితే...

యాంటీ డిప్రెసెంట్స్‌ వాడితే బిడ్డలో అవకరాలు ఏర్పడటం, గర్భస్రావం, నెలలు నిండకుండానే కాన్పు, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు ఎదురవ్వొచ్చు. బిడ్డపై ప్రభావం చూపించకుండా డాక్టర్లు ఈ సమయంలో కుంగుబాటు తగ్గించడానికి టీసీఏస్‌ (ట్రైసైక్లిక్‌ యాంటీ డిప్రెసెంట్స్‌), ఎస్‌ఎస్‌ఆర్‌ఐ (సెలెక్టివ్‌ సెరో టానిన్‌ రీ అప్టేక్‌ ఇన్‌హిబిటర్‌) అనే రెండు రకాల యాంటీ డిప్రెసెంట్‌ మందులు వాడతారు. వీటివల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. లిథియం లాంటి మందుల వల్ల తల్లీకీ, బిడ్డకు ప్రమాదం కొంచెం ఎక్కువ. కాబట్టి సాధారణంగా ఎంతో అవసరమైతే తప్ప గర్భవతులకు ఈ మందులు ఇవ్వరు.

సైకియాట్రిస్ట్‌ను ఎప్పుడు కలవాలి?

విపరీతమైన డిప్రెషన్‌ వల్ల కొందరిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తుంటాయి. తన గురించి, కడుపులోని బిడ్డ గురించి ఏ మాత్రం శ్రద్ధ తీసుకోనప్పుడు, సైకోటిక్‌ అండ్‌ మానిక్‌ బిహేవియర్‌లోకి వెళ్లినప్పుడు, సైకోసిస్‌ హిస్టరీ, సూసైడ్‌ హిస్టరీ ఉన్నప్పుడు.. మానసిక వైద్యులను కలవాలి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details