కీర్తన తన అధిక బరువును తగ్గించుకోవడానికి బరువులెత్తే వ్యాయామాలు ఎంచుకుంది. అయితే ఈ వ్యాయామాలు మహిళలకు మంచివి కాదని ఇంట్లో వాళ్లు చెప్పడంతో ఆ ఆలోచన మానుకుంది.
బరువులెత్తే వ్యాయామాలు ఎంచుకుంటే తనకూ పురుషుల్లా కండలు తిరిగిన దేహం వస్తుందేమోనని భయపడి ఈ వర్కవుట్స్ జోలికే వెళ్లట్లేదు శృతి.
ఇలా బరువులెత్తే వ్యాయామాలంటే.. అవి కేవలం పురుషులకు మాత్రమే పరిమితమనుకుంటారు చాలామంది. కానీ మహిళలకూ వీటి వల్ల ఫిట్‌నెస్ పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. శరీరంలోని అనవసర కొవ్వులు కరిగించడం దగ్గర్నుంచి మానసిక దృఢత్వం దాకా, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం దగ్గర్నుంచి చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకునే దాకా.. ఇలా ఈ వ్యాయామాలతో బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయట! అయితే ఇన్ని తెలిసినా కొంతమందిలో బరువులెత్తే వ్యాయామాలపై ఇంకా పలు సందేహాలు, అపోహలు నెలకొన్నాయి. అలాంటి కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు వాస్తవాల గురించి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..
* బరువులెత్తితే సిక్స్ ప్యాక్ బాడీ వస్తుంది.
మహిళల విషయంలో ఇది ముమ్మాటికీ అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కండరాల సామర్థ్యం పెంచి చక్కటి దేహ దారుఢ్యాన్ని అందించడంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ పాత్ర కీలకం. ఇది మహిళలతో పోల్చితే పురుషుల్లో 14 నుంచి 20 రెట్లు అధికంగా ఉంటుందట! కాబట్టి మందులు, స్టెరాయిడ్స్, సప్లిమెంట్లు.. వంటివి వాడితే తప్ప కేవలం బరువులెత్తడం వల్ల మనలో కండలు తిరిగిన దేహ దారుఢ్యం వచ్చే అవకాశమే లేదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. వయసు పెరుగుతున్న కొద్దీ మనలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు క్రమంగా తగ్గిపోతుంటాయి. దీనివల్ల ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. ఈ సమస్య తలెత్తకూడదంటే బరువులెత్తే వ్యాయామాల్ని రోజువారీ వర్కవుట్ రొటీన్‌లో భాగం చేసుకోమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజూ ఐదు నుంచి ఏడు కిలోల దాకా బరువులెత్తడం సురక్షితం అంటున్నారు.
* కొన్నాళ్లకు బరువులెత్తడం ఆపేస్తే కండరాలు కొవ్వుగా మారతాయి.
కండరాలు కొవ్వుగా మారడం, కొవ్వు కండరాలుగా మారడం అసలు జరగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే కండరాల కణజాలాలు, కొవ్వు కణజాలాలు వేర్వేరు నిర్మాణాలను కలిగి ఉంటాయని, ఈ రెండూ పరస్పరం మార్పు చెందవని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే కండరాలు శరీరంలోని కొవ్వు కణజాలాల్ని కరిగించడంలో సహకరిస్తాయట! అయితే ఒకవేళ సడెన్‌గా బరువులెత్తడం ఆపేసినట్లయితే అప్పటిదాకా బిగుతుగా, దృఢంగా ఉన్న కండరాలు క్రమంగా బలహీనమైపోతుంటాయి. తద్వారా శరీరాకృతిలో మార్పు కనిపిస్తుంది. అందుకే ఏదైనా సమస్య ఉంటే తప్ప బరువులెత్తడం ఆపకూడదంటున్నారు నిపుణులు. తద్వారా అటు శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు.. ఇటు ఫిట్‌గానూ ఉండచ్చు.
* కీళ్ల నొప్పులుంటే బరువులెత్తకూడదు..
ఇదీ చాలామందిలో ఉన్న ఓ అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కీళ్లు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు.. వారు ఎత్తగలిగినంత బరువును రోజూ నాలుగు నెలల పాటు ఎత్తినట్లయితే.. వారిలో నొప్పి దాదాపు 43 శాతం తగ్గినట్లు జర్నల్ ఆఫ్ రుమటాలజీలో ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు.. బరువులెత్తని వాళ్లతో పోల్చితే ఇలాంటి వారు తమ రోజువారీ పనుల్ని సైతం ఎంతో చురుగ్గా చేసుకుంటారట! అంటే.. ఒకరకంగా బరువులెత్తే వ్యాయామాలతో కీళ్లకు చక్కటి వ్యాయామం అంది అవి మరింత దృఢమవుతాయంటున్నారు నిపుణులు. అందుకే డాక్టర్ సలహా మేరకు కీళ్ల నొప్పులున్న వారూ బరువులెత్తే వ్యాయామాలను సాధన చేయచ్చు.. అయితే అది కూడా మీరు ఎత్తగలిగినంత, మీకు సౌకర్యంగా ఉన్నంత వరకే అని గుర్తుపెట్టుకోండి.
* ఈ వ్యాయామాలతో బీపీ పెరుగుతుంది.
బరువులెత్తే క్రమంలో రక్తపోటు పెరుగుతుంది కాబట్టి బీపీ సమస్య ఉన్న వారు ఈ వ్యాయామాలకు దూరంగా ఉండమని డాక్టర్లు సాధారణంగా సలహా ఇస్తుంటారు. అయితే నిజానికి ఏరోబిక్ వ్యాయామాలు, బరువులెత్తే వ్యాయామాలు సిస్టోలిక్ రక్తపోటును రెండు శాతం, డయాస్టోలిక్ రక్తపోటును నాలుగు శాతం తగ్గిస్తాయట! అందుకే బీపీ ఉన్న వారూ బరువులెత్తచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సంస్థ. ఇలాగే దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే అధిక రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతోంది. అయితే - బీపీ సమస్య ఉన్న వారు ఇలా బరువులెత్తే విషయంలో వ్యక్తిగత వైద్యులను సంప్రదించి వారి సలహా పాటించడం ఉత్తమం.
* గర్భిణులు బరువులెత్తే వ్యాయామాలు చేయకూడదు.
ఇది కొంతవరకు నిజమే అయినా.. అందరు గర్భిణులకు ఇది వర్తించదంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొత్తగా ఈ వర్కవుట్ను తమ రొటీన్‌లో భాగం చేసుకోవాలనుకునే గర్భిణులు దీనికి పూర్తి దూరంగా ఉండడం మంచిదంటున్నారు. అలాగే రిస్కీ ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళలు సైతం దీనికి దూరంగా ఉంటేనే మంచిదట! ఇక ఇదివరకే ఈ వ్యాయామం సాధన చేస్తున్నట్లయితే అలాంటి వారు డాక్టర్ సలహా మేరకు ఈ వ్యాయామాన్ని నిస్సందేహంగా కొనసాగించచ్చట! మరీ ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు బరువులెత్తడం వల్ల కొన్ని ప్రయోజనాలు సైతం చేకూరతాయట! ఇందులో భాగంగా.. క్రమంగా పొట్ట పెరుగుతున్న కొద్దీ వచ్చే నడుంనొప్పి.. వంటి శారీరక నొప్పులు తగ్గడంతో పాటు, సుఖ ప్రసవం అయ్యే అవకాశాలూ ఎక్కువగానే ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే - ఈ విషయంలో మీ వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు.
ఇలా వీరే కాదు.. ఏ వయసులో ఉన్న మహిళలైనా ఈ వ్యాయామాలు సాధన చేయచ్చట! అయితే కొత్తగా మొదలుపెట్టే వారు మాత్రం అనుభవజ్ఞులైన నిపుణుల్ని ఎంచుకొని వారి పర్యవేక్షణలో సాధన చేస్తే సత్ఫలితాలుంటాయట!
బరువులెత్తే వ్యాయామాలు చేసే విషయంలో కొంతమందిలో ఉన్న పలు సందేహాలు-వాటికి నిపుణులు చెబుతోన్న సమాధానాలేంటో తెలుసుకున్నారుగా! అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లు కొత్తగా మొదలుపెట్టే వారు, గర్భిణులు, ఇతర అనారోగ్యాలున్న వారు మాత్రం ఒకసారి మీ ఆరోగ్యాన్ని డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని.. వారి సలహా తీసుకున్నాకే ఈ వ్యాయామాలు ప్రారంభించడం మంచిదని గుర్తు పెట్టుకోండి.
ఇదీ చూడండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ