తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఇలా చేస్తే స్ట్రెచ్‌మార్క్స్‌ మాయం..! - స్ట్రెచ్‌మార్క్స్ రిమూవ్​ చిట్కాలు

ప్రసవానంతరం చాలామంది స్త్రీలు ఎక్కువగా ఎదుర్కొనే అతి సాధారణ సమస్య - స్ట్రెచ్‌ మార్క్స్. అలాగని కేవలం డెలివరీ అయిన వాళ్లకే ఈ సమస్య ఎదురవుతుందనుకోవడం పొరపాటు. ఎందుకంటే బరువులో హెచ్చుతగ్గులు, పని ఒత్తిడి వల్ల కూడా చర్మం సాగి స్ట్రెచ్‌మార్క్స్ వస్తుంటాయి. ఒక్కోసారి వీటి వల్ల నచ్చినట్లు డ్రస్సింగ్ కూడా చేసుకోలేం. అయితే ఈ సమస్యకి ఇంట్లో లభించే వస్తువులతోనే సులువైన పరిష్కారాలు లభిస్తాయంటే నమ్ముతారా? నిజమండీ.. అవేంటో చూద్దాం రండి.

If you do this eat stretch marks remove
ఇలా చేస్తే స్ట్రెచ్‌మార్క్స్‌ మాయం..!

By

Published : Mar 16, 2021, 8:31 AM IST

బరువు పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు చర్మం సాగడం సహజం. అలా సాగిన చర్మం తిరిగి యథాస్థితికి వచ్చే క్రమంలో చారల్లా కనిపిస్తూ ఉంటాయి. వాటినే స్ట్రెచ్‌మార్క్స్ అంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, గర్భం ధరించినా బరువు పెరగడం మామూలే. అందుకే ఇలాంటి సమస్య ఎక్కువగా మహిళలకే ఎదురవుతూ ఉంటుంది. వైద్యులు సూచించిన మందులు, క్రీంలతోపాటు ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య తొందరగా తగ్గుముఖం పట్టడానికి అవకాశాలుంటాయి.


బంగాళాదుంప రసంతో..

ఒక బంగాళాదుంపని తీసుకుని కాస్త పెద్దసైజులో ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత ఆ ముక్కలతో స్ట్రెచ్‌మార్క్స్ ఉన్న దగ్గర 10 నిమిషాల పాటు రుద్దాలి. కాసేపు ఆరనిచ్చి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బంగాళాదుంప రసంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మకణాల ఎదుగుదలను ప్రేరేపించి పూర్వపు స్థితికి రావడానికి తోడ్పడతాయి.

రోజూ మాయిశ్చరైజర్..

రోజూ మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల బరువు పెరిగినా లేదా తగ్గినా చారలు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువైపోతాయి. అందుకే స్ట్రెచ్‌మార్క్స్‌పైన మాయిశ్చరైజర్ రాసుకున్నా ఫలితం ఉంటుంది.


ఆముదంతో..

ఇంట్లో మనకు సహజసిద్ధంగా అందుబాటులో ఉండేవి ఆముదం, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్.. మొదలైనవి. వీటిలో ఏదో ఒకటి ఎంచుకుని రోజూ పది నిమిషాల పాటు స్ట్రెచ్‌మార్క్స్ ఉన్నచోట మర్దన చేసుకోవాలి. ఫలితంగా సాగిన చర్మం తిరిగి యథాస్థితికి రావడానికి అవకాశం ఉంటుంది.

కలబందతో..

కలబంద ఆరోగ్యానికి చాలా మంచిదన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీనికున్న ఔషధ గుణాల వల్ల ఇది చర్మ సంబంధిత సమస్యలకు కూడా చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జుని స్ట్రెచ్‌మార్క్స్ ఉన్నచోట రాసి అరగంట పాటు మర్దన చేసుకోవాలి. తర్వాత నీళ్లతో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.


పంచదారతో..

ఒక టేబుల్ స్పూన్ పంచదారకి కొద్దిగా నిమ్మరసం, తగినంత బాదం నూనె కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంతో రోజూ కనీసం పది నిమిషాల పాటు స్ట్రెచ్‌మార్క్స్‌పై మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇదే పద్ధతిని నెల రోజుల పాటు క్రమం తప్పకుండా రోజూ పాటిస్తే మంచి ఫలితం కనపడుతుంది.

తెల్లసొన కూడా పరిష్కారమే!

గుడ్డులోని తెల్లసొనలో ఉండే ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు స్ట్రెచ్‌మార్క్స్‌ని దూరం చేయడంలో బాగా ఉపకరిస్తాయి. రెండు గుడ్లు తీసుకుని అందులోని తెల్లసొనను జాగ్రత్తగా వేరు చేయండి. ఇప్పుడు స్ట్రెచ్‌మార్క్స్ వచ్చిన చోట చర్మాన్ని ముందు నీటితో శుభ్రం చేసి తెల్లసొనని పొరలా రాయండి. పొడిగా అయ్యే వరకు అలాగే ఉంచాలి. తర్వాత చల్లని నీటితో తెల్లసొనని తొలగించుకుని.. స్ట్రెచ్‌మార్క్స్‌పై మాయిశ్చరైజర్‌లా ఆలివ్ నూనెని రాసుకోవాలి.

నిమ్మరసంతో..

నిమ్మకాయలో ఉండే బ్లీచింగ్ గుణాలు సహజసిద్ధంగానే చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ (ఏహెచ్ఏ), విటమిన్-సి స్ట్రెచ్‌మార్క్స్ సమస్య త్వరగా తగ్గుముఖం పట్టేలా చేస్తాయి. నిమ్మకాయని రెండు ముక్కలుగా కోసి మార్క్స్ ఉన్న చోట మృదువుగా రుద్దుకోవాలి. నిమ్మరసం చర్మంలోకి ఇంకేలా మర్దన చేసుకోవాలి. ఇలా పది నిమిషాల పాటు చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా..

నవయవ్వన చర్మం సొంతం కావాలంటే ఇలాంటి చిట్కాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే వదులైన చర్మ కణాలు తిరిగి సాధారణ స్థితికి తొందరగా చేరుకుంటాయి. గ్రీన్ టీ, యాపిల్స్, డార్క్ చాక్లెట్స్, టొమాటోలు, పెరుగు.. మొదలైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్ట్రెచ్‌మార్క్స్‌ని తొందరగా తగ్గేలా చేస్తాయి. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు కావాల్సిన స్థాయిలో ఉంటే స్ట్రెచ్‌మార్క్స్ తొలగిపోవడమే కాదు.. చర్మం బిగుతుగా మారి నవయవ్వనంగా మెరిసిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అన్ని చిట్కాలతో పాటు వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం కూడా తప్పనిసరి. అలాగే ఇలాంటి సమస్యలకు లేజర్ చికిత్సలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. అయితే లేజర్ ట్రీట్‌మెంట్‌ని ఎంచుకునే ముందు వైద్యుల్ని సంప్రదించడం మంచిది.

ఇదీ చూడండి :లాక్​డౌన్ వల్ల దొరికిన 'శాకుంతలం' దుష్యంతుడు

ABOUT THE AUTHOR

...view details