తయారీ..
పావు కప్పు మెంతులను గంటసేపు నీళ్లలో నానపెట్టాలి. ఈలోపు గుప్పెడు చొప్పున గోరింటాకు, కరివేపాకు, తులసి ఆకులను శుభ్రం చేసి మిక్సీలో వేసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీనికి నానిన మెంతులు, గుప్పెడు చిన్న ఉల్లి పాయలు, రెండు చెంచాల కలబంద గుజ్జు వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీజార్‌లో రెండు రెబ్బల కరివేపాకులు, రెండు మందారపూలు, చెంచా మిరియాలు, ఒక కొమ్మ కలబంద ఆకును ముక్కలుగా చేసి మెత్తగా అయ్యాక, మొదట చేసి ఉంచిన మిశ్రమానికి దీన్ని కలపాలి. పొయ్యి వెలిగించి దళసరి గిన్నె పెట్టాలి. అందులో 100 మి.లీ. చొప్పున ఆలివ్, కొబ్బరి నూనెలను వేసి వేడిగా అయిన తర్వాత ముందుగా చేసి ఉంచిన మిశ్రమాన్ని కలపాలి. చిన్నగా తరిగి ఉంచుకున్న ఆరు ఉసిరికాయల ముక్కలను కూడా నూనెలో వేసి, పదినిమిషాలు చిన్నమంటపై ఉడకనివ్వాలి. ఆకుపచ్చని వర్ణంలో ఉన్న ఈ నూనెను వడకట్టి అందులో చిటికెడు పచ్చ కర్పూరం కలిపి చల్లారనివ్వాలి. తలకు ఈ నూనెను పట్టించి మర్దనా చేసుకుని ఓ అరగంట ఆరాక తలస్నానం చేస్తే చాలు, మృదువైన మెత్తని జుట్టు మీ సొంతమవుతుంది.