ఉదయం లేచినప్పటి నుంచి అమల ఉత్సాహంగా పని చేస్తూనే ఉంటుంది. అయితే ఈ మధ్య ఆమెను తరచూ అలసట ఆవరిస్తోంది. ఎప్పటిలాగే ఆహారం తీసుకుంటున్నా నీరసం ఎందుకొస్తోందో అర్థం కావడంలేదు. అయితే మహిళలకు నెలసరి, గర్భందాల్చడం, ప్రసవం వంటి వాటితో పాటు మారుతున్న కాలాలబట్టి ఆరోగ్యంలో మార్పులు సహజం అంటున్నారు నిపుణులు. రక్తహీనత, అలసట వంటి పలు సమస్యల నుంచి బయటపడాలంటే ఇనుము సమృద్ధిగా ఉండే వాటిని ఆహారానికి జత చేయాలని సూచిస్తున్నారు.
* ఆకు పచ్చని వర్ణం...
రక్తహీనతను దరిచేరకుండా మహిళల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇనుముకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చినుకులు పడుతున్న ఈ సమయంలో ఐరన్ ఎక్కువగా ఉన్నవాటిని ఎంచుకోవాలి. వాటిలో ఆకుకూరలు ప్రధానమైనవి. ఆకుపచ్చని వర్ణంలో బీన్స్, చిక్కుడు, బఠాణీ, బ్రకోలీ, బీర, ఆనప, దొండ, పొట్లకాయ, కీరదోస వంటి తాజా కూరగాయల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది.
* గింజలు, ఎండుఫలాలు
జీడిపప్పు, ఆప్రికాట్స్, బాదం, వేరుశనగ, ఎండుద్రాక్ష, ఖర్జూరంవంటి వాటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ ఆహారంలో తీసుకుంటే మహిళలెదుర్కొనే కొన్నిరకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. గుమ్మడి, పొద్దు తిరుగుడు విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్‌ను స్నాక్స్‌గా తీసుకోవడం అలవరుచుకోవాలి.